North Korea: అమెరికాను బెదిరించి.. ఆపై క్షిపణి ప్రయోగం..

ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అమెరికాను బెదిరించిన మర్నాడే ఈ చర్యకు పూనుకొంది. 

Updated : 12 Jul 2023 10:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొరియా ద్వీపకల్పం మరోసారి ఉద్రిక్తంగా మారింది. అమెరికాను బెదిరించిన మర్నాడే ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఈ విషయాన్ని జపాన్‌, ఉత్తరకొరియా అధికారులు ధ్రువీకరించారు. ఈ క్షిపణి జపాన్‌ సముద్ర జలాల్లో బుధవారం ఉదయం పడింది. ఇది తూర్పు దిశగా కొంత సేపు పయనించి జపాన్‌ కాలమానం ప్రకారం ఉదయం 11.15 సమయంలో సముద్ర జలాల్లో పడింది. ఈ విషయాన్ని ఆ దేశ కోస్ట్‌గార్డ్‌ వెల్లడించింది. 

ఉ.కొరియా నియంత్‌ కిమ్‌ సోదరి యో జోంగ్‌ నిన్న అమెరికాపై నిప్పులు చెరిగారు. వాషింగ్టన్‌కు చెందిన నిఘా విమానాలు తమ భూభాగంలోకి చొరబడితే కూల్చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్యాంగ్యాంగ్‌ దూకుడును తట్టుకొనేందుకు దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌ దేశాలు కూడా సంయుక్త యుద్ధ విన్యాసాలను పెంచాయి.

మరోవైపు ఉత్తర కొరియా ఆరోపణలను అమెరికా తోసిపుచ్చింది. తమ సైనిక గస్తీ కార్యకలాపాలు సరిహద్దులకు లోబడే జరుగుతున్నాయని పేర్కొంది. 2022 ఆరంభం నుంచి ఇప్పటివరకు ఉత్తర కొరియా మొత్తం 100కి పైగా క్షిపణి ప్రయోగాలు నిర్వహించింది. ఈ ఏడాది ఓ నిఘా ఉపగ్రహ ప్రయోగానికి కూడా ఉత్తరకొరియా విఫలయత్నం చేసింది. గత ఏప్రిల్‌లో అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకే శక్తి ఉన్న ఐసీబీఎంలను ఉ.కొరియా అభివృద్ధి చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని