Imran Khan: జీవితాంతం జైల్లో ఉండటానికైనా సిద్ధమే : ఇమ్రాన్‌ఖాన్‌

తోషఖానా (Toshakhana) కేసులో పాక్‌ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అటాక్‌ జైలులో ఆయన ఖైదీగా ఉన్నారు.

Published : 18 Aug 2023 20:40 IST

ఇస్లామాబాద్‌: దేశం కోసం తాను జీవితాంతం జైల్లో ఉండటానికైనా సిద్ధంగా ఉన్నానని పాక్‌ (Pakistan) మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ (Imran Khan) చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ప్రభుత్వానికి వచ్చిన బహుమతులు (తోషఖానా) (Toshakhana) విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆయనపై కేసు నమోదైంది. ఆగస్టు 5న ఆ కేసును విచారించిన సెషన్స్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దాంతో ఆయన పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అటాక్‌ జైలులో ఖైదీగా ఉన్నారు. ఈ శిక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 22న డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ పార్టీ న్యాయబృంద సభ్యుడు ఉమైర్‌ నియాజి జైల్లో ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ అయ్యారు. 

దురుద్దేశంతోనే ముశాల్‌కు కేబినెట్‌లో చోటు.. పాక్‌ నిర్ణయంపై మాజీ డీజీపీ వ్యాఖ్య

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఆరోగ్యంగానే ఉన్నారని, కాస్త గడ్డం పెంచారని న్యాయవాది ఉమైర్‌ తెలిపారు. ఆయనకు ఒక అద్దం, షేవింగ్‌ కిట్ అందజేశారని చెప్పారు. ఇమ్రాన్‌ను కలిసేందుకు కోర్టు ఆరుగురిని అనుమతించినప్పటికీ జైలు అధికారులు ఒకరిని మాత్రమే లోపలికి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేస్తామన్నారు. ‘జైల్లో వసతుల గురించి నేను లెక్క చేయడం లేదు. నన్ను మరో వెయ్యేళ్లు జైల్లో పెట్టాలనుకున్నా సరే. అందుకు సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే స్వేచ్ఛకోసం త్యాగాలు చేయాల్సిందేనని’ ఇమ్రాన్‌ తనతో చెప్పినట్లు ఉమైర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్‌పై దేశవ్యాప్తంగా 140 కేసులున్నాయి. 2022 ఏప్రిల్‌లో ఆయన ప్రధాని పీఠం నుంచి దిగిపోయినప్పటి నుంచి ఉగ్రవాదం, విధ్వంసం, దైవ దూషణ, అవినీతి, హత్య కేసులు నమోదయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని