Pakistan: ‘మాదే అతిపెద్ద పార్టీ..’ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు నవాజ్‌ ప్రయత్నాలు!

పాకిస్థాన్‌ ఎన్నికల ఫలితాల్లో ‘పీఎంఎల్-ఎన్’ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని నవాజ్‌ షరీఫ్‌ ప్రకటించడం గమనార్హం.

Updated : 09 Feb 2024 22:16 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల (Pakistan Elections) ఫలితాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌’ (PTI) పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు సమాచారం. వారు ఇప్పటివరకు 61 స్థానాల్లో గెలుపొందినట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ (Nawaz Sharif) నేతృత్వంలోని ‘పీఎంఎల్‌-ఎన్‌’ పార్టీకి 43 సీట్లు, ‘పీపీపీ’కి 34 సీట్లు వచ్చినట్లు వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. ఇలా ఒకవైపు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే.. ‘పీఎంఎల్-ఎన్’ పాకిస్థాన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిందని నవాజ్‌ షరీఫ్‌ ప్రకటించడం గమనార్హం.

మాతో చేతులు కలపండి.. నవాజ్‌ పిలుపు

ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా నవాజ్‌ షరీఫ్‌ పావులు కదుపుతున్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలను గౌరవిస్తున్నానని, దేశ పునర్నిర్మాణం దిశగా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకుగానూ ఇతర పార్టీలు తమతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. సంక్షోభ పరిస్థితుల నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడంలో అన్ని సంస్థలు కలిసి సానుకూల పాత్ర పోషించాలని కోరారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు.. పీపీపీ, జేయూఐ-ఎఫ్‌, ఎంక్యూఎం-పీ తదితర పార్టీలతో సంప్రదింపులు జరపాలని తన సోదరుడు షెహబాజ్‌కు సూచించినట్లు చెప్పారు.

పాక్‌ ఎన్నికల్లో ఇమ్రాన్‌ ‘అభ్యర్థుల’ హవా?

పాకిస్థాన్‌లో 265 స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించగా.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడి జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఓ స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో 265 సీట్లకే ఎన్నికలు నిర్వహించారు. జైల్లో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌పై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఆయన పార్టీ పీటీఐ అధికారిక చిహ్నం క్రికెట్‌ బ్యాట్‌ను ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రంగా బరిలోకి దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని