Odisha Mystery: ఒకే హోటల్‌లో.. ఇద్దరు రష్యన్‌ల మృతి.. అసలేం జరిగింది..?

భారత్‌లో పర్యటిస్తోన్న రష్యాకు చెందిన ఓ చట్టసభ సభ్యుడితోపాటు మరో వ్యక్తి  అనుమానాస్పదంగా మృతి చెందారు. మిత్రుడి మరణం తట్టుకోలేకనే మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రష్యన్లు చనిపోవడం చర్చనీయాంశమయ్యింది. 

Published : 27 Dec 2022 19:26 IST

మాస్కో: భారత్ పర్యటనలో ఉన్న ఇద్దరు రష్యన్లు (Russians) రెండు రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. రష్యా చట్టసభ సభ్యుడు, వితరణశీలి పావెల్‌ ఆంటోవ్‌ ఇటీవల ఒడిశా (Odisha)లోని రాయగడలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. స్థానిక హోటల్‌లో బస చేసిన ఆయన మూడో అంతస్తు నుంచి కిందపడి చనిపోయినట్లు భావిస్తున్నారు. అంతకు రెండురోజుల క్రితం.. అదే హోటల్‌లో ఆయన స్నేహితుడూ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. అయితే, వీరిలో చట్టసభ సభ్యుడు పావెల్‌ ఆంటోవ్‌.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అధ్యక్షుడు పుతిన్‌పై కొన్ని నెలల క్రితం విమర్శలు చేశారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

రష్యాలో సంపన్నుడిగా పేరొందిన పావెల్‌ ఆంటోవ్‌(65) తన పుట్టిన రోజును చేసుకునేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి డిసెంబరు 21న ఒడిశాలోని రాయగడకు చేరుకున్నారు. పావెల్‌ మిత్రుడు వ్లాదిమిర్‌ బిదెనోవ్‌(61) డిసెంబర్‌ 22న అనుమానాస్పద స్థితిలో  హోటల్‌ ప్రాంగణంలో మరణించారు. గుండెపోటు కారణంగా మరణించి ఉండొచ్చని భావించిన పోలీసులు.. కుటుంబ సభ్యుల అనుమతితో అంత్యక్రియలు పూర్తిచేశారు. రెండు రోజుల తర్వాత అదే హోటల్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌ సమీపంలో రక్తపు మడుగులో పావెల్‌ అంటోవ్‌ కనిపించారు. అయితే, ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..? లేక మూడో అంతస్తు నుంచి జారిపడ్డారా..? అనే విషయంపై స్పష్టత లేదని హోటల్‌ నిర్వాహకులు వెల్లడించారు. బాల్య స్నేహితుడి (వ్లాదిమిర్‌ బిదెనోవ్‌) మరణాన్ని తట్టుకోలేకనే ఆంటోవ్‌ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రష్యన్లు భారత్‌లో ప్రాణాలు కోల్పోవడంపై ఎన్నో ఊహాగానాలు వెలువడుతున్నాయి. పుతిన్‌పై విమర్శలు గుప్పించేవారు రష్యాలో ఇలాగే అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై భారత్‌లోని రష్యా ఎంబసీ తాజాగా స్పందించింది. ఒడిశాలో జరిగిన విషాద ఘటన తమకు తెలిసిందని పేర్కొంది. అందులో పావెల్‌ ఆంటోవ్‌.. రష్యాలోని ‘వ్లాదిమిర్‌ ఒబ్లాస్ట్‌’ అసెంబ్లీ సభ్యుడని వెల్లడించింది. వారు బస చేస్తున్న హోటల్‌ గది కిటికీ నుంచి కిందపడి చనిపోయినట్లు తమకు తెలిసిందని పేర్కొంది. ఇప్పటివరకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అందులో నేరపూరిత కోణం ఏమీ లేదని రష్యా రాయబార కార్యాలయం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని