Imran Khan: ప్రధానిగా ఇమ్రాన్‌ను తప్పించాలని అమెరికా సూచించింది!

పాకిస్థాన్‌ రాయబారికి, అమెరికా ప్రభుత్వాధికారులకు మధ్య కీలక సమావేశం జరిగిన మరుసటి రోజు ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా పాక్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. 

Published : 10 Aug 2023 11:45 IST

వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌: ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)ను తప్పించాలని పాకిస్థాన్‌ (Pakistan) ప్రభుత్వాన్ని అమెరికా (USA) ప్రోత్సహించిందని ఓ అంతర్జాతీయ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.  దీనిని ధ్రువీకరించేలా.. పాకిస్థాన్‌ ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు అమెరికాలో పాకిస్థాన్‌ రాయబారికి, అమెరికా ప్రభుత్వాధికారులకు మధ్య  ఓ సమావేశం జరిగిన మరుసటి రోజు ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా పాక్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం విషయంలో ఇమ్రాన్‌ ఖాన్‌ తటస్థ వైఖరి కారణంగానే ఆయన్ను ప్రధాని పదవి నుంచి తప్పించాలని అమెరికా నిర్ణయించినట్లు తెలిపింది. 

ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో పాకిస్థాన్‌ రాయబారి అసద్‌ మజీద్ ఖాన్‌తో అమెరికా హోంశాఖలోని ఇద్దరు ముఖ్య అధికారులతోపాటు దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డోనాల్డ్‌ లూ మే 7, 2022న సమావేశమయ్యారు. ఇది జరిగిన మరుసటి రోజు.. మే 8, 2022న ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని తెలిపింది. ఏప్రిల్‌ 10, 2022న ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ నుంచి వైదొలిగారు. అనంతరం షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

జైల్లో ఉండలేను.. ఇక్కడి నుంచి తీసుకెళ్లండి

పాక్‌ రాయబారి, అమెరికా ప్రభుత్వాధికారుల మధ్య భేటీకి ముందు.. ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌లో ర్యాలీ చేపట్టారు. ఇందులో అమెరికాను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు చెప్పిందల్లా చేయడానికి మేం మీ బానిసలం కాదు. మాకు రష్యాతోపాటు అమెరికాతో మైత్రి బంధం ఉంది. అలాగే చైనా, ఐరోపాలో కూడా మాకు మిత్రులున్నారు. మేం ఏ కూటమిలో భాగస్వామ్యులం కాదు’’ అని ఇమ్రాన్‌ ర్యాలీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై యూరప్‌ దేశాలు సహా అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు డోనాల్డ్‌ లూ పాక్‌ రాయబారికి తెలిపినట్లు పత్రాల్లో ఉన్నాయని వెల్లడించింది. ఒకవేళ ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నెగ్గితే.. పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ చేసిన రష్యా పర్యటనను వాషింగ్టన్‌ క్షమిస్తుందని డోనాల్డ్‌ చెప్పినట్లు పేర్కొంది. 

అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఇమ్రాన్‌ మాట్లాడుతూ.. తనను ప్రధాని పదవి నుంచి తొలగించడం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని అమెరికాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అనంతరం నెలకొన్న పరిణామాలతో తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన అటక్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని