Spying: ఇజ్రాయెల్‌ తరఫున గూఢచర్యం..! తుర్కియే కస్టడీలో 33 మంది అనుమానితులు

ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో 33 మందిని తుర్కియే అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 02 Jan 2024 20:32 IST

అంకారా: ఇజ్రాయెల్ (Israel) తరఫున గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై 33 మంది అనుమానితులను తుర్కియే అదుపులోకి తీసుకుంది. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొసాద్‌ (Mossad)తో సంబంధం ఉందని భావిస్తున్న మరో 13 మంది కోసం వేట కొనసాగుతోందని ఇక్కడి అధికారిక వార్తాసంస్థ (Anadolu) తెలిపింది. హమాస్‌ నేతలు ఏ దేశంలో దాక్కున్నా.. వారిని అంతమొందించేందుకు టెల్‌ అవీవ్‌ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను తుర్కియే ఖండిస్తోన్న విషయం తెలిసిందే.

తుర్కియేలో నివసిస్తున్న విదేశీయులపై నిఘా, దాడులు, కిడ్నాప్ వంటి కార్యకలాపాలకు కొంతమంది ప్రణాళికలు రూపొందించినట్లు స్థానిక అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఇస్తాంబుల్‌ సహా ఏడు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, 33 మందిని కస్టడీలోకి తీసుకున్నట్లు వార్తాసంస్థ తెలిపింది. అయితే, వారి వివరాలు వెల్లడించలేదు. హమాస్‌ నేతలకు తుర్కియే ఆశ్రయమిస్తోందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఇటీవల ఆరోపించారు. మరోవైపు.. తమ భూభాగంలో హమాస్ నేతలపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ హెచ్చరించారు.

యుద్ధం ఆగినా.. ఇజ్రాయెల్‌ వేట కొనసాగేనా?

ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దశాబ్దాలుగా అంతంతమాత్రమే. అయితే, 2022లో రాయబారులను తిరిగి నియమించడం ద్వారా తమ మధ్య విభేదాలను తగ్గించుకునే ప్రయత్నం చేశాయి. ఇజ్రాయెల్- హమాస్‌ యుద్ధంతో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. ఇరుదేశాలు తమతమ దౌత్యవేత్తలను వెనక్కు రప్పించాయి. గాజాపై దాడులను ఎర్డోగాన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఇజ్రాయెల్‌ను ఉగ్రవాద దేశంగా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని