logo

మా సొమ్ము మా కివ్వడానికి ఇన్ని కష్టాలా?

శ్రమ.. శక్తికి మించి పెట్టుబడులు.. ప్రకృతి వైపరీత్యాలు.. అప్పుల బాధలు.. ఇలా విత్తు వేసింది మొదలు ఫలసాయం అందే వరకూ అన్నీ అవాంతరాలే. అయినా..వరి సిరులు కురిపిస్తుందని రైతన్న ఆకాంక్ష.  అందుకే కష్టాలు కసిరినా.. కన్నీళ్లు

Published : 20 Aug 2022 05:17 IST

ఇంకా అందని రబీ ధాన్యం బకాయిలు

ఖరీఫ్‌ సాగుకు కష్టాలు  

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే-భీమవరం అర్బన్‌, పెనుమంట్ర, దెందులూరు, ఆకివీడు

శ్రమ.. శక్తికి మించి పెట్టుబడులు.. ప్రకృతి వైపరీత్యాలు.. అప్పుల బాధలు.. ఇలా విత్తు వేసింది మొదలు ఫలసాయం అందే వరకూ అన్నీ అవాంతరాలే. అయినా..వరి సిరులు కురిపిస్తుందని రైతన్న ఆకాంక్ష.  అందుకే కష్టాలు కసిరినా.. కన్నీళ్లు ముసిరినా.. విపత్తులు ఉరిమినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. నెలల పర్యంతం పేరుకుపోయిన బకాయిలు అన్నదాత వెన్ను విరుస్తున్నాయి. ఖరీఫ్‌ మధ్య దశకువచ్చినా రబీ ధాన్యం అమ్మిన సొమ్ము అక్కరకు రాక ఆర్తిగా చూస్తున్నారు.

ధాన్యం ఎగుమతి చేస్తున్న కూలీలు

ధాన్యం విక్రయించిన 48 గంటల్లో నగదు చెల్లించాలన్న నిబంధన గతంలో ఉండేది. దాన్ని వైకాపా ప్రభుత్వం 21 రోజులకు మార్చింది. క్షేత్రస్థాయిలో మాత్రం నెలలు గడిచినా అన్నదాతకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. విక్రయించిన తరువాత రెండు వారాల వరకూ చాలా చోట్ల ఆన్‌లైన్‌లో నమోదు చేయటం లేదు. నమోదు చేసిన తర్వాతైనా 21 రోజుల్లో నగదు జమవుతుందా అంటే అదీ లేదు. రబీ సీజన్‌ ముగిసి ఖరీఫ్‌ కూడా పూర్తి కావస్తున్నా సొమ్ములు రాలేదంటే పరిస్థితి అర్థమవుతోంది.
ఉమ్మడి జిల్లాలో రబీ బకాయిలు రూ.379 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీరంతా 21 రోజులు దాటిన వారే. పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.249 కోట్లు బకాయిలున్నాయి. దాదాపు 10 వేల మందికి నగదు రావాల్సి ఉంది. ఏలూరులో 4వేల మంది రైతులకు రూ.130 కోట్ల బకాయిలున్నాయి. ఒకవైపు రబీకి చేసిన అప్పులు తీర్చ లేక..ఖరీఫ్‌కు కొత్తగా ఇచ్చేవారిని వెతుక్కుంటున్నారు. మొత్తం రుణాలకు వడ్డీలు కట్టాల్సి రావటం, మరోవైపు పాఠశాలలు మొదలు కావటంతో పిల్లల చదువులు, కుటుంబ నిర్వహణ.. ఇలా ఖర్చులు పెరిగి ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  

వలస వెళ్లిపోతాను... ‘15 ఎకరాలు వరిసాగు చేస్తున్నా. మే 6న ధాన్యాన్ని అమ్మాను. 100 రోజులు దాటినా ఇప్పటికీ నగదు చెల్లించలేదు. మొత్తం రూ.11.31 లక్షలు రావాలి. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఏ అధికారిని అడిగినా సమాధానం చెప్పడం లేదు. అప్పు చేసి ప్రస్తుతం సాగు పనులు పూర్తిచేశాను. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు. ఇలానే కొనసాగితే పొలం అమ్ముకుని తెలంగాణకు వలస వెళ్లిపోతాను’   అని ఆకివీడుకు చెందిన కేశిరెడ్డి ప్రశాంతబాబు వాపోయారు.


సాగు విరమించాలి
- మేకల బాబ్జి, రైతు, యనమదుర్రు

పదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. గడిచిన దాళ్వాకి సంబంధించి రూ.5.80లక్షలు రావాలి. నెలల తరబడి డబ్బులు ఇవ్వకపోతే సాగు ఎలా చేయగలం. గత పంటకి సంబంధించిన తెచ్చిన అప్పులు చెల్లించే పరిస్థితి లేదు. సార్వా సాగు చేసేందుకు డబ్బులు లేవు. అందుకే ప్రస్తుత సీజన్‌లో సాగు విరమించుకున్నాను.


నెలలు గడుస్తున్నా సొమ్ముల ఊసే లేదు
-వి.సీ.శ్రీనివాస్‌, కౌలు రైతు, బ్రాహ్మణచెర్వు

మే నెలలో రబీ పంట ధాన్యం విక్రయించా. ఈ సొమ్ము రూ.5లక్షలు పైనే రావాలి. మూడు నెలలు పైనే కావస్తుంది కాని బ్యాంకులో సొమ్ము జమ కాలేదు. అప్పులు చేసి మరీ ఖరీఫ్‌కు పెట్టుబడులు పెట్టాం. ఈ అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి తప్ప ధాన్యం సొమ్ము మాత్రం రావడం లేదు. ఇదే పరిస్థితి ఉంటే ఇక సాగు చేయడం అనవసరం.


అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టా..
-ఆదిరెడ్డి సన్యాసిరావు, రైతు, పెనుమంట్ర

పంట పండించడం కంటే ధాన్యం అమ్మి సొమ్ము పొందడమే కష్టం. మూడు నెలల నాడు ధాన్యం అమ్మాను. సొంత, కౌలు భూములు సాగు చేస్తున్నా. సుమారు రూ.5 లక్షల పైబడి సొమ్ము రావాలి. కనీసం ఎవరూ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈ డబ్బు వస్తుంది కదా అని ఖరీఫ్‌కు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టాను.


త్వరలో జమవుతాయి
ధాన్యం బకాయిలున్న విషయం వాస్తవం. జిల్లాలో చేయాల్సిన ప్రక్రియ పూర్తి అయింది. కేంద్రం నుంచే నగదు రావాల్సి ఉంది. ధాన్యం బకాయిలు   నాలుగైదు రోజుల్లో విడుదల అవుతాయి అని పశ్చిమ గోదావరి జిల్లా జేసీ జేవి మురళి, ఏలూరు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ కె.మంజుభార్గవి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని