Ukraine Crisis: ఈ ఖాళీ స్ట్రోలర్స్‌ వెనుక.. కనిపించని కడుపుకోత..!

లివీవ్‌ ప్రాంతంలోని రినోక్‌ స్క్వేర్‌... నేతల యుద్ధకాంక్షకు చెల్లించుకున్న భారీ మూల్యానికి నిలువెత్తు నిదర్శనం. నిర్జీవంగా మారిన బిడ్డను తలుచుకుంటూ తల్లడిల్లుతోన్న తల్లుల కన్నీటికి సజీవ సాక్ష్యం.

Published : 20 Mar 2022 01:51 IST

కీవ్‌: లివీవ్‌ ప్రాంతంలోని రినోక్‌ స్క్వేర్‌... నేతల యుద్ధకాంక్షకు చెల్లించుకున్న భారీ మూల్యానికి నిలువెత్తు నిదర్శనం. నిర్జీవంగా మారిన బిడ్డలను తలుచుకుంటూ తల్లడిల్లుతోన్న తల్లుల కన్నీటికి సజీవ సాక్ష్యం. అక్కడ వరుసలు తీరిన స్ట్రోలర్స్‌.. ఈ ప్రపంచానికి వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నాయి. పుతిన్‌ను నిలువరించాలని రష్యన్‌ తల్లులను సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మూడు వారాలుగా ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం నడుస్తుండగా.. ఇన్ని రోజుల్లో ఎన్నో పసిప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ స్ట్రోలర్స్‌.. తల్లులు పడుతోన్న వేదనను ప్రపంచానికి చెప్తున్నాయి. ఈ సంతాప దృశ్యాలను లివీవ్‌ మేయర్ ఆండ్రియ్‌ సడోవియ్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

‘109 మంది పసిబిడ్డలు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టిన దగ్గరి నుంచి ఇంత మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇది భయంకరమైన యుద్ధమూల్యం. ఉక్రెయిన్‌ పిల్లలను రక్షించుకునేందుకు, వారికి భవిష్యత్తును అందించేందుకు ఈ ప్రపంచంలోని పెద్దలంతా ఒక కవచంలా నిలవాలని మేం అభ్యర్థిస్తున్నాం’ అంటూ మేయర్ ఈ చిత్రాలను షేర్ చేశారు. ముక్కుపచ్చలారని ఆ 109 మంది చిన్నారుల మృతికి సంతాపంగా ఈ స్ట్రోలర్స్‌ను లివీవ్‌లోని రినోక్ స్క్వేర్ వద్ద ఉంచారు.

ఈ చిత్రాలను చూసి చలించని హృదయం లేదు. మీ పిల్లలు అలా స్ట్రోలర్స్‌లో తిరిగిన విషయాన్ని ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకోండంటూ రష్యన్‌ తల్లులను కొందరు సూటిగా అడుగుతున్నారు. ‘ఆ చిన్నారులు చనిపోవడంతో ఇక స్ట్రోలర్‌లో ఉంచలేం. అక్కడ మీ పిల్లలున్నట్లు ఒక్క నిమిషం ఊహించుకోండి. మీ బిడ్డల పట్ల మీరెలా స్పందిస్తారో గుర్తు తెచ్చుకోండి. నేను ఇక ఖాళీ స్ట్రోలర్‌ను చూడదల్చుకోలేదు’ అని ఉక్రెయిన్ మహిళ ఒకరు తీవ్ర ఆవేదన చెందారు.

ఇదిలా ఉండగా.. ఈ దురాక్రమణ కారణంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్తూ.. గాయపడిన చిన్నారులున్నారు. తమ శరీర భాగాలు కోల్పోయి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారున్నారు. వారికి చికిత్స అందించే క్రమంలో వైద్య సిబ్బందీ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఇప్పటివరకూ 130 మంది పిల్లలు గాయపడి ఉంటారని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కలు ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. దాడులు తీవ్రంగా ఉండటంతో వాస్తవ గణాంకాలు తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని