అనాలోచిత నిర్ణయం

‘‘మంచి అయినా చెడు అయినా ఒక నిర్ణయం తీసుకునే ముందు కాస్త ముందు వెనుక ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మానసిక స్థితినిబట్టి మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం

Updated : 12 Jan 2024 16:26 IST

ఉమాబాల చుండూరు

‘‘మంచి అయినా చెడు అయినా ఒక నిర్ణయం తీసుకునే ముందు కాస్త ముందు వెనుక ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మానసిక స్థితినిబట్టి మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మానసిక స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. పైగా మనం తీసుకునే నిర్ణయాలు మన వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి.’’
ఈ మాటలు విని, సాలోచనగా చూస్తున్న ఇందుమతిని చూసి అంది అంజలి... ‘‘ఏంటి మేడమ్‌, ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నాయి కదా. ఒక ఇరవై సంవత్సరాలక్రితం మీరు నాతో అన్నవే.’’
‘‘నేను ఎవరా అనుకుంటున్నారా? లెక్కలేనంత మందిని తీర్చిదిద్దిన మీకు ఎంతమందని గుర్తుంటారులెండి?
నేను అంజలిని, మీఇంటికి ఫిజిక్స్‌ ట్యూషన్‌కి వచ్చేదాన్ని గుర్తుకి వచ్చానా’’ అంది నవ్వుతూ అంజలి.
అంజలిని తేరిపార చూసి, కంటి పైన అర్ధ చంద్రాకారంలో ఉన్న మచ్చని చూసి, చిరునవ్వుతో అంది ఇందుమతి- ‘‘భలేదానివే, అందరూ గుర్తు ఉండకపోవచ్చు... కొంతమంది మాత్రం అలా ఎప్పటికీ గుర్తుండిపోతారు’’ అని... అప్పుడు అంది అంజలి ‘‘ఏంటి మేడం ఇది?’’ అని.
ఇందుమతి తప్పు చేసిన దానిలా తలదించుకుంటే, ‘‘ఈ బటర్‌ మిల్క్‌ తాగి కాసేపు రెస్ట్‌ తీసుకోండి నేను మళ్ళీ వస్తాను’’ అని వెళ్ళిపోయింది అంజలి.
అంజలి వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ఇందుమతి. గత జీవితపు ఆలోచనలు ముప్పిరిగొనగా.
 

*              *               * 

ఇందుమతికి ఇద్దరు మగపిల్లలు. నగరంలో పేరున్న ఆడపిల్లల కాలేజీలో లెక్చరర్‌ ఇందుమతి. భర్త రాజశేఖర్‌ కూడా బ్యాంక్‌లో పనిచేసేవాడు. పిల్లలకి 10, 12 ఏళ్ళ వయసులో అతను తాగుడు వ్యసనానికి బానిసై అనారోగ్యంతో మరణించాడు. ఇందుమతి ఇద్దరు పిల్లలతో సింగిల్‌ పేరెంట్‌గా ఉండిపోయింది.
ఇందుమతి ఫిజిక్స్‌ లెక్చరర్‌. అంకితభావంతో పనిచేస్తూ మంచి లెక్చరర్‌గా పేరు తెచ్చుకుంది.
తను చెప్పే విధానమూ, వ్యవహరించే తీరూ, ఆహార్యంతో ఎంతోమంది విద్యార్థినులకు అభిమాన లెక్చరర్‌ అయింది. బెస్ట్‌ లెక్చరర్‌గా అవార్డు అందుకుంది కూడా.
అంజలి ఇంటర్మీడియేట్‌ చదివేది ఆ రోజుల్లో.
ఒకసారి అంజలి తల్లిదండ్రులు ఇందుమతి ఇంటికి వచ్చి- ‘తమ అమ్మాయికి ఫిజిక్స్‌లో డౌట్స్‌ ఉన్నాయనీ ట్యూషన్‌ చెప్పమనీ తమకి అంజలిని డాక్టర్‌ చేయడం ధ్యేయమనీ’ అభ్యర్థించారు. అప్పుడు ఇందుమతి సున్నితంగా తిరస్కరించింది.
‘తమ కాలేజీ రూల్స్‌ ప్రకారం తను ట్యూషన్స్‌ చెప్పకూడదనీ తను ఆ రూల్స్‌కి కట్టుబడి ఉంటాననీ సబ్జెక్ట్‌లో సందేహాలు వస్తే కాలేజీలో తన ఖాళీ సమయంలోగానీ ఏదో ఆదివారం ఒక గంట ఇంటికి వచ్చినా తను సహాయం చేస్తాననీ’ చెప్పింది.
దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అంజలి స్టాఫ్‌ రూమ్‌లో కొన్నిసార్లు కలిసి, అప్పుడప్పుడు ఇందుమతి ఇంటికి వచ్చేది. అలా వచ్చినప్పుడు ఇందుమతి పిల్లలతో సరదాగా ఆడేది.

అంజలి ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఇందుమతి అడిగింది అంజలిని... ‘అంజలీ, నువ్వు సబ్జెక్ట్‌లో బాగానే ఉన్నావు, నీ అంతట నువ్వు చదువుకోగలవు. నువ్వేదో వీక్‌గా ఉన్నావు సబ్జెక్ట్‌లో అంటే నిజమనుకున్నాను. నాకు స్టూడెంట్‌తో మాట్లాడితే వాళ్ళు ఏ స్టాండర్డ్‌లో ఉన్నారు అని కనిపెట్టే సామర్థ్యం ఉంది. సంగతి చెప్పు’ అంది నవ్వుతూ.
అంజలి తలవంచుకుని అంది, ‘నిజమే మేడమ్‌, నాకు మీ సబ్జెక్ట్‌లో ఏ సందేహాలు లేవు. మా అమ్మానాన్నగార్లకి నన్ను డాక్టర్‌ని చేయాలని కోరిక. మా అమ్మ కజిన్స్‌, చుట్టాల పిల్లలందరూ డాక్టర్స్‌. తనకి వాళ్ళలా నేనూ డాక్టర్‌ అవ్వాలని కోరికేగానీ నాకు ఆసక్తి ఉందా లేదా అని చూడటం లేదు. తమ్ముడు ఇంకా చిన్నవాడు. నాన్న, అమ్మ ఏదంటే అదే. నాకు అస్సలు ఇష్టం లేదు- సైన్స్‌ సబ్జెక్ట్స్‌ ఏవీ... ఈ ఫిజిక్స్‌ తప్ప. అది కూడా ఈ సబ్జెక్ట్‌కి మ్యాథ్స్‌తో కాస్త అనుబంధం ఉంది కాబట్టి.
ఈ పోటీలో నాకు ర్యాంక్‌ వస్తుందో లేదో. వచ్చినా ఆ ఒత్తిడి నేను తట్టుకోలేను. జీవితమంతా చదువు చదువు అని పరిగెడుతూనే ఉండాలి ఆ ఫీల్డ్‌లో.  ఒక ఆరు గంటలు నిద్ర తప్ప ఎప్పుడూ చదువుకోమనీ ట్యూషన్స్‌ పెడతామనీ నా వెంటపడ్డారు.
ఆ బాధ తప్పించుకోడానికి ఫిజిక్స్‌లో వీక్‌ అని అబద్ధమాడి, నాకు ఎంతో ఇష్టమైన మీతో టైమ్‌ స్పెండ్‌ చేయడానికి ఇలా వస్తున్నాను.
ఇష్టం లేని చదువు నేను చదవలేకపోతున్నాను మేడమ్‌. నాకు ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఇష్టంగా చదువుకోవాలని ఉంది. అలా కుదరడం లేదు.
ఒక్కోసారి పిచ్చిపిచ్చి ఆలోచనలు కూడా వస్తున్నాయి’ అని వెక్కి వెక్కి ఏడుస్తున్న అంజలిని ఓదార్చి, ధైర్యం చెప్పి, ఒక రోజు సెలవు పెట్టి, అంజలి కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇందుమతి.
అంజలి పేరెంట్స్‌తో మాట్లాడింది అనడంకన్నా కౌన్సెలింగ్‌ ఇచ్చింది అంటే బాగుంటుంది. అంజలి బాధ ఏమిటో చెప్పింది. నిర్లక్ష్యం చేస్తే అంజలి ఆలోచనలు విపరీతంగా ఉన్నాయని కూడా.
‘అంజలిని చక్కగా ఎంఎస్‌సీ ఫిజిక్స్‌ చదివించి, ఇష్టమైతే పీహెచ్‌డీ చేయిస్తే, అంజలి ఇలా కూడా డాక్టర్‌ అయ్యి మిమ్మల్ని సంతృప్తి చెందేలా చేస్తుందనీ’ ఆలోచించమనీ చెప్పింది.
‘గుర్రాన్ని నీళ్ళ వరకూ తీసుకుని వెళ్ళొచ్చు, కానీ నీళ్ళు తాగించలేము. అది ఇష్టపడి తాగాలి తప్ప’ అని- వాళ్ళూ గ్రహించి అంజలి ఇష్టాన్నీ, ఇందుమతి సలహానీ గౌరవించారు.
అంజలిని ఇంటర్‌ పూర్తి అయ్యాక, ఇదే చూడటం ఇందుమతి.
 

*              *               * 

ఒక అరగంటకి వచ్చిన అంజలి, మంచం పక్కన ఉన్న కుర్చీని జరుపుకుని ఇందుమతికి దగ్గరగా కూర్చుని అంది, ‘‘నా స్నేహితురాలు డాక్టర్‌ సుజన. తను హాస్పిటల్‌లో మిమ్మల్ని గుర్తుపట్టి నాకు కాల్‌ చేసింది. తనూ మీ స్టూడెంటే.
మిమ్మల్ని అపస్మారక స్థితిలో హాస్పిటల్‌లో చేర్చాడట మీ అబ్బాయి. తను మీకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చి, నాకు చెప్పింది. నేను హుటాహుటిన వచ్చి, మీ పరిస్థితి బాగుందని తెలిశాక, మీ అబ్బాయితో మాట్లాడి కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకుంటానని ఇలా తీసుకు వచ్చాను.’’
‘‘మేడమ్‌, నా గురించి చెప్తా వినండి. నేను మీరిచ్చిన డైరెక్షన్‌లోనే ఫిజిక్స్‌లో డాక్టరేట్‌ చేశాను. నా సహాధ్యాయిని పెళ్ళి చేసుకున్నా.’’
తమ్ముడికి సిటీలో ఇల్లు, నాకు ఊళ్ళో పొలం ఇచ్చారు అమ్మా, నాన్న.
నేను ఆ పొలం అమ్మి ఇక్కడ వెయ్యి గజాల స్థలం కొని, ఇలా కట్టించి కొంతమంది అనాథలను ఇక్కడ ఉంచి చదివిస్తున్నాను. ప్రస్తుతం పది మంది ఉన్నారు.
మావారి సహకారంతో అంతవరకే నాకు వీలవుతోంది. భవిష్యత్తులో అవకాశం ఉంటే ఇంకా పెంచాలని నా కోరిక.
నేను నా ఉద్యోగం చేసుకుంటూ, నలుగురు మనుషుల్ని పెట్టి నడుపుతున్నాను’’ ఇదీ నా కథ.
‘‘మీ గురించి చెప్పండి. ఎందుకిలా చేశారు మీరు’’ అంది సూటిగా. ఇందుమతి చెప్పడం మొదలు పెట్టింది.
‘‘అంజలీ, నేను నా ఇద్దరు పిల్లల్నీ బాగానే పెంచాను. మంచి చదువులు చెప్పించాను. ఇద్దరూ జీవితాల్లో స్థిరపడ్డాక వాళ్ళకి నచ్చిన అమ్మాయిలతోనే పెళ్ళి జరిపించాను.
అప్పటికి ఇంకా నాకు మూడేళ్ళ సర్వీస్‌ ఉంది.
మంచి తల్లిగానే కాదు మంచి అత్తగారిగా, మంచి గ్రాండ్‌ మదర్‌గా, ఆదర్శంగా ఉండాలనే నా కోరిక.
పెద్ద కోడలు ఆముక్త వాళ్ళు ఇద్దరూ ఆడపిల్లలు.
ఆముక్తకి తన తల్లిదండ్రుల బాధ్యత ఉంది. బాధ్యత ఎవరికైనా ఒకటే. దాన్ని బాధ్యతగా ఒక కర్తవ్యంగా ప్రేమగా నిర్వర్తించాలి కూడా.
చిన్న కోడలు కౌముదికి ఒక తమ్ముడు.
నేను ఉద్యోగంలో రిటైర్‌ అయ్యి నా పెద్ద కొడుకు విహారి దగ్గరకి వెళ్ళాను. అప్పటికే ఆముక్త తల్లిదండ్రులిద్దరూ అక్కడే ఉన్నారు.
ఎంతో ఉత్సాహంగా వెళ్ళాను- నా విశ్రాంతి జీవితం హాయిగా ప్రశాంతంగా గడపాలని. ఏవేవో ప్రణాళికలు వేసుకున్నాను.
కానీ వాళ్ళకి నా రాక చాలా ఇబ్బందికరంగా ఉందని తరువాత అర్థం అయ్యింది.

నా చదువూ నా ఉద్యోగమూ నా అవార్డ్సూ నా వ్యక్తిత్వమూ అక్కడ వాళ్ళకి అనవసరం. నేను ఒక అత్తగారిని మాత్రమే. ఒక నెగిటివ్‌ ఫీలింగ్‌ నేనంటే. నేను ఆ ఇంట్లో ఒక అతిథిని మాత్రమే. టైమ్‌కి వెళ్ళి పెట్టింది తిని నా రూమ్‌కి వెళ్ళిపోవాలి. రూమ్‌లో నాకో టీవీ ఉండేది ప్రత్యేకంగా.
కానీ నాకు ఎప్పుడూ టీవీ చూసే అలవాటు లేదు. పుస్తకాలతోనే కాలక్షేపం. కొడుకూ కోడలూ పొద్దున ఆఫీసుకి వెళ్ళి రాత్రి ఏడు గంటలకు వచ్చేవారు. ఎవరి జీవన విధానం వారిది. నేను తప్పు పట్టను.
నేను ఆముక్త అమ్మానాన్నలతో మాట్లాడదామని వెడితే, మాట్లాడుకుంటున్న వాళ్ళు నన్ను చూసి ఆపేసేవారు.
నేను ఎంతో సహనంగా కలిసిపోవాలని ప్రయత్నించాను.
ఎక్కడా మా అబ్బాయికి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. వాడి దృష్టిలో అమ్మ అంటే చిన్నప్పటి నుండి ఉన్న అదే ఉన్నతభావం ఉండాలనే నా స్వార్థం, వాడికి మనశ్శాంతి దూరం చేయకూడదనే తల్లిగా తాపత్రయం.
ఎంత ప్రయత్నించినా... నా స్కిల్స్‌ ఏమీ అక్కడ ఫలించలేదు.
కొన్ని రోజులు ఉండి రెండోవాడు విరాజ్‌ దగ్గరికి వెళ్ళాను.
ప్రెగ్నెంట్‌గా ఉన్న కోడలు తాత్కాలికంగా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది. ముగ్గురు మనుషులకి వంట పెద్ద పనికాదు నా దృష్టిలో. ఇష్టంగానే ఆ పనిని చేతిలోకి తీసుకున్నా. తనకి ఇష్టమైనవి వండి పెట్టాలనే తాపత్రయం.
నా పని అయ్యాక హాల్లో కూర్చునేదాన్ని. కోడలు చిన్న చిన్న మాటలు మాట్లాడేది అప్పుడప్పుడు నాతో. ఎక్కువగా చెన్నైలో ఉన్న తల్లిదండ్రులతో వీడియో కాల్స్‌లో మాట్లాడుతూ ఉండేది.
పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ ఇంట్లో జరిగే ప్రతీ విషయం చెప్తూనే ఉండేది- నేను చేసిన వంటలు కూడా వీడియోలో చూపిస్తూ.
తల్లి ప్రతీ దానికి ఆదుర్దా పడుతూనే ఉండేది.
‘అయ్యో మొన్ననే తిన్నావు కదే ఆ పప్పు. వేరే పప్పు ఏదైనా చేయమనకపోయావా, ఆ కూర వేరేలా చేయొచ్చుగా’ అని సలహాలు ఇవ్వడం.
కూతురి ఇంట్లో, కూతురు అత్తగారు కూడా ఉండగా... అంతలా జోక్యం చేసుకోవడం ఏంటో నాకు అర్థం అయ్యేది కాదు. నా మీద నమ్మకం లేదు వాళ్ళకి.
నేనూ తల్లినే... నాకు ఆడపిల్లలు లేకపోవచ్చు. ఆడదానిగా అన్ని అనుభవాలు ఉన్నదాన్ని. అన్ని ఫీలింగ్స్‌నీ అనుభూతి చెందినదాన్ని. బండరాయిని కాదు కదా.
ఇంట్లో జరిగే ప్రతీదీ లైవ్‌లో తెలుసుకోవాలనే తాపత్రయం ఎంతసేపూ.
నన్ను సీసీ టీవీలో అనుక్షణం గమనిస్తున్న అనుభూతి నాకు. చాలా ఇబ్బందిగా ఉండేది.
‘ఇంకెన్నాళ్ళు ఉంటుందిట మీ అత్తగారు’ అన్న మాట కూడా నాకు వినిపించింది ఒకసారి.
వాళ్ళ మాటలు నేను విన్నట్టు ఉంటుందని నేను చాలా మొహమాటపడి నా రూమ్‌లోకి వెళ్ళిపోయేదాన్ని.
ఇంకో రెండు నెలల్లో వాళ్ళు ఇక్కడికే వస్తారు కూతురి డెలివరీకి.
నా కొడుకు విరాజ్‌ తన భార్య ఇక్కడే ఉంటుందని, వాళ్ళనే రమ్మన్నాడు కూతురి డెలివరీకి.
పైగా మా అమ్మ ఉంటుంది కూడా అని చెప్పాడు. నా సహాయం కూడా ఉంటుందని వాడికి నామీద భరోసా... నేనంటే గౌరవం.
కానీ ఈ ఇంట్లో నా ఉనికే నచ్చదని వాడికి నేనెలా చెప్పను..? నేనేమైనా చెప్తే, వాడు ‘నువ్వూ ఒక మామూలు అత్తగారివేనా’ అన్నట్టు చూస్తే...?
నేను తట్టుకోగలనా..?
ఇవన్నీ నా ఊహలు.
మగపిల్లలకు కొన్ని విషయాలు అస్సలు తెలీవు, వాళ్ళు ప్రతీదీ పట్టించుకోరు.
ముఖ్యంగా కుటుంబ రాజకీయాలు వాళ్ళకి తెలియవు.
ఇవన్నీ వాళ్ళకి చెప్పి, వాళ్ళ మనసుల్ని కలుషితం చేయడం సబబా అనిపించింది..
ముఖ్యంగా నా వలన వాళ్ళ మధ్య ఏ చిన్న మనస్పర్థా రాకూడదు.
ఇక్కడ కూడా మళ్ళీ నేను సర్దుకుపోయి ఉండాలి. ముడుచుకుపోయి ఉండాలి. నా షెల్‌లో నేను ఉండాలి.
ఎన్నాళ్ళు... ఎన్నేళ్ళు... ఇలా..?
ఎన్నని చెప్పను అంజలీ. అన్నీ చెప్తే సిల్లీగా ఉంటాయి. ఒంటరి జీవితానికి భయపడను.
కానీ ఇన్నేళ్ళూ నాకో ప్రపంచం ఉండేది- కాలేజీ పిల్లలూ చదువూ అంటూ. సెలవు వస్తే ఆనందం. ఇప్పుడు అన్నీ సెలవులే.
ఎటువంటి చిన్న చిన్న ఆనందాలు లేవు.
ఎప్పుడూ ఇంత ఖాళీ ఎరుగని నాకు తెలుగులో ఏమంటారో తెలీదుగానీ జీవితంలో ఒక పెద్ద ‘వ్యాక్యూమ్‌’ వచ్చేసింది.
తెలియని దిగులు. దేనిమీదా ఆసక్తి ఉండేది కాదు. పుస్తకాలు చదువుదామన్నా ఏకాగ్రత కుదరడం లేదు.
తెల్లారితే భయం- ఆ రోజు ఎలా గడుస్తుందా అని. ఒక విధంగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను అని చెప్పొచ్చు.
నిద్ర కోసం ట్యాబ్లెట్‌ రోజుకొకటి, చాలా మైల్డ్‌ డోస్‌ డాక్టర్‌ సలహా మీద వాడుతూ ఉండేదాన్ని చాలా ఏళ్లుగా. అవి కాస్త ఎక్కువేసేసుకున్నాను.
అందరికీ స్ఫూర్తినిచ్చే నేను, తప్పే చేశాను.
నా వరకు వచ్చేసరికి సాధారణ స్త్రీని అయిపోయాను’’ అని తల వంచుకుని, గిల్టీగా అంటున్న ఇందుమతిని చూస్తే బోలెడు జాలీ దుఃఖమూ వచ్చాయి అంజలికి.
ఇందుమతి చెయ్యి పట్టుకుని అంది అంజలి ఆర్ద్రతగా.
‘‘మేడమ్‌, అంతా మరచిపోండి. మీ అవసరం చాలామందికి ఉంది.
నేను మీ పిల్లలతో మాట్లాడతాను. వాళ్ళు తప్పక అర్థం చేసుకుంటారు. మీరు ఇక్కడ ఉండండి మేడమ్‌.
మీరు ఈ పదిమంది పిల్లల్నీ, ఇక్కడ పనిచేసే వాళ్ళనీ పర్యవేక్షించండి చాలు.
మీకు ఒక ఆఫీస్‌ రూమ్‌, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నేను కల్పిస్తాను. అలా అని ఇక్కడే ఎప్పటికీ ఉండిపొమ్మని అనను. ఉంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఉండరు అనుకోండి. కానీ అది నా స్వార్థం అవుతుంది.
మీకు ఎక్కడైనా ఉండే స్వేచ్ఛ ఉంది. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు... మార్పు తప్పక వస్తుంది.
మీ కుటుంబం ఎప్పటికీ మీ కుటుంబమే. మీ పిల్లలకి మీరు కావాలి. ఇది మీ ఆఫీస్‌ అనుకోండి. మీరు తిరిగి ఈ వాతావరణంలో పడితే మామూలు మనిషి అవుతారు.
మీలాంటి వాళ్ళు నాకు అండగా ఉంటే, నాకు కూడా ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఎంతోకొంత మీకు జీతం కూడా చెల్లిస్తాను’’ అనగానే, తన చేతిలో ఉన్న అంజలి చెయ్యి ప్రేమగా నొక్కి ‘‘డబ్బుకి అన్నిచోట్లా ప్రాధాన్యత ఉండదు అంజలీ... దేవుడి దయవలన నాకు ఆ లోటూ లేదు. నేను నీరు పోసిన ఒక చిన్న మొక్క ఎదిగి ఇంతటి మహా వృక్షమవుతుందనీ, అందులో నాకు నీడ దొరుకుతుందనీ ఊహించలేదు. ఈ నీడలో నేను మళ్ళీ మామూలు ఇందుమతిని అవుతాననే ఆశ కలుగుతోంది.
తప్పక నీ ప్రాజెక్ట్‌లో నేను భాగస్వామిని అవుతాను’’ అంది ఇందుమతి ఎంతో ఉత్సాహంగా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..