Updated : 22 Jan 2023 09:32 IST

అప్పుడు నేను.. ఇప్పుడు దీప.. రేపు కృతి.. మాట వినకపోతే చంపేస్తారా..?

పూర్ణిమ పెమ్మరాజు

‘‘తమ్ముడు ఇంకా రాలేదేంటమ్మా’’ మళ్ళీ అడిగింది అవంతి.

‘‘వస్తాడులేవే, ఈ గంటలో పదోసారి అడగడం. నువ్వొచ్చావని ఒక్క మెసేజ్‌ పెడితే రెండో నిమిషంలో నీ ముందు ఉండేవాడు. నువ్వే చెప్పొద్దంటివి. అలాంటప్పుడు ఆగు మరి’’ నవ్వుతూ అంది జానకి.

‘‘నాకోసం అని కాకపోయినా వాడి కాలేజీ టైమ్‌ అయిపోయి నాలుగు గంటలు అవుతోంది. మన ఇంటి నుంచి పది నిమిషాలు దూరంలో ఉన్న కాలేజీ నుంచి రావడానికి ఇంత లేట్‌ ఎందుకవుతోంది. అది కనుక్కోవచ్చుగా కాల్‌ చేసి’’ అడిగింది అవంతి.

‘‘అలా కాల్‌ చేస్తే ఎగిరిపడతాడు ఇంటికొచ్చాక. వచ్చేస్తాడులే, పదరా తల్లీ, నీకు పాయసం చేసిపెడతా, మీ అమ్మ తన తమ్ముడు వస్తే కానీ ఇంట్లోకి రాదు, మనం వెళ్ళి పాయసం చేసుకుందాంరా’’ తన నాలుగేళ్ళ మనవరాలిని ఎత్తుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళుతున్న జానకిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అవంతికి. తను చదువుకునేప్పుడు రావడం ఒక పది నిమిషాలు లేట్‌ అయితే కంగారుపడి గుమ్మంలో కూర్చునే అమ్మ... ఈమేనా అని.

మసకచీకటి ఆవరిస్తోంది అప్పుడే. అప్పుడప్పుడూ వీస్తున్న గాలితెరలకి గేటు పక్కన అప్పుడే విచ్చుకుంటున్న సన్నజాజి వాసన, గుమ్మం పక్కన వికసిస్తున్న బొండుమల్లి వాసనలు తెరలుతెరలుగా అలుముకుంటున్నాయి. ఎన్నేళ్లయింది ఇలా ఇక్కడ కూర్చుని, నాన్న ఇల్లు కట్టడం మొదలెట్టినప్పటి నుంచీ ఎక్కడ ఏ మొక్క పెట్టాలీ, ఇంట్లో ఎక్కడ ఎలా అలంకరించాలీ అంటూ రోజూ చర్చలే. ఈ ఇంటి గురించి రోజూ కలలే. తీరా అంతా అనుకున్నట్టుగా పూర్తయి ఇంటికి షిఫ్ట్‌ అయ్యాక ఆరు నెలలు కూడా లేదు ఈ ఇంట్లో. మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తరువాత ఇక్కడ ఇలా... అసలు కలలో అయినా ఊహించిందా కన్నవారికీ, సొంత ఇంటికీ దూరంగా ఇన్నేళ్ళు గడుపుతానని’’ ఆలోచిస్తుంటే గుండె బరువెక్కి, కళ్ళల్లో పల్చటి నీటితెర కమ్ముకుంది.

‘‘ఏం చేస్తున్నావు తల్లీ, చీకటిపడుతోంది. దోమలు కుడతాయి, లోపలకి వచ్చెయ్‌’’ రామారావు లోపల నుంచి వస్తూ పిలిచాడు.

‘‘బాగుంది నాన్నా... ఇలా, ఇక్కడ కూర్చుంటే. ఎన్నేళ్లు అయిందో కదా, అదే తల్చుకుంటున్నా, కానీ అప్పుడు వేసిన మొక్కలన్నీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. గార్డెన్‌ అలైన్‌మెంట్‌ ఏం మారలేదు’’ ఆశ్చర్యంగా అంది అవంతి.

‘‘ఒక్క గార్డెన్‌ మాత్రమే కాదు తల్లీ, నువ్వు గమనించావో లేదో, ఇంట్లో అంతా కూడా నువ్వెలా సర్దావో అప్పుడు- ఇప్పటికీ అలానే ఉన్నాయ్‌. చిన్న మార్పు కూడా చెయ్యలేదు’’ నవ్వుతూనే చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకున్నాడు రామారావు.

‘‘నాన్నా, మీకో విషయం చెప్పాలి. లాస్ట్‌ వీక్‌ ఒక పార్టీకి వెళ్ళినపుడు అక్కడ పృథ్వీ కనిపించాడు’’ నెమ్మదిగా చెప్పిన అవంతి మాటలకి అదిరిపడ్డాడు రామారావు.

‘‘అక్కడికి ఎలా వచ్చాడమ్మా వాడు, ఇన్నేళ్ళూ నువ్వెక్కడ ఉన్నావో వాడికి తెలీకూడదని ఇంత కష్టపడ్డాం. మళ్ళీ దాపురించాడా మన ప్రాణానికి’’ ఆవేశంతో వణికిపోతున్నాడు రామారావు.

‘‘నాన్నా, ప్లీజ్‌... ఎగ్జైట్‌ కాకండి. కనిపించాడు, మాట్లాడాడు. జరిగిన దానికి సారీ చెప్పాడు. అతనికి పెళ్ళి అయింది. తన భార్యని కూడా పరిచయం చేశాడు. ‘జరిగినదానికి చాలా ఫీల్‌ అవుతున్నాను. చాలా తప్పు చేశాను. క్షమించ’మని అతని భార్యా, మీ అల్లుడుగారూ... ఇద్దరి ముందూ అడిగాడు’’ గడగడా చెప్పింది అవంతి.

‘‘హమ్మయ్య, ఎంత మంచి వార్త చెప్పావు తల్లీ. నిజంగా పండగరోజే మనకి, అమ్మకి చెప్తా ఉండు, సంతోషంతో ఎగిరి గంతేస్తుంది’’ పట్టరాని ఆనందంతో పరుగు లాంటి నడకతో, లోపలికి వెళ్తున్న రామారావుని చూస్తూ ఉండిపోయింది అవంతి... ‘అక్కా నిజంగా నువ్వేనా, వాట్‌ ఏ సర్‌ప్రైజ్‌’’ అంటూ పరిగెత్తుకొచ్చిన తమ్ముడు అమన్‌ని చూసేదాకా.

*     *    * 

అవంతి వచ్చి వారం దాటిపోయింది. అవంతి భర్తకి ఇండియాలో, అది కూడా వీళ్ళ ఊరిలోనే పోస్టింగ్‌ వచ్చిందన్న వార్త రామారావు దంపతులని ఆనందోత్సాహాలలో ముంచెత్తింది. అమన్‌కి అయితే చెప్పక్కర్లేదు. అవంతికి పెళ్ళి అయి వెళ్ళిపోయేప్పటికీ అమన్‌ తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు. తనకన్నా దాదాపు పదేళ్లు చిన్న అయిన తమ్ముడు అంటే అవంతికి ప్రాణం. అక్క ఎంత ముద్దుగా చూసుకునేదో జ్ఞాపకం ఉన్న అమన్‌- ఎప్పుడూ అక్కతో ఫోన్‌లో, వీడియోకాల్స్‌లో మాట్లాడటం తప్ప ఊహ బాగా తెలిశాక కలిసి ఉండటమే తెలీదు. నాలుగేళ్ల చిన్నారి కృతితో సహా అక్క తమకి దగ్గర్లోనే ఉంటుందనే వార్తకి అమన్‌ కూడా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కృతికి, అమన్‌ మామతో చాలా బాగా దోస్తీ కుదిరింది. అమన్‌ ఉన్నంతసేపూ అతనితోనే లోకం తనకి. ఇంకో నెల రోజులలో అవంతి భర్త ఇండియాకి తిరిగి వచ్చేస్తే అప్పుడు దగ్గర్లో ఇల్లు వెతకొచ్చు అనుకున్నారు అంతా.

*     *    * 

‘‘అవంతీ, సంధ్యవేళ అలా వాకిట్లో ఉండకమ్మా, దోమలు వచ్చే టైమ్‌ ఇది. వస్తాడులే నీ తమ్ముడు. వాడేమన్నా చిన్నపిల్లాడా, రోజూ అలా టెన్షన్‌ పడతావు’’ చిరుకోపంతో మందలించింది జానకి.

‘‘నీ నుంచే వచ్చింది నాకు ఈ టెన్షన్‌. నేను స్కూల్‌ నుంచో, కాలేజీ నుంచో రావడం పది నిమిషాలు ఆలస్యం అయితే నువ్వు ఇలానే టెన్షన్‌ పడేదానివి, ఇప్పుడేదో పెద్ద కూల్‌ మామ్‌లాగా నాతో మాట్లాడుతున్నావ్‌’’ కినుకగా అంది అవంతి.

‘‘నువ్వంటే వేరు, ఆడపిల్లవి కాబట్టి.’’

‘‘ఏం ఆడపిల్ల అయితే... మన ఇంట్లో ఈ జెండర్‌ డిఫరెన్స్‌ ఎప్పటి నుంచి’’ కొంచెం కోపంగానే అడిగింది అవంతి.

‘‘అది జెండర్‌ డిఫరెన్స్‌ కాదు తల్లీ. ఆడపిల్లకి బయట ప్రపంచంలో భద్రత లేదని భయం. అందుకే బయటకి వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చేదాకా బెంగ, నాతో ఊరికే వాదించాలని వాదిస్తున్నావు కానీ, మీ ఇద్దరి మధ్యా మాకే తేడా లేదని నీకు మాత్రం తెలీదా’’ చిన్నబుచ్చుకున్న తల్లిని చూసి అవంతికి ‘అయ్యో’ అనిపించింది.

‘‘అమ్మా, ఊరికే అన్నా సరదాకి, అంత సీరియస్‌గా తీసుకోకు. కానీ, అమన్‌ సంగతి మాత్రం నాకు కాస్త వింతగానే ఉంది. ఎక్కడ తిరుగుతున్నాడు కాలేజీ అయి ఇంతసేపైనా. ఈ వారంలో మూడుసార్లు ఫ్రెండ్స్‌తో పార్టీ అని అర్ధరాత్రి వచ్చాడు. చదువు మీద ఫోకస్‌ పెడుతున్నాడా... బయటకి వెళ్తే ఫోన్‌ ఎత్తడు ఎంతకీ... గట్టిగా అడగొచ్చుగా నాన్నా, నువ్వూ’’.

‘‘ఇంజినీరింగ్‌లో చేరేవరకూ ఆ రెసిడెన్షియల్లో ఉన్నాడుగా- ఆ డిసిప్లిన్‌... చదువూ... వాటితో కాస్త విసిగిపోయాడు వాడు. ఈ ఏడాది రెండేళ్ళే కదా, ఏం ఎంజాయ్‌ చేసినా. తరువాత మళ్ళీ ఉద్యోగమూ, భాద్యతలూ. అందుకని కాస్త ఫ్రీగా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేస్తా అంటాడు. మన పిల్లాడి సంగతి మనకి తెలుసుగా. చదువు నిర్లక్ష్యం చెయ్యడు, వాడి లిమిట్స్‌ వాడికి తెలుసు. అందుకే కొంచెం లేట్‌ అయినా పెద్దగా పట్టించుకోవట్లేదు’’ తమ్ముడిని సమర్థిస్తూ చెప్పుకుపోతున్న తల్లి మాటలకి ఏం అనాలో తెలీట్లేదు అవంతికి. ‘నిన్న నైట్‌ వాడు పార్టీ నుంచి వచ్చినపుడు తాగొచ్చాడేమో- వాసన అనిపించింది’ అని చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయింది.

‘‘అమ్మా, అన్నట్టు చెప్పడం మర్చిపోయా... ఇంకెలాగూ ఇక్కడే ఉంటాం కాబట్టి నేను ‘లా’ ఎంట్రన్స్‌ రాద్దామనుకుంటున్నా, నిన్నే మీ అల్లుడితో కూడా చెప్పా, తను ట్రై చెయ్యమన్నారు.’’

‘‘అబ్బో, ఎన్నెన్ని మంచి వార్తలు చెప్తున్నావమ్మా, నీ చదువు అర్ధాంతరంగా ఆపామని బాధపడని క్షణం లేదనుకో మీ నాన్నా నేనూ. నువ్వు ఎంతవరకు చదవాలనుకుంటున్నావో చదువుకో, కృతిని నేను చూసుకుంటాను. చదువులతల్లివి, మామాట మీద చదువు ఆపేసి పెళ్ళి చేసుకున్నావు, నువ్వెంత క్షోభపడుంటావో మాకు తెలుసు, కానీ ఏం చేస్తాం, అప్పటి పరిస్థితుల వల్ల నీకెంతో ఇష్టమైన చదువుకి దూరం చెయ్యాల్సి వచ్చింది’’ కళ్ళు తుడుచుకుంది జానకి.

‘‘ఛ.. ఛ.. అమ్మా, అలా బాధపడకు, మీరేం చేసినా నా క్షేమం కోరే అని నాకు తెలీదా, అయినా అంత మంచి భర్తని వెతికి తెచ్చారు, నాకేం లోటు చెప్పు. దూరమైపోయిన మీరూ, చదువూ కూడా మళ్ళీ దగ్గరవుతున్నాయి. ఇప్పుడు సంతోషించాలిగానీ జరిగినవి తల్చుకుని బాధపడతారా చెప్పు’’ కన్నీళ్ళు తుడిచింది తల్లివి.

‘‘నా ఫ్రెండ్‌ ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, ‘లా’ పూర్తి అయి ప్రాక్టీస్‌ చేస్తోంది. రేపొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా, ఎలా ప్రిపేర్‌ అవ్వాలో ఎంట్రన్స్‌కి తెలుసుకోడానికి’’. తలూపింది అవంతి మాటలకి జానకి.

*     *    * 

‘‘కృతీ, అలా బయటకి పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళకూడదు, బూచి ఉంటుంది బయట’’ అని చెప్పిన అమ్మమ్మ అరుపుకి భయపడి అప్పుడే ఇంట్లోకి వస్తున్న మామయ్యని కరుచుకుపోయింది కృతి.

‘‘ఏమైంది బుజ్జీ, అమ్మమ్మ అరుస్తోంది. అమ్మా, పిల్లల్ని అలా బూచి అని భయపెట్టకూడదని తెలీదూ. ఎందుకలా చెప్తున్నావ్‌, ఇదే మైండ్‌లో ఉండిపోతుంది పెద్ద అయ్యాక కూడా’’ తల్లిని కోప్పడ్డాడు అమన్‌.

‘‘వాళ్ళ అమ్మ ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళింది. ఇదేమో వీధి తలుపు తీసుంటే చాలు... ఒక్కతే బయటకి వెళ్ళిపోతోందిరా, అందుకే కాస్త భయపెట్టడం.’’

‘‘అర్థమయ్యేట్టు చెప్పాలి కానీ అలా బూచి అని భయపెడతావా..? అక్కా చూడు... అమ్మ బుజ్జి పాపని ఎలా భయపెడుతోందో’’ అప్పుడే లోపలకి వచ్చి అంతా చూస్తున్న అవంతికి ఫిర్యాదు చేశాడు అమన్‌.

‘‘పెట్టనీ భయం, ఆడపిల్ల కదా... ఎలానూ భయపడుతూ బతకాల్సిందే! ఇప్పటి నుంచీ అలవాటు చేసుకోనీ’’ అవంతి మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూశారు.

‘‘ఏమైంది తల్లీ, ఏమిటా మాటలు, నీ మొహం ఏమిటి అలా వాడిపోయింది, ఒక్కదానివే బయటకి వెళ్ళావ్‌, నిజం చెప్పు మళ్ళీ ఏమన్నా...’’ మాటలు మింగేశాడు రామారావు. తల్లిదండ్రుల మొహాలలో ఆందోళన అర్థం కావట్లేదు అమన్‌కి.

‘‘మీరనుకున్నదే జరిగింది నాన్నా, ఎంత వదుల్చుకుందామనుకున్నా ఆ గతం వదలట్లేదు, మళ్ళీ మళ్ళీ ముందుకి వస్తూనే ఉంది. నేను ఇక ఇక్కడ ఉండలేను, ఇప్పుడే వెళ్ళిపోతాం నేనూ, కృతీ’’.

‘‘మళ్ళీ కనిపించాడా ఆ త్రాష్టుడు, మారిపోయా డన్నావ్‌, ఇంకేం పర్లేదని ధైర్యంగా ఉన్న టైమ్‌లో ఇదేమిటండీ’’ జానకి భోరుమంది.

‘‘అమ్మా, ఏమైంది, ఏం మాట్లాడుతున్నారు మీరంతా, ఎవరు కనిపించింది, అక్కా నువ్వన్నా చెప్పు, ఏం జరిగింది’’ అమన్‌కి టెన్షన్‌ వచ్చేస్తోంది.

‘‘నీకు తెలీదు కదరా జరిగిన విషయం. అవును, అప్పటికి నువ్వు చిన్నపిల్లాడివి, పైగా హాస్టల్లో ఉండేవాడివి. అప్పట్లో తెలీదుకానీ పెద్ద అయ్యాక నీకెప్పుడూ డౌట్‌ రాలేదా... ‘అక్క ఎందుకు చదువు సడన్‌గా మానేసి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది, ఇన్నేళ్లు ఎందుకు తిరిగి రాలేదు’ అని అడగలేదా ఇంట్లో’’ అమన్‌ని తీక్షణంగా చూస్తూ అడిగింది అవంతి.

‘‘చాలాసార్లు అడిగా అక్కా, నీకు ఎమ్‌సెట్‌లో వందలోపు ర్యాంకు వచ్చిందని నాన్న చెప్పినప్పుడల్లా అడిగా, మరెందుకు అక్కని చదువు మాన్పించి పెళ్ళి చేసి అంత దూరం నైజీరియా పంపేశారని. మంచి సంబంధం, వదులుకోడం ఇష్టంలేక అనేవాళ్ళు, ఇప్పుడనిపిస్తోంది ఏదో జరిగింది అని, చెప్పక్కా ఏం జరిగిందసలు’’ అమన్‌ ఆత్రుతగా అడిగాడు.

‘‘అవంతీ, ఊరుకో, చిన్నపిల్లాడు వాడికెందుకు ఇవన్నీ, లోపలికి పద, మనం మాట్లాడుకుందాం’’ రామారావు మాటలకి అడ్డంగా తలూపింది అవంతి.

‘‘అంత చిన్నపిల్లాడు కాదు నాన్నా ఇప్పుడు వీడు. వాడికి చెప్పే వయసు ఎప్పుడో వచ్చింది, అమన్‌ నేను చెప్తా విను. నీకు తెలుసుగా నేను ఎంత బాగా చదివేదాన్నో. మంచి కాలేజీలో సీటు వచ్చింది... అదీ ఉన్న ఊరిలోనే. కానీ మా సీనియర్‌ పృథ్వి అని ఉండేవాడు. అతను నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నేను నెమ్మదిగానే ‘నో’ చెప్పాను. నాకు చదువు మీద తప్ప వేరే ఏ ఆలోచనా లేదని చెప్పాను. అతను వినలేదు, వెంటపడి వేధించాడు. అతన్నే పెళ్ళి చేసుకోవాలనీ లేదంటే చంపేస్తా అనీ బెదిరించాడు. నేను అంతవరకూ ఇంట్లో కూడా చెప్పలేదు. అప్పుడు మాత్రం భయపడి చెప్పాను. నాన్నని తీసుకెళ్ళి ప్రిన్సిపాల్‌కి కంప్లైంట్‌ ఇచ్చాను. ఒక వారం రోజులు సస్పెండ్‌ చేశారు. వాళ్ళ కుటుంబానికి చాలా పలుకుబడి ఉంది, అంతకన్నా కాలేజీ మేనేజ్‌మెంట్‌ ఏం చెయ్యలేదు, కావాలంటే పోలీసు కంప్లైంట్‌ ఇవ్వమని సలహా ఇచ్చారు. ఆ రోజు రాత్రే అతను తన ఫ్రెండ్స్‌ని నలుగురిని తీసుకుని ఇంటి దగ్గరకి వచ్చి చాలా గొడవ చేశాడు. చేసుకుంటే అతన్నే పెళ్ళి చేసుకోవాలి లేకపోతే చంపేస్తా అని కత్తి తీసుకొచ్చి బెదిరించాడు’’ చెప్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంది అవంతి.

‘‘ఆ గొడవకి అమ్మానాన్నా చాలా భయపడిపోయారు. నేను పోలీసు కంప్లైంట్‌ ఇద్దామని ఎంతో బతిమాలాను. కానీ, అమ్మ అస్సలు ఒప్పుకోలే. నేనెంత చెప్తున్నా వినకుండా రాత్రికి రాత్రే బాబాయ్‌ దగ్గరకి ఢిల్లీ తీసుకెళ్లిపోయారు. అప్పటికే పిన్నీవాళ్ళ బంధువులు మీ బావగారి సంబంధం అడిగారు నా గురించి. నేను చదువుకోవాలని ఒప్పుకోలేదు మొదట్లో. కానీ అమ్మానాన్నా ఎంత భయపడ్డారంటే- పదిరోజుల్లో వాళ్ళతో మాట్లాడి పెళ్ళి కూడా ఢిల్లీలోనే చేసేసి, అటునుంచి అటే నన్ను నైజీరియా పంపేశారు,  కృతి పుట్టినప్పుడు కూడా మీరే వచ్చారు కానీ, నేను రాకపోవడానికి ఇదే కారణం. వస్తే నాకేదన్నా అవుతుందనే భయంతో అమ్మ ఒప్పుకోలే’’ అవంతికి దుఃఖం ఆగట్లేదు.

‘‘అక్కా, ప్లీజ్‌ ఏడవకు, అప్పుడు జరిగింది ఏదో జరిగింది. నీకప్పుడు ఎవరూ సపోర్ట్‌ లేకపోవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను. నువ్వు భయపడకు, నేను చూసుకుంటా, ఈసారి నువ్వు భయపడి వెళ్ళిపోవాల్సిన అవసరమే లేదు. చెప్పు ఎక్కడున్నాడు వాడు, ఎక్కడ కనిపించాడు’’ ఆవేశంగా అడిగాడు అమన్‌.

‘‘ఫోన్‌ మెసేజ్‌ ఉంది, వింటావా’’ అంటూ వాయిస్‌ మెసేజ్‌ ఓపెన్‌ చేసింది అవంతి.

‘‘ఏమనుకుంటున్నావు నీ గురించి, ఏం చూసుకునే అంత ఎగిరెగిరిపడుతున్నావ్‌. నాలాంటి హ్యాండ్సమ్‌ గై ‘నిన్ను ప్రేమిస్తున్నా’ అని అంత బతిమాలుతుంటే అంత ఇగో చూపిస్తావా, ఆడదానివి నీకే అంత పొగరు ఉంటే మగాడిని నాకెంత ఉండాలే, నాకుగానీ తిక్కరేగిందనుకో... ఒక చిన్న ఆసిడ్‌ చుక్క చాలు. అందంగా ఉన్నానని తెగ ఫీల్‌ అవుతున్నావుగా- నీ మొహం నువ్వే మళ్ళీ చూసుకోలేవు అద్దంలో. ఒక్కటి గుర్తుపెట్టుకో నీకు ప్రేమ అన్నా, పెళ్ళి అన్నా అంటే- అది నాతోనే. లేదా నిన్ను చంపి నేను చస్తా’’ ఆ గొంతు విని అందరూ స్థాణువైపోయారు.

‘‘ఇది... ఇది... మన అమన్‌ గొంతు కదా’’ గొంతు పెగుల్చుకుంటూ అంది జానకి.

‘‘అక్కా... ఇది నీకెలా... అసలేమైందంటే’’  తడబడుతున్న అమన్‌ చెంప ఛెళ్లుమనిపించింది అవంతి.  

‘‘అవంతీ... ఏమిటిదంతా... నాకేం అర్థంకావట్లే’’ వణుకుతున్న గొంతుతో అన్నాడు రామారావు.

‘‘నా ఫ్రెండ్‌ లాయర్‌ ప్రీతి దగ్గరకి వెళ్ళాను కదా నాన్నా, అక్కడికి నేను వెళ్ళేప్పటికే- వాళ్ళ పక్కింటి అమ్మాయి సూసైడ్‌ అటెంప్ట్‌ చేసింది- చెయ్యి కోసుకుని కత్తితో. లక్కీగా- ఇంట్లోవాళ్ళు చూశారు కాబట్టి అపాయం తప్పింది. నేను వెళ్ళేసరికి ప్రీతి వాళ్ళింట్లోనే ఉంది. నన్నూ అక్కడికి రమ్మంది. ఎందుకా అని వెళ్తే తెలిసింది ఈ విషయం. వీడు రోజూ ఇంటికి రాకుండా బయటచేస్తున్న రాచకార్యం- ఆ దీపని వేధించుకు తింటున్నాడు. వాళ్ళ పేరెంట్స్‌కి తెలిసి మీలానే భయపడి చదువు మాన్పించేద్దామనుకున్నారు. పాపం, ఆ పిల్ల తట్టుకోలేక ప్రాణం తీసేసుకుందామనుకుంది. ఆ ప్రబుద్ధుడు ఎవరో తెలుసుకున్న ప్రీతి నన్ను అక్కడికే రమ్మని ఈ మెసేజ్‌ వినిపించింది. ఇది చాలా బెటర్‌ మెసేజ్‌. మీరు వినలేనివీ మనం అనలేనివీ ఇంకా చాలా ఉన్నాయ్‌ వీడి మెసేజ్‌లు’’ అమన్‌ వైపు అసహ్యంగా చూస్తూ కొనసాగించింది అవంతి.

‘‘దీపకీ, వాళ్ళ పేరెంట్స్‌కీ చెప్పొచ్చా- ఏం భయపడొద్దు, పోలీసు కంప్లైంట్‌ ఇవ్వండి, నేను సాక్ష్యం ఇస్తాను వచ్చి- ఆ గొంతు వాడిదే, ఆ నంబర్‌ వాడిదే అని.’’ అవంతి మాటలకి అదిరిపడ్డారు అందరూ.

‘‘అవంతీ... జరిగింది తప్పే... కానీ, ఆ అమ్మాయి సూసైడ్‌ చేసుకోబోయింది వాళ్ళ పేరెంట్స్‌ చదువు మానమన్నారని కానీ... వీడివల్ల కాదుగా, నువ్వు ఆవేశపడుతున్నావ్‌, వాడి ఫ్యూచర్‌ నాశనం అవుతుంది’’ రామారావు వారించబోయాడు.

‘‘జరిగింది తప్పే అన్నాక మళ్ళీ కానీ ఏమిటి నాన్నా, తప్పు అంటే తప్పే. వీడి ఫ్యూచర్‌ నాశనం అవుతుందా... మరి ఆ అమ్మాయి సంగతి ఏమిటి? తనకేదన్నా అయి ఉంటే అప్పుడేం చేసేవాళ్ళు. లేదా నాలానే ఒప్పుకుని చదువు మానేసి ఉంటే- అప్పుడు బతికివుండీ చచ్చిపోయేది. ఇన్నేళ్ళూ నేనెలా ఉన్నానో తెలుసా నాన్నా మీకు. నా తప్పేం లేకుండా నా కలలూ కోరికలూ ఆశలూ అన్నీ ఎవరికో భయపడి వదిలేసి, కన్నవారిని చూడడానికి కూడా నోచుకోకుండా ఈ ఎనిమిదేళ్ళు బతికాను. ఎవడో సంబంధంలేనివాడు నా జీవితాన్ని శాసిస్తే నేను తల వంచుకు పారిపోయి బతుకుతున్నానని నామీద నాకే విరక్తి కలిగేది. ఆ ఫీలింగ్‌ మీకెవ్వరికీ చెప్పినా అర్థం కాదు కూడా. అదృష్టంకొద్దీ అర్థం చేసుకునే భర్త దొరకడంతో ఆగిపోయిన నా కలలు పూర్తి చేసుకుందాం, ‘లా’లో చేరి అమ్మాయిలకి వాళ్ళ హక్కుల గురించి పోరాటంలో సాయం చేద్దాం అని ఇక్కడికి వచ్చాను. కానీ, ఇక్కడికి వచ్చాక తెలిశాయి నా తమ్ముడి ఘనకార్యాలు’’ ఆవేశంతో ఊగిపోతోంది అవంతి.

‘‘నువ్వు ఒకవైపు మాత్రమే విని, నీ తమ్ముడిని అనుమానిస్తున్నావ్‌ అవంతీ, నా కొడుకు గురించి నాకు తెలుసు, వాడు అలాంటివాడు కాదు, నేను నమ్మను ఇదంతా’’ రోదిస్తోంది జానకి.

‘‘నిజంగా నీ కొడుకు గురించి నీకు అంత తెలుసా అమ్మా, సరే చెప్పు- రోజూ అర్ధరాత్రిదాకా ఎక్కడ తిరుగుతున్నాడు ఇంటికి రాకుండా. వాడి ఒక్క ఫ్రెండ్‌ పేరు కానీ, ఫోన్‌ నంబర్‌ కానీ తెలుసా? ఎలా చదువుతున్నాడో, బ్యాక్‌లాగ్స్‌ ఎన్ని ఉన్నాయో తెలుసా? అర్ధరాత్రి తాగి ఇంటికి వస్తున్నాడు అది తెలుసా? ఏం తెలుసనీ మీకు? అసలు తెలుసుకోవాలని అనుకున్నారా, ఎంతసేపూ మగపిల్లాడుగా పర్లేదు పర్లేదు అన్నమాటే. ‘ఆడపిల్లకి బయట సేఫ్టీ లేదు’ అన్నావ్‌ కదా అమ్మా, ఎవరివల్ల లేదు సేఫ్టీ- నీ కొడుకు లాంటి మగ పిల్లల వల్ల లేదు. వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసే మీలాంటి తల్లిదండ్రుల వల్ల లేదు. మీ గురించి ఇలా అనాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు’’ బాణాల్లాంటి అవంతి మాటలకి సమాధానం లేదు వాళ్ళ దగ్గర.

‘‘నువ్వు చెప్పరా, ఆడదానివి నీకే అంత ఉంటే, మగాడిని నాకెంత ఉండాలి, అదేగా అన్నావ్‌. మగాడివి అయితే ఏమిటి నీ గొప్ప. అసలు ఒక విషయం ఆలోచించావా... ఒక ఆడదాని ఒంట్లో తొమ్మిది నెలలు భాగంగా ఉండే నువ్వు బయటకి వచ్చావు. ఆ తొమ్మిది నెలలు నీకో అస్తిత్వమే లేదు. ఇంకేం చూసుకునిరా నీకంత మిడిసిపాటు...’’ ఎప్పుడూ అవంతిలో అంత కోపాన్ని చూడని అందరికీ తనని చూస్తే భయం వేసింది.’’

‘‘తల్లీ, నువ్వు సంబాళించుకో ముందు, చాలా ఉద్రేకపడుతున్నావ్‌, కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. మేము వీడిని వెనకేసుకు రావట్లేదు. జరిగింది తప్పేకానీ ‘చప్పట్లు ఒక చేతితో మోగవు ఎప్పుడూ’ అంటున్నాను అంతే! ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇదివరకటిలా లేరు.  ఆ అమ్మాయి ఏం రెచ్చగొట్టిందో వీడిని’’ అవంతికి నచ్చచెప్పబోతున్న జానకి తన
చూపు చూసి ఆగిపోయింది.

‘‘చెప్పమ్మా ఆగిపోయావేం, అమ్మాయి రెచ్చగొట్టి ఉంటుంది, లేదా వాడితో అతి చనువుగా ప్రవర్తించి ఉంటుంది, కాదూ వాడితో మిడ్‌నైట్‌ పార్టీకి వెళ్ళి వాడికి అవకాశం ఇచ్చి ఉంటుంది. చెప్పు ఆగావేం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో... పృథ్వీవాళ్ళ ఇంట్లో కూడా నా గురించి అప్పుడు ఇలానే అనుకుని ఉంటారు. ఒకవేళ ఆ అమ్మాయే నువ్వన్నట్టు రెచ్చగొట్టినా కూడా- చంపేయ్యాలా లేదా ఎందుకలాంటి అమ్మాయితో అని వదిలేయాలా, చెప్పు నువ్వు?’’

‘‘వాడు మగాడు కాబట్టి వాడికి ఇష్టం అయితే ఆ అమ్మాయికి నచ్చే తీరాలి. తనకి వేరే ఆలోచనలు కానీ, ఆశయాలు కానీ ఉండకూడదు. ఏరా అంతేగా,  అవసరమైతే చంపేస్తావ్‌ అంతేగా, మరి అలాంటప్పుడు అమ్మాయిలు భయపడటం నేర్చుకోవాలిగా, అప్పుడు నేను భయపడ్డాను, ఇప్పుడు దీప, రేపు కృతి. దాన్నికూడా రేపెవడో ఇలానే అంటాడు. మర్యాదగా మాట వినకపోతే చంపేస్తా అంటాడు. ఈ మాత్రానికి ఆడపిల్లకి ఇంకెందుకు చదువులూ కోరికలూ. ఒక పనిచెయ్యి... నువ్వే చంపెయ్‌ కృతిని కూడా. పెరిగి పెద్ద అయిందంటే దాని మనసు ఎలా ఉంటుందో. అప్పుడు మనసు చంపుకునేకన్నా ఇప్పుడే మనిషిని చంపేద్దాం. ‘జరిగింది తప్పే... కానీ’ అనే అవసరమే ఉండదెవరికీ పురిట్లోనే అమ్మాయిని చంపేస్తే’’ దుఃఖంతో గొంతు పూడుకుపోయింది అవంతికి.

‘‘అవంతీ, ఇంకా మాటలతో చిత్రవధ చెయ్యకమ్మా, మేము ఎంత తప్పు చేశామో- ఇప్పుడేకాదు అప్పుడు కూడా- అర్థమైంది. మమ్మల్ని క్షమించు తల్లీ’’. రామారావు చిన్నపిల్లాడిలా భోరుమన్నాడు, జానకి కొంగులో మొహం దాచుకుంది.

‘‘అక్కా, ప్లీజ్‌... సారీ అక్కా, నిజంగా నేను ఊహించలేదు. అసలు అలా తనని ఏదో చేద్దామని కూడా నేను అనుకోలేదు. బెదిరిద్దాం అనుకున్నా అంతే! ఇలా జరుగుతుందని అనుకోలే, నన్ను క్షమించు అక్కా. పోలీసు రిపోర్ట్‌ ఇస్తారనే భయంతో కాదు, నిజంగా సిగ్గుతో చచ్చిపోతున్నా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. నేను దీపకీ వాళ్ళ అందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటా, ప్లీజ్‌ అక్కా’’ అవంతి కాళ్ళ దగ్గర కూర్చుని బరస్ట్‌ అయ్యాడు అమన్‌.

‘‘తీసుకెళ్తాను, వాళ్ళేం చేస్తారో నిర్ణయం వాళ్ళది, నువ్వు క్షమాపణ చెప్పడానికి మాత్రమే తీసుకెళ్తా’’ నిక్కచ్చిగా చెప్పింది.

‘‘కృతి మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకెప్పుడూ ఏ అమ్మాయితోనూ తప్పుగా ప్రవర్తించను. ముందు మీరంతా నన్ను క్షమించా అని చెప్పండి. దీప వాళ్ళేమన్నా- వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తాను, నేను మారా అని మీరంతా నమ్మితే అదే చాలు నాకు... అక్కా ముఖ్యంగా నువ్వు’’  తన ఒళ్ళో తల పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న తమ్ముడిలో మార్పు నిజంగానే వచ్చిందని అర్థమైన అవంతి ఆనందంగా నిట్టూర్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు