Pakistan: అత్యాచారాలతో వణుకుతోన్న పాకిస్థాన్‌.. ఎమర్జెన్సీ విధింపునకు సిద్ధం

మహిళలపై అఘాయిత్యాలతో పాకిస్థాన్‌లోని (Pakistan) పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌ ప్రావిన్సులో (Punjab Province) మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి.

Published : 22 Jun 2022 01:05 IST

పంజాబ్‌ ప్రావిన్సు అధికారుల నిర్ణయం

లాహోర్‌: మహిళలపై అఘాయిత్యాలతో పాకిస్థాన్‌లోని (Pakistan) పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌ ప్రావిన్సులో (Punjab Province) మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి. ప్రతిరోజూ అక్కడ నాలుగైదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా మహిళలపై జరుగుతోన్న దాడులను నియంత్రించేందుకు ఉపక్రమించిన ప్రావిన్సు అధికారులు.. ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ (Emergency) విధించాలని నిర్ణయించారు.

‘పంజాబ్‌ ప్రావిన్సులో నిత్యం నాలుగు నుంచి ఐదు రేప్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇలా ప్రావిన్సులోని మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసులు గణనీయంగా పెరగడం ఆందోళనకర విషయం. ఈ పరిణామం ప్రభుత్వంతోపాటు సమాజానికి అత్యంత తీవ్రమైన అంశం. ఈ నేపథ్యంలో అత్యాచారాలు, మహిళలపై దాడుల కేసులన్నింటినీ కేబినెట్‌ సబ్‌కమిటీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది’ అని పంజాబ్‌ హోంమంత్రి అత్తా తరార్‌ పేర్కొన్నారు. మరోవైపు ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు ఉన్న అవకాశాలపై పౌర సమాజం, మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు, సైనికాధికారులతో సంప్రదింపులు జరుపుతామన్నారు.

అత్యాచార వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టిందన్న ఆయన.. మహిళలపై దాడులకు పాల్పడే వారిని అరెస్టు చేస్తున్నామని చెప్పారు. లైంగిక వేధింపుల విషయంపై పాఠశాలల్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కేసులను త్వరితగతిన విచారణ పూర్తిచేయడంలో కీలకమైన పంజాబ్‌ ప్రావిన్సు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఏజెన్సీని కూడా మరింత బలోపేతం చేస్తున్నామని పంజాబ్‌ ప్రావిన్సు హోంమంత్రి వెల్లడించారు. ఇక రాష్ట్రంలో స్కూళ్లు, పాఠశాలల్లో డ్రగ్స్‌ తీసుకోవడం ఫ్యాషన్‌గా మారడంపై స్పందించిన ఆయన.. ఈ విషయంపై చింతిస్తున్నానని అన్నారు. ఇక భద్రత గురించి ప్రాముఖ్యతను తమ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. యుక్తవయసు పిల్లల్ని ఇళ్లల్లో ఒంటరిగా వదిలివేయకూడదని.. వారిపై ఎప్పటిప్పుడు పర్యవేక్షణ చేయాలని తల్లిదండ్రులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని