Sri Lanka Crisis: శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స

మన పొరుగు దేశం శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 12 Sep 2022 11:10 IST

కొలంబో: మన పొరుగు దేశం శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గెజిట్‌ జారీ చేశారు. శ్రీలంకలో ఇటీవల తీవ్ర అశాంతి నెలకొనడంతోనే  అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజల భద్రత, అత్యవసర సేవలు, నిత్యావసరాల సరఫరా నేపథ్యంలో ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు పేర్కొన్నారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో గత కొన్నిరోజులుగా ప్రజలు నిత్యవసరాల కోసం అల్లాడుతున్నారు. పెరిగిన ధరలు, ఆహార పదార్థాల కొరత, విద్యుత్‌ కోతలు, ఇంధన కొరతతో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసన చేపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి వేలాది మంది అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. అధ్యక్ష స్థానం నుంచి రాజపక్స తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తూ భారీ ఎత్తున నిరసనకారులు ఆందోళనకు దిగారు. దీంతో ఇది తీవ్రరూపం దాల్చింది. పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు. దీంతో కొలంబోలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు.   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని