Covid-19: ఆ వ్యక్తికి వరుసగా 505 రోజులు కరోనా పాజిటివ్‌..

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి శరీంలో కరోనా ఏకంగా ఏడాదిన్నరకుపైగా ఉందన్న విషయం విస్తుగొలుపుతోంది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న ఆ వ్యక్తి శరీరంలో 505 రోజులపాటు......

Published : 22 Apr 2022 16:46 IST

తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాల వెల్లడి

లండన్‌: ఓ వ్యక్తికి కరోనా సోకితే అతడి శరీరంలో వైరస్‌ ఐదు రోజులు, వారం, లేదా మహా అయితే 15-30 రోజులు ఉంటుంది. కానీ, బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి శరీరంలో కరోనా ఏకంగా ఏడాదిన్నరకు పైగా ఉందన్న విషయం విస్తుగొలుపుతోంది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న ఆ వ్యక్తి శరీరంలో 505 రోజులపాటు కరోనా వైరస్​ సజీవంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. 2020 ఆరంభంలో వైరస్ బారినపడిన ఆ రోగికి.. రెమిడెసివిర్​ సహా మరెన్నో ఔషధాలతో చికిత్స అందించినా 2021లో మృతిచెందినట్లు వెల్లడైంది.

ఇతర వ్యాధుల కారణంగా ఆ వ్యక్తి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అప్పటికే తీవ్రంగా బలహీనపడిందని.. అందుకే ఏడాదిన్నరకుపైగా కరోనా అలానే ఉందని లండన్​ కేంద్రంగా పనిచేసే గయ్స్ అండ్ సెయింట్ థామస్ ఎన్​హెచ్​ఎస్​ ఫౌండేషన్​ ట్రస్ట్​లో అంటువ్యాధుల నిపుణుడు డా.లూక్ బ్లాగ్డాన్ స్నెల్ వివరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా కరోనా పాజిటివ్ ఉన్న కేసు ఇదేనా అని కచ్చితంగా చెప్పడం కష్టమని ఆయన పేర్కొన్నారు. అన్ని కేసుల్లోనూ ఇలా క్రమబద్ధంగా టెస్టులు చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు.

ఇదే తరహాలో సుదీర్ఘకాలం పాటు 9 కరోనా పాజిటివ్​ కేసులపైనా స్నెల్ బృందం అధ్యయనం చేసింది. అవయవ మార్పిడి, హెచ్​ఐవీ, క్యాన్సర్ లేదా ఇతర రోగాలకు చికిత్స తీసుకుంటూ ఉండడం కారణంగా ఆ 9 మంది రోగనిరోధక వ్యవస్థలు తీవ్రంగా బలహీనపడినట్లు గుర్తించారు. ఇలా సూపర్​లాంగ్ ఇన్​ఫెక్షన్లు ఉన్న వారి శరీరంలోనే కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయా అనే కోణంలో వీరి పరిశోధనలు జరగగా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ 9 మందికి సగటున 73 రోజులు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఇద్దరు బాధితులు సంవత్సరం కన్నా ఎక్కువకాలం వైరస్‌తో పోరాడారు. ఇలాంటి వారి నుంచి ఇతరులకు కొవిడ్‌ వ్యాపిస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు కరోనా బారినపడకుండా చూసుకోవడం సహా అలాంటి వారికోసం ప్రత్యేక చికిత్స విధానాలు తయారు చేయాల్సిన అవసరాన్ని ఈ పరిశోధన తెలియచెబుతోందని స్నెల్ అన్నారు. జనసమూహంలో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని సూచించారు. అధ్యయనంలోని మరిన్ని విషయాలను ఈ వారాంతంలో పోర్చుగల్​లో జరిగే ఓ సదస్సులో స్నెల్ బృందం వివరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని