Pakistan: ఐఎంఎఫ్‌ ఎండీతో భేటీకి పాక్‌ ప్రధాని యత్నాలు

పాకిస్థాన్‌ అధినాయకత్వం ఐఎంఎఫ్‌ ఎండీతో భేటీ అయ్యేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలను చేస్తోంది. 

Published : 22 Jun 2023 16:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాక్‌(Pakistan)కు సాయం అందించే విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి వెనుకంజ వేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇదే సమయంలో పాక్‌(Pakistan) ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టిలినా జార్జివాతో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ది పారిస్‌ సమ్మిట్‌లో ఈ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈ సదస్సు జూన్‌ 22 నుంచి 23వ తేదీ వరకు జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్న పాకిస్థాన్‌ 1.2 బిలియన్‌ డాలర్ల సాయం కోసం ఐఎంఎఫ్‌ తలుపు తట్టిన విషయం తెలిసిందే.

ఇప్పటికే పాక్‌ ప్రధాని గత నెలలో ఆమెతో టెలిఫోన్‌లో సంభాషించారు. దీంతో పాటు సాయం కోసం మూడు సార్లు లేఖలు కూడా రాశారు. అయినా ఎటువంటి సానుకూల ఫలితం రాలేదు. ప్రస్తుత ప్యాకేజీకి జూన్‌ 30న గడువు ముగియనుంది. కానీ ఎక్స్‌టెండెడ్‌ ఫండ్‌ ఫెసిలిటీ (ఈఎఫ్‌ఎఫ్‌) తొమ్మిదో సమీక్ష పెండింగ్‌లో ఉంది. ‘‘తాజాగా ప్రధాని అభ్యర్థనను తిరస్కరిస్తే కనుక.. 6.7 బిలియన్‌ డాలర్ల ఈఎఫ్‌ఎఫ్‌ కార్యక్రమాన్ని పునరుద్ధరించే అవకాశాలు కనుమరుగవుతాయి. ఒక వేళ మీటింగ్‌ జరిగి సానుకూల ఫలితాలు వెలువడితే.. పాక్‌ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి అందుతుంది’’ అని ఆ దేశ ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఆంగ్ల వార్తా సంస్థకు వెల్లడించారు. 

ప్రస్తుతం పాక్‌ వద్ద 4 బిలియన్‌ డాలర్ల కంటే తక్కువ విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. ఇవి కేవలం ఒక్క నెల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఇప్పటికే తమ దేశ అభ్యర్థనను ఐఎంఎఫ్‌ తిరస్కరించిందని పాక్‌ మంత్రివర్గ సభ్యుడు డాక్టర్‌ ఐషా పాషా వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని