మనకి నొప్పి ఎక్కడో మాత్రకెలా తెలుసు..!

తలనొప్పి... కడుపునొప్పి... ఒళ్లు నొప్పులు... ఏ నొప్పికైనా గుటుక్కున ఒక మాత్ర మింగేస్తాం. కడుపులో అజీర్తి చేసినా, మనసులో ఆందోళనగా ఉన్నా... మాత్రల డబ్బా మీదికే వెళ్తుంది చెయ్యి. మధుమేహంతో బాధపడుతున్నా, పెరిగిన బీపీని నియంత్రణలో ఉంచుకోవాలన్నా... పూటపూటకీ ఓ మందుబిళ్ల తినాల్సిందే.

Updated : 22 Jul 2022 12:51 IST

మనకి నొప్పి ఎక్కడో మాత్రకెలా తెలుసు..!

తలనొప్పి... కడుపునొప్పి... ఒళ్లు నొప్పులు... ఏ నొప్పికైనా గుటుక్కున ఒక మాత్ర మింగేస్తాం. కడుపులో అజీర్తి చేసినా, మనసులో ఆందోళనగా ఉన్నా... మాత్రల డబ్బా మీదికే వెళ్తుంది చెయ్యి. మధుమేహంతో బాధపడుతున్నా, పెరిగిన బీపీని నియంత్రణలో ఉంచుకోవాలన్నా... పూటపూటకీ ఓ మందుబిళ్ల తినాల్సిందే. ఈ ట్యాబ్లెట్లకి శరీరంలో నొప్పెక్కడో, సమస్యేంటో ఎలా తెలుస్తుందీ... వేసుకున్న కొన్ని నిమిషాలకే నేరుగా అక్కడికి ఎలా చేరుకుంటాయీ... చేత్తో తీసేసినట్లుగా నొప్పిని ఎలా మాయం చేస్తాయీ...పిల్లలకే కాదు పెద్దలకీ ఇలాంటి సందేహాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే నిజంగా అవి ఎలా పనిచేస్తాయో తెలియదు కాబట్టి..!

కొందరికి ప్రతి చిన్న సమస్యకీ ఓ మాత్ర వేసుకుంటే కానీ మనశ్శాంతి ఉండదు.

ఇంకొందరేమో ఎంత ఇబ్బందిగా ఉన్నా భరిస్తారే కానీ అసలు మాత్రల జోలికి వెళ్లరు. మరి కొందరికేమో ప్రతి మందుకీ ఏదో ఒక సైడ్‌ ఎఫెక్టు ఉండి తీరుతుందని గట్టి నమ్మకం. అందుకే మందు వేసుకున్న మరుక్షణం నుంచి అసలు సమస్య మర్చిపోయి కొసరు సమస్య గురించి ఆందోళన చెందుతుంటారు.
ఎవరికి ఎలా ఉన్నా మనిషన్నాక ఏదో ఒక సమయంలో మాత్రలు వాడక తప్పదు. వేసుకున్న మందులు పనిచేశాయా లేదా... సమస్య తగ్గిందా లేదా... అన్నది తప్ప అంతకు మించి ఎవరూ పట్టించుకోరు.
కానీ ఒకసారి ఆలోచించండి... తల పగిలిపోతుందా అనిపించేంత నొప్పిని కంది బద్దంత చిన్న బిళ్ల ఎలా తగ్గించేస్తోంది. పైగా నొప్పేమో తలలో... బిళ్లనేమో నోటితో మింగితే కడుపులోకి పోతుంది. మరి తలనొప్పి ఎలా పారిపోయిందీ..! రండి... ఆ కథా కమామిషు ఏమిటో చూద్దాం..!


అన్ని భాగాలకూ వెళ్తుంది...

నిజానికి ఎంత గొప్ప మందైనా దానికి ఎటు వెళ్లాలో తెలియదు. ఏ నొప్పికి వేసుకున్నామో తెలియదు. అన్నం తిన్నా అరటిపండు తిన్నా ఎలా ఆహార నాళం ద్వారా కడుపులోకి వెళ్తాయో అలాగే నోటి ద్వారా తీసుకునే మందులన్నీ నేరుగా కడుపులోకి వెళ్తాయి. నోటిలోని లాలాజలంతో మొదలుపెట్టి మొత్తం జీర్ణవ్యవస్థ అంతా ఆ మందుల్లోని రసాయనాలను జీర్ణం చేసి రక్తప్రవాహంలోకి వదులుతుంది. ఆ రక్తం కాలేయంలోకి వెళ్లి అక్కడి నుంచి శరీరంలోని అన్నిభాగాలకూ వెళ్తూ తనతోపాటు మందునూ తీసుకువెళ్తుంది. అలా వెళ్లిన మందు- నొప్పి ఉన్న శరీరభాగాన్ని చేరుకోవడమే... దాని ప్రయాణంలో కీలక ఘట్టం. ఒకరకంగా అది ఆధునిక వైద్యశాస్త్రం చేస్తున్న మ్యాజిక్‌.
నోటి ద్వారా మనం మింగే ట్యాబ్లెట్‌, క్యాప్సూల్‌, సిరప్‌...అన్నీ కూడా జీర్ణాశయంలో జీర్ణమైపోయి రక్తంలో కలిసిపోతాయి. ఆ రక్తం చిన్న పేగుల నుంచి ‘హిపాటిక్‌ పోర్టల్‌ వెయిన్‌’ అనే రక్తనాళం ద్వారా కాలేయానికి చేరుతుంది. రక్తంలో కలిసి వచ్చిన మందుని కాలేయం ఇంకా సూక్ష్మమైన పదార్థాలుగా విడగొట్టి పనికిరాని వాటిని విసర్జన వ్యవస్థకు పంపి, పనికొచ్చే మందు భాగాన్ని మాత్రమే మళ్లీ రక్తంలోకి పంపిస్తుంది. ఇప్పుడా రక్తం శరీరంలోని అన్నిభాగాలకూ వెళ్తుంది కాబట్టి మందు కూడా దాంతో పాటే అన్ని భాగాలకూ వెళ్తుంది. కానీ... అన్ని భాగాలమీదా పనిచేయదు. ఎందుకంటే... ప్రతి మందునీ అది శరీరంలో ఎక్కడ పనిచేయాలో ఆ ప్రాంత కణజాలానికి తగినట్లుగానే తయారు చేస్తారు.

తాళమూ చెవీ- తరహా బంధం!

మనం వేసుకునే మందులన్నీ కూడా రసాయన పదార్థాలతో తయారవుతాయి. ఆ రసాయనాలను శరీరంలోని ‘రిసెప్టర్లు’ అనే ప్రొటీన్‌ మాలెక్యూల్స్‌కి అతుక్కునేలా తయారుచేస్తారు. శరీరంలోని కణాల ఉపరితలంపైనా, లోపలా రకరకాల రిసెప్టర్లు ఉంటాయి. ఒక్కో రిసెప్టరుదీ ఒక్కో ఆకృతి. ఉదాహరణకు- దుకాణానికి వెళ్తే అక్కడ వందల రకాల తాళాలు ఉంటాయి. ప్రతి తాళానికీ దేని చెవి దానికే ఉంటుంది. ఒకే తాళం చెవితో వేర్వేరు తాళాలను తెరవలేం. అచ్చం అలాగే ఈ రిసెప్టర్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఆ రిసెప్టర్లను తాళాలనుకుంటే వేసుకునే మందు తాళం చెవి లాంటిదన్న మాట.
రక్తంలో కలిసిన మందు శరీరమంతా తిరిగినా నొప్పి ఉన్నచోట మాత్రమే పనిచేయడానికి కారణం- అది అక్కడి రిసెప్టరుకి మాత్రమే అతుక్కుంటుంది కాబట్టి. ఉదాహరణకు పెయిన్‌ కిల్లర్‌ ఇబుప్రొఫెన్‌ ట్యాబ్లెట్‌ వేసుకుంటే- అందులోని మందు రక్తంలో ప్రయాణిస్తున్నప్పుడు నొప్పిని అనుభవిస్తున్న రిసెప్టర్లు కనిపిస్తే వాటిని మాత్రమే అతుక్కుంటుంది. అలా లక్ష్యాన్ని అతుక్కున్నాకే అది పనిచేయడం మొదలెడుతుంది. కణం లోపలికి ప్రవేశించి రసాయనచర్య జరుపుతుంది. దాంతో క్రమంగా నొప్పి మటుమాయం అవుతుంది. చర్మంలోని ప్రతి చదరపు సెంటీమీటరుకీ 200 పెయిన్‌ రిసెప్టర్లు ఉంటాయట. ఆ లెక్కన వివిధ భాగాల్లో ఇంకెన్ని ఉంటాయో... వాటిని చేరడానికి ట్యాబ్లెట్‌లోని మందు ఎన్ని సూక్ష్మకణాలుగా విడిపోతుందో! ఒకవేళ విరేచనాలకో, మలబద్ధకానికో మందు వేసుకున్నట్లయితే దాని పని కడుపులోనే మొదలవుతుంది. అలా కాకుండా అధిక రక్తపోటును నియంత్రించే ట్యాబ్లెట్‌(బీటా బ్లాకర్స్‌) వేసుకుంటే దాంట్లో ఉన్న మందు గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాల్లోని కణజాలంలో ఉన్న బీటా రిసెప్టర్‌లకు మాత్రమే అతుక్కుంటుంది. మామూలుగా అడ్రెనలిన్‌ హార్మోన్‌ పెరిగితే బీపీ పెరుగుతుంది. ఆ హార్మోన్‌ బీటా రిసెప్టర్లను తాకకుండా ఈ మందు అడ్డుకుంటుంది. దాంతో గుండె మీద అడ్రెనలిన్‌ ప్రభావం పడదు, బీపీ పెరగదు.
మందులన్నీ ఇంతే... అవి చేరుకోవాల్సిన ప్రాంతాన్ని చేరుకున్నాకే సంబంధిత రిసెప్టర్లను అతుక్కుని పని చేయడం మొదలెడతాయి.

రూటు మారిందా...

ఒకవేళ మందు తప్పు రిసెప్టర్లను అతుక్కుంటే..? అదీ జరగొచ్చు..! ఒకోసారి మనం దూరంగా ఉన్న వ్యక్తిని చూసి స్నేహితుడే అనుకుని చెయ్యూపుతాం. దగ్గరికి రాగానే అపరిచిత వ్యక్తిని చూసి ‘అయ్యో పొరబడ్డామే’ అనుకుంటాం. ‘ఒడ్డూ పొడుగూ అలాగే ఉంటేనూ...’ అని సమర్థించుకుంటాం. మందులు కూడా అలాగే ఒకోసారి పొరబడతాయి. తాము చేరాల్సిన రిసెప్టర్స్‌ని దాదాపుగా పోలి ఉండే ఇతర రిసెప్టర్స్‌నీ అతుక్కుంటాయి. అప్పుడు జరగకూడనిదే జరుగుతుంది... శరీరంలో వరసబెట్టి గొలుసు స్పందనలు చోటుచేసుకుంటాయి. వాటినే మనం సైడ్‌ ఎఫెక్ట్స్‌ అంటాం. ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ సమస్య మరో సందర్భంలోనూ వస్తుంది. మందులు వేసుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో పద్ధతి. కొందరు డాక్టరు చెప్పింది తు.చ. తప్పక పాటిస్తారు కానీ కొందరు అలా కాదు.
‘అమ్మో అంత పెద్ద బిళ్లా... నేను మింగలేను. అన్ని మందులా...
నా పొట్ట ఏమై పోవాలి...’ అనుకుంటారు. అలా అనుకుని డాక్టర్‌ మొత్తం ట్యాబ్లెట్‌ వేసుకోమంటే దాన్ని సగానికి విరిచి వేసుకుంటారు. మూడుపూటలా వేసుకోమంటే రెండు పూటలు చాల్లే అనుకుంటారు. యాంటీబయొటిక్స్‌ ఐదు రోజులు వేసుకోమంటే మూడురోజులు వేసుకుని తగ్గిపోయిందిగా అని మానేస్తారు. మరికొందరేమో సమస్య త్వరగా తగ్గిపోవాలని డాక్టరు చెప్పిన మోతాదు పెంచి కూడా వేసుకుంటారు.
ఇలా ఇష్టం వచ్చినట్లు డోసు మారిస్తే ఏమవుతుందీ..?
ప్రతి మందుకీ ఒక నిర్ణీతమైన మోతాదు ఉంటుంది. మన ఇష్టప్రకారం మోతాదు తగ్గించి వేసుకుంటే- వేలాది పెయిన్‌ రిసెప్టర్లలో కొన్నిటికే మందు దొరుకుతుంది. మిగిలినవన్నీ నొప్పి భరిస్తుంటాయి కాబట్టి మందు ప్రభావం ఏమీ కన్పించదు. అందుకే మోతాదు తగ్గించి వేసుకున్నా, వేసుకోకపోయినా ఒకటే.

ఇక, మోతాదు మించి వేసుకుంటే... రక్తంలోని మందు అతుక్కోవాల్సిన రిసెప్టర్స్‌ని అతుక్కోగా ఇంకా మిగిలిపోతుంది కాబట్టి చుట్టూ ఉన్న వాటిని కూడా అతుక్కుంటుంది. దాంతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి.

మందు ఒక్కటే కాదు...

మనం వేసుకునే ట్యాబ్లెట్‌ ఎంత చిన్నదైనా సరే... అందులో అచ్చంగా మందు ఒక్కటే ఉండదు. చికిత్సకు అవసరమైన ఔషధంతో పాటు అందులో మరికొన్ని పదార్థాలూ ఉంటాయి. ఆ మందు కొంతకాలం నిల్వ ఉండడానికీ, రవాణాలో పగిలిపోకుండా ఉండటానికీ, వేసుకునేటప్పుడు వాసనా రుచీ వెగటుగా ఉండకుండా చూడటానికీ, వేసుకున్నాక లోపల కణజాలానికి అతుక్కోవడానికీ... ఇలా అది సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ఎన్నో పదార్థాలు అందులో ఉంటాయి. వాటిని ‘ఇనాక్టివ్‌ ఇన్‌గ్రెడియంట్స్‌’ అంటారు. మందు లోపలికి వెళ్లి జీర్ణమై రక్తంలో కలిసినప్పుడు కాలేయం మందునీ ఈ పదార్థాలనీ వేరుచేస్తుంది. పనికిరాని పదార్థాలను విసర్జన వ్యవస్థ ద్వారా బయటకు పంపించేస్తుంది. అవసరమైనచోట కాకుండా ఇతర ప్రాంతాలకు చేరుకున్న మందు కూడా అలాగే మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. మల్టీ విటమిన్స్‌, బీ కాంప్లెక్స్‌ లాంటి ట్యాబ్లెట్స్‌ వేసుకున్నప్పుడు మూత్రం పసుపు పచ్చగా రావడం, కొన్ని మందులు వేసుకున్నప్పుడు ఘాటైన వాసన రావడం... అందువల్లనే. ఒకోసారి వేసుకున్న మందులో కొంతభాగాన్ని మాత్రమే శరీరం గ్రహించగలుగుతుంది. దాంతో మిగిలిందంతా బయటకు వెళ్లిపోతుంది. అలా వెళ్లిపోయినదాన్ని భర్తీ చేయడానికే కొన్ని మందుల్ని ‘ఇన్ని గంటలకు ఓసారి’ చొప్పున తప్పనిసరిగా వేసుకోమంటారు.

సైడ్‌ ఎఫెక్ట్స్‌... అనివార్యం

ప్రతి మందుకీ ఏవో కొన్ని చిన్న చిన్న సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. కడుపులో గడబిడ, నిద్రమత్తుగా ఉండడం, నోరు పొడిబారడం లాంటివి. అవన్నీ ఆ మందు లేబుల్‌ మీద రాసి వుంటాయి. వాటివల్ల కొద్దిపాటి అసౌకర్యం మినహా పెద్ద ఇబ్బంది ఉండదు. అవి కూడా అందరికీ ఏమీ ఉండవు కాబట్టి అంతగా పట్టించుకోనక్కరలేదు. మరీ తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ అయితే ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. కొందరికి యాంటీబయొటిక్స్‌ వేసుకుంటే విరేచనాలు అవుతాయి. కొందరికి తలనొప్పి ట్యాబ్లెట్‌ పడక వాంతి అయిపోతుంది. మరికొందరికి పారాసెటమాల్‌ వేసుకున్నా జలుబు చేస్తుంది. ఇవన్నీ వారి వారి శరీరం తీరును బట్టి సంభవించే సైడ్‌ ఎఫెక్ట్స్‌. ఇక, కొన్ని సందర్భాల్లో అయితే ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ని నివారించలేం. ఉదాహరణకి క్యాన్సర్‌ చికిత్సనే తీసుకుంటే- వేగంగా పెరిగే క్యాన్సర్‌ కణాలను చంపేయడానికి తయారుచేసిన గాఢమైన మందుల్ని కీమో థెరపీలో వాడతారు. దాంతో శరీరంలో వేగంగా పెరిగే ఇతర మంచి కణజాలాన్ని కూడా అవి ప్రభావితం చేస్తాయి. అలా వేగంగా పెరిగే వాటిల్లో పైకి కన్పించే వెంట్రుకలు కూడా ఉంటాయి కాబట్టి కీమోథెరపీ సమయంలో అవి ఊడి పోతుంటాయి.
ఒకోసారి సైడ్‌ ఎఫెక్టులను తగ్గించడానికీ, సామర్థ్యాన్ని పెంచడానికీ ఏ ప్రాంతంలో సమస్య ఉందో అక్కడ మాత్రమే మందుల్ని ఉపయోగిస్తారు. చర్మం మీద ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ వస్తే యాంటీ బ్యాక్టీరియల్‌ స్కిన్‌ క్రీమ్‌ని అక్కడ మాత్రమే రాసుకోవడం, ఎలర్జీలకు కళ్లల్లో, ముక్కులో డ్రాప్స్‌ వేసుకోవడం, ఇన్‌హేలర్‌తో నేరుగా ఊపిరితిత్తుల్లోకి మందుని పంపడం... అలాంటివే.  కానీ అన్ని సమస్యలకూ ఇలాంటి పరిష్కారం సాధ్యం కాదు కనకే సైడ్‌ ఎఫెక్టులను భరించక తప్పడం లేదు.

దేని పనితీరు దానిదే!

మందులన్నీ వాటి వాటి లక్ష్యానికి చేరుకోగానే పని మొదలెడతాయి. ఉదాహరణకు- రక్తాన్ని పలుచగా ఉంచే బ్లడ్‌ థిన్నర్‌ ట్యాబ్లెట్ల పని రక్తంలోనే కాబట్టి మిగతా వాటిలాగా వెతుక్కుంటూ వెళ్లాల్సిన పనిలేదు. రక్తంలో కలవగానే పని మొదలెట్టేస్తాయి. నొప్పి నివారణ మందైతే ముందుగా నొప్పి తాలూకు సంకేతాలను మెదడుకు చేరవేసే నాడులను అడ్డుకుంటుంది. యాంటాసిడ్‌ లాంటివైతే పొట్టలో యాసిడ్స్‌ తయారీని అడ్డుకుంటాయి. కుంగుబాటుతో బాధపడుతున్నవారు యాంటీ డిప్రెసెంట్స్‌ వేసుకుంటే ఆ మందు మెదడులోకి వెళ్లి దాని ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. యాంటీబయొటిక్స్‌ అయితే వాటి లక్ష్యాన్ని చేరుకోగానే అక్కడున్న సూక్ష్మక్రిములను చంపేస్తాయి.
ఇక, ట్యాబ్లెట్లూ క్యాప్స్యూల్స్‌తో పోల్చితే ఇంజెక్షన్‌ రూపంలో మందుని నేరుగా రక్తంలోకి పంపించే విధానం సమర్థంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థ అంతా ప్రయాణించే పని లేదు కాబట్టి వృథా తగ్గుతుంది. అయితే ఇలా ఇచ్చేందుకు మందుల్ని పూర్తిగా రసాయనాలతో కాకుండా ఇతర జీవపదార్థాల నుంచి సేకరించిన వాటిని కలిపి ప్రత్యేకంగా తయారుచేస్తారు. అందుకే వీటిని ‘బయోటెక్నాలజీ’ మందులు అంటారు. ఇలా తయారుచేసిన మందుల్ని ట్యాబ్లెట్లలా కడుపులోకి పంపిస్తే అది ఆహారంలో ఉండే ప్రొటీన్‌ని జీర్ణం చేసుకున్నట్లే మందులోని ప్రొటీన్‌ని కూడా పూర్తిగా అరిగించేసుకుంటుంది. దానివల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకనే వీటిని ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌లకు ఇచ్చే యాంటీబయొటిక్స్‌ని కూడా ఇన్‌ఫ్యూజన్‌ పద్ధతిలో(సెలైన్‌ పెట్టినట్లు) ఇస్తారు.

ఇవి పాటించాల్సిందే..!

మందుల వాడకం విషయంలో సొంతనిర్ణయాలు పనికిరావు. ప్రయోగాలు అసలు చేయకూడదు. వైద్యులు పేషెంట్లకు ప్రిస్క్రిప్షన్‌ రాసే ముందు ఆ వ్యక్తి వయసూ శరీర తత్వమూ జబ్బు తీవ్రతా గత అనారోగ్యాలూ తీసుకున్న చికిత్సలూ... లాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని మందుల మోతాదునీ కాంబినేషన్‌నీ నిర్ణయించి రాస్తారు. కాబట్టి...
* వైద్యులు రాసిన మందుల్ని వాళ్లు సూచించిన మోతాదులో, చెప్పిన వేళల్లోనే కచ్చితంగా వేసుకోవాలి.
* తట్టుకోలేని సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తే వెంటనే మళ్లీ అదే డాక్టరు దగ్గరకు వెళ్లి మార్పుల్ని వివరంగా తెలియజేయాలి.
* ట్యాబ్లెట్లను ఎప్పుడూ దేనితోనూ కలిపి వేసుకోకూడదు. వేసుకున్నాక కాసేపటివరకూ ఏమీ తీసుకోకూడదు.
* ట్యాబ్లెట్లను మామూలు నీళ్లతోనే వేసుకోవాలి. వేడినీళ్లతో వేసుకున్నా, వేసుకున్న వెంటనే వేడి వేడి కాఫీ టీల్లాంటివి తాగినా  ఆ వేడికి మందు సామర్థ్యం తగ్గిపోతుంది. మందు కడుపులోకి చేరకముందే దానిమీద పూత కరిగిపోవచ్చు. ట్యాబ్లెట్‌ వేసుకున్నాక వైన్‌ లాంటిది తీసుకుంటే తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది.
* చాలా చల్లటి నీటినీ వాడకూడదు. అవి జీర్ణప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. దాంతో మందు పనిచేయడానికి చాలా సమయం పడుతుంది.
* కొన్ని మందుల్ని తప్పనిసరిగా భోజనం తర్వాతే వేసుకోవాలి. కొన్ని భోజనానికి ముందే వేసుకోవాలి.

స్మార్ట్‌ మందులు రానున్నాయి!

సైడ్‌ ఎఫెక్టులు అనేవి లేకుండా ఇంకా సమర్థంగా పనిచేసే స్మార్ట్‌ మందుల తయారీకీ పరిశోధనలు జరుగుతున్నాయి.
నేరుగా లక్ష్యానికి: డ్రైవరు లేని కారుకి ఎలాగైతే జీపీఎస్‌ అనుసంధానించి గమ్యానికి చేరేలా నిర్దేశించవచ్చో అలాగే మందుని కూడా శరీరమంతా తిరక్కుండా నేరుగా అవసరం ఉన్నచోటికే వెళ్లేలా చేయాలన్నది పరిశోధకుల లక్ష్యం.
ఆటోమేటెడ్‌ డ్రగ్‌ డెలివరీ: మరో విధానంలో మందు లక్ష్యాన్ని చేరినా పని చేయకుండా ఊరకే ఉంటుంది. అవసరమైనప్పుడు యాక్టివేట్‌ చేస్తేనే పనిచేస్తుంది. ఇలా మందుల యాక్టివేషన్‌ని నియంత్రించగలిగితే, వాటి మోతాదు స్థాయిని కూడా కావలసినట్టుగా మార్చుకోవచ్చు. అప్పుడు మందుని తరచుగా వేసుకోనక్కరలేదు, ఒక్కసారి వేసుకుంటే చాలు. అదే అవసరమైనప్పుడల్లా తగిన మోతాదులో పనిచేస్తూ సమస్యని పరిష్కరిస్తుంది. ట్యాబ్లెట్‌ వేసుకున్నప్పుడు అందులోని మందుని విడుదల చేయమని శరీరం రసాయన సంకేతాలు పంపడాన్ని ఒక పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని ఆధారంగానే ఈ ‘ఆటోమేటెడ్‌ డ్రగ్‌ డెలివరీ సిస్టమ్‌’ అనే కొత్త పరిశోధనని ప్రారంభించారు. ఈ విధానంలో శరీరంలో ఎక్కడ సమస్య ఉన్నా సరే- సరైన చోట, సరైన సమయంలో, సరైన మోతాదులో, పూర్తి సామర్థ్యంతో మందు విడుదలవుతుంది.  
మైక్రోచిప్స్‌: చర్మం కిందో, వెన్నెముకలోనో, మెదడులోనో మైక్రోచిప్స్‌ని అమర్చడం ద్వారా మందుని శరీరంలోకి విడుదల చేసే విధానం కూడా పరిశోధనలో ఉంది. నొప్పి నివారణ మందుల్నీ క్యాన్సర్‌ మందుల్నీ చాలాకాలం వాడాల్సినప్పుడు వాటిని నానో మందుల రూపంలో మైక్రోచిప్స్‌లో పెట్టి శరీరంలో అమరుస్తారు. శరీరానికి మందు ఎప్పుడు అవసరమో అప్పుడు చాలా తక్కువ స్థాయిలో కరెంట్‌ షాక్‌ ఇస్తే అది ఆ చిప్‌మీద ఉన్న కవర్‌ని కరిగించి మందుని రక్తంలో కలిసేలా విడుదలచేస్తుంది.
మైక్రో నీడిల్స్‌: కచ్చితంగా అవసరమైన కణజాలానికి మాత్రమే మందుని పంపించడానికి అత్యంత సూక్ష్మమైన సూదుల్ని వినియోగించే విధానం కూడా పరిశోధనలో ఉంది. ఈ సూదులు నాడులను కూడా తగలనంత చిన్నవి కాబట్టి అసలు నొప్పనేదే తెలియదు.

వైద్యశాస్త్రంతో చేయీ చేయీ కలిపి అభివృద్ధి చెందుతున్న మందుల తయారీ శాస్త్రం మనుషుల అలవాట్లనీ, సౌకర్యాన్నీ, జీవిత విధానాన్నీ దృష్టిలో పెట్టుకునే వాటిని తయారుచేస్తోంది. అటు ఆ మందుల తయారీదారుల కృషీ ఇటు రోగనిర్ధారణ చేసి తగిన మందుల్ని నిర్ణయించే వైద్యుల శ్రమా ఫలించేది మాత్రం... ఆ మందుల్ని పేషెంట్లు సక్రమంగా వాడినప్పుడే..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..