Pakistan: మా దేశం దివాలా తీయాలని కొన్ని అంతర్జాతీయ సంస్థలు కోరుకుంటున్నాయి: పాక్‌ ఆర్థిక మంత్రి

పాకిస్థాన్‌ (Pakistan) దివాలా కోసం కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఎదురుచూస్తున్నాయని ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ అన్నారు. నిధుల విడుదలలో ఆలస్యానికి గల కారణాన్ని ఐఎమ్‌ఎఫ్‌  (IMF) ఇప్పటి వరకు వెల్లడించలేదని మంత్రి తెలిపారు.

Published : 16 Jun 2023 18:17 IST

ఇస్లామాబాద్‌: భౌగోళిక రాజకీయాల కారణంగానే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) నుంచి పాకిస్థాన్‌ (Pakistan)కు సాయం అందడంలేదని ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ (Ishaq Dar) ఆరోపించారు. శ్రీలంక తరహాలోనే పాకిస్థాన్‌ కూడా దివాలా తీయాలని కొన్ని అంతర్జాతీయ సంస్థలు కోరుకుంటున్నాయని పరోక్షంగా ఐఎమ్‌ఎఫ్‌ను ఉద్దేశించి దార్‌ వ్యాఖ్యానించారు. దానివల్ల పాక్‌తో సంప్రదింపులు మరింత సులువుగా పూర్తి చేయొచ్చని భావిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. గతేడాది నవంబరు నుంచి బెయిలౌట్‌ ప్యాకేజీపై తొమ్మిదో సమీక్ష నిర్వహణలో ఆలస్యానికి గల కారణాన్ని ఐఎమ్‌ఎఫ్‌ ఇప్పటి వరకు వెల్లడించలేదని తెలిపారు.

ఐఎమ్‌ఎఫ్‌ నుంచి బెయిలౌట్‌ ప్యాకేజీ అందకున్నా.. పాకిస్థాన్‌ దివాలా తీయదని స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకల్లా ఐఎమ్‌ఎఫ్‌ తొమ్మిదో సమీక్ష కూడా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు ఆరు బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు ఐఎమ్‌ఎఫ్‌ 2019లో ఒప్పందం చేసుకుంది. ఇందుకు పాకిస్థాన్‌కు కొన్ని షరతులు విధించింది. అయితే, ఐఎమ్‌ఎఫ్‌ విధించిన షరతులను పాకిస్థాన్‌ పూర్తిగా అమలు చేయకపోడంతో నిధుల విడుదల ఆలస్యమవుతూ వస్తోంది.

ఈ క్రమంలోనే తమ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగిన దేశాలు మూడు బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయానికి హామీ ఉండేందుకు ముందుకువచ్చాయని దార్‌ తెలిపారు. దీంతో వరల్డ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లు మరో మూడు బిలియన్‌ డాలర్ల సాయం అందించేందుకు అంగీకరించాయని చెప్పారు. ఎలాంటి కారణం లేకుండా నిధుల విడుదలను ఆలస్యం చేయడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను చైనా గ్రహించిందని, అందుకే ఆ దేశ బ్యాంకులు పాకిస్థాన్‌కు రుణాలు మంజూరు చేసేందుకు ముందుకొచ్చాయని దార్‌ తెలిపారు.

మూడు బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయానికి సంబంధించి సౌదీ అరేబియా, యూఏఈలు ఐఎమ్‌ఎఫ్‌కు హామీ ఇచ్చాయని, RISE ప్రాజెక్ట్‌ కింద వరల్డ్ బ్యాంక్‌ 400 మిలియన్‌ డాలర్లు, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ మరో 250 మిలియన్‌ డాలర్ల ఆర్థికం సాయం అందించనున్నాయని చెప్పారు. కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్‌ 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అనంతరం, పాకిస్థాన్‌ అవకాశాన్ని కోల్పోయిందని.. బడ్జెట్‌ను ఉద్దేశించి ఐఎమ్‌ఎఫ్‌ వ్యాఖ్యానించింది. దీనిపై పాక్‌ ఆర్థిక మంత్రి స్పందిస్తూ తాజా వ్యాఖ్యలు చేశారు.

‘‘బడ్జెట్‌లో ఐఎమ్‌ఎఫ్‌ సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, ఐటీ, వ్యవసాయం, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వంటి రంగాలకు కేటాయింపులు చేయకుండా ఆర్థికాభివృద్ధి సాధ్యంకాదు. ప్రస్తుతం దేశ ఆర్థికాభివృద్ధి రేటు 0.29 శాతంగా ఉంది. ఈ ఏడాది ఐటీ పరిశ్రమ 2.5 బిలియన్‌ డాలర్ల వృద్ధిని సాధిస్తుందని, వచ్చే ఏడాది నాటికి ఇది 4.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. ఐటీ పరిశ్రమను వృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మిగిలిన రంగాలకు కేటాయింపుల్లో మినహాయింపులు ఇచ్చాం’’ అని ఇషాక్‌ దార్‌ తెలిపారు. గత కొన్నేళ్లుగా పాక్‌ ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉంది. దీంతో నిత్యావసరాల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పాకిస్థాన్‌ ఐఎమ్‌ఎఫ్‌ నుంచి ఆర్థిక సాయం కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని