ట్రాక్టర్‌ ఇంధనంగా పేడ!

పేడతో కళ్లాపి చల్లడం చాలామంది చేసేదే. పిడకలు తయారు చేసుకుని వంటకు ఉపయోగించుకోవడమూ అందరికీ తెలిసిందే.

Published : 22 Jan 2023 00:08 IST

ట్రాక్టర్‌ ఇంధనంగా పేడ!

పేడతో కళ్లాపి చల్లడం చాలామంది చేసేదే. పిడకలు తయారు చేసుకుని వంటకు ఉపయోగించుకోవడమూ అందరికీ తెలిసిందే. కానీ, పేడతో వాహనాలను నడిపిస్తారని ఎప్పుడైనా విన్నారా? ఈ మధ్య బిన్నమన్‌ అనే బ్రిటీష్‌ కంపెనీ ఆవుపేడతో నడిచే ట్రాక్టర్‌ను తయారుచేసింది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న కర్బన ఉద్గారాలను నియంత్రించగలిగేలా రూపొందించిన ఈ గ్రీన్‌ ట్రాక్టర్‌లో- ఆవుపేడను నేరుగా ఇంధన ట్యాంకులో వేస్తారు అనుకునేరు. ముందుగా పేడను ఓ ప్లాంట్‌లోకి పంపి.. అందులోంచి బయోమీథేన్‌ వాయువును ఓ ట్యాంకులోకి సేకరిస్తారు. మైనస్‌ 162 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత దగ్గర అది ద్రవంగా మారాక మరో ట్యాంకులో నిల్వ చేస్తారు. ఈ ట్యాంకును ట్రాక్టర్‌కే అమర్చుకుంటే నేరుగా ఇంధన ట్యాంకులోకి ఇంధనం సరఫరా అవుతుంది. అలానే ఆ ట్యాంకును వేరు చేసి కూడా ట్యాంకులో ఇంధనం నింపి ట్రాక్టర్‌ని నడపొచ్చు. పెట్రోలూ, డీజిల్‌కి ఉన్న శక్తి ఈ ఇంధనానికీ ఉంటుంది. కానీ, వాటి మాదిరిగా వాతావరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌ అంతగా విడుదలవ్వదు. ‘పేడ ట్రాక్టర్‌’తో ఆ కాలుష్యం చాలా తగ్గుతుంది. ప్రయోగ పూర్వకంగానూ కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ఈ గ్రీన్‌ ట్రాక్టర్‌ ముందుంటుందని రుజువైంది. త్వరలో మార్కెట్‌లోకి రానున్న ఈ ట్రాక్టర్‌తో పాడి రైతులకు పేడ ఇంధనాన్ని అమ్మడం ద్వారా కొత్త ఆదాయ మార్గమూ అందుబాటులోకి వచ్చిందంటున్నారు నిపుణులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..