Bill Gates: బిల్‌గేట్స్‌ చేతిలో సల్మాన్‌ ఖాన్‌ ఫొటో.. ఎందుకో తెలుసా?

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ (Bill Gates) బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఫొటోను చేతిలో పట్టుకుని కన్పించారు. భాయిజాన్‌ ఫొటోను ఆయన ఎందుకు చూపించారని ‘కన్‌ఫ్యూజ్‌’ అవుతున్నారా?అదేంటో చదివేయండి మరి..!

Published : 16 Aug 2023 11:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ (Bill Gates) ఇటీవల సొంతంగా ఓ పాడ్‌కాస్ట్‌ (podcast)ను ప్రారంభించారు. ‘అన్‌కన్‌ఫ్యూజ్‌ మి విత్‌ బిల్‌ గేట్స్‌’ పేరుతో పలువురు ప్రముఖులను ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ పాడ్‌కాస్ట్‌ రెండో ఎపిసోడ్‌లో ప్రముఖ ఎన్జీవో సంస్థ ఖాన్‌ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్‌ ఖాన్‌ (Sal Khan)తో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ (Bollywood) నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) గురించి వీరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

సల్మాన్‌, సాల్‌ ఖాన్‌ ఇద్దరి పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతో గేట్స్‌ దీని గురించి ప్రశ్నించారు. ‘‘మీరెప్పుడైనా వెబ్ సెర్చ్‌లో సాల్‌ ఖాన్‌ గురించి వెతికినప్పుడు.. బహుశా ఈ వ్యక్తి కన్పించి ఉంటారు కదా..!’’ అంటూ బాలీవుడ్‌ కండల వీరుడి ఫొటోను సాల్‌ ఖాన్‌కు చూపించారు. ఆయన బదులిస్తూ.. అవునంటూ చిరునవ్వులు చిందించారు.

రూ.వందల కోట్లున్నా.. అమ్మాయి దొరకట్లేదు!

ఆ తర్వాత, ‘‘ఎప్పుడైనా మీరు సల్మాన్‌ ఖాన్‌ వల్ల కన్‌ఫ్యూజ్‌ అవ్వాల్సి వచ్చిందా?’’ అని ప్రశ్నించారు. దీనికి సాల్‌ ఖాన్‌ స్పందిస్తూ.. ‘‘అవును. నేను అకాడమీ ప్రారంభించిన తొలినాళ్లలో ఆ నటుడి (సల్మాన్‌ ఖాన్‌) అభిమానుల నుంచి నాకు మెయిల్స్ వచ్చాయి. ‘మీరంటే మాకు చాలా అభిమానం. కానీ మీరు లెక్కలు కూడా చేయగలరని నాకు తెలియదు’ అని సల్మాన్‌ ఖాన్‌ అనుకుని నాకు సందేశాలు పంపేవారు’’ అని సాల్‌ ఖాన్‌ చెప్పడంతో బిల్‌గేట్స్ నవ్వులు చిందించారు.

ఇక, ఈ ఇంటర్వ్యూలో సల్మాన్‌ ఖాన్‌తో తనకున్న పరిచయాన్ని సాల్‌ ఖాన్‌ పంచుకున్నారు. 2015లో తాను భారత్‌కు వెళ్లినప్పుడు ఓ టీవీ కార్యక్రమంలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి పాల్గొన్నానని తెలిపారు. ఈ వీడియోను బిల్‌గేట్స్ తన యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని