సిసింద్రీ

అవంతీపురాన్ని ఆనుకుని ఉన్న చిన్న గ్రామంలో రవీంద్ర అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడు బహుపిసినారి. దురాశాపరుడు. వజ్రాల వ్యాపారం చేస్తుండేవాడు.

Updated : 28 May 2023 06:51 IST

సిసింద్రీ

వ్యాపారి అత్యాశ!

అవంతీపురాన్ని ఆనుకుని ఉన్న చిన్న గ్రామంలో రవీంద్ర అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడు బహుపిసినారి. దురాశాపరుడు. వజ్రాల వ్యాపారం చేస్తుండేవాడు. ఓ సారి తన వజ్రాల సంచినొకదాన్ని పోగొట్టుకున్నాడు. ఎంతవెతికినా దొరకలేదు. వజ్రాల సంచి ఎవరికైనా దొరికితే తనకు తెచ్చిస్తే మంచి బహుమతి ఇస్తానన్నాడు. ఇదే విషయాన్ని పనివాళ్లకు చెప్పి, ఊళ్లోవాళ్లందరికీ విషయం వివరించమన్నాడు. 

ఆ ఊళ్లోనే రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఆయనకు దారి పక్కన చిన్న సంచి ఒకటి కనిపించింది. చూస్తే అందులో వజ్రాలున్నాయి. ఇవి రవీంద్రకు చెందినవే అయి ఉంటాయనుకున్నాడు రామయ్య. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ వజ్రాల సంచిని రవీంద్రకు అందించాడు. అందులో పదిహేను వజ్రాలు ఉన్నాయి. లెక్క సరిపోయింది. కానీ రవీంద్రకు ఆ క్షణాన దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా సరే రామయ్యకున్న ఆ కాస్త పొలాన్ని కూడా లాగేసుకోవాలనుకున్నాడు. ‘రామయ్యా! మర్యాదగా మిగిలిన అయిదు వజ్రాలు కూడా ఇవ్వు. లేకపోతే నీ పొలం నాకు రాసివ్వు’ అన్నాడు రవీంద్ర. ‘అయ్యా... నాకు దొరికిన సంచిని మీకు అప్పగించాను. ఒక్క వజ్రం కూడా తీసుకోలేదు. ఆ కాస్త పొలమే నాకు ఆధారం’ అన్నాడు రామయ్య. రవీంద్ర అక్కడితో ఆగకుండా... సమస్యను న్యాయాధికారి దృష్టికి తీసుకెళ్లాడు. మొత్తం విన్న తర్వాత అధికారికి అసలు విషయం అర్థమైంది. ‘నిజాయతీ అంటే... రవీంద్రదే. తన సంచిలో ఇరవై వజ్రాలుండాలి అని చెబుతున్నాడు... కాబట్టి ఈ సంచి రవీంద్రది కాదు. ఇది ఇంకెవరిదో అయి ఉంటుంది. వజ్రాలు పోయినట్లు నాకు ఎవరి నుంచీ ఫిర్యాదు అందలేదు కాబట్టి, ఆ దొరికిన వజ్రాలన్నీ రామయ్యే తీసుకోవచ్చు. ఇక రవీంద్ర పోగొట్టుకున్న ఇరవై వజ్రాలున్న సంచి ఎవరికైనా దొరికితే తప్పనిసరిగా అప్పగించాలి. ఇదే నా తీర్పు’ అన్నాడు న్యాయాధికారి. ‘ఆ రామయ్య తెచ్చి ఇచ్చినప్పుడు
నా సంచి నేను తీసుకుని, ఎంతో కొంత బహుమతి ఇచ్చి పంపితే నా వజ్రాలు నాకు దక్కేవి. అనవసరంగా రామయ్య పొలం కాజేయాలనుకున్నా. ఇప్పుడు ఎంతో విలువైన నా వజ్రాలే నాకు కాకుండా పోయాయి’ అని బాధపడ్డాడు రవీంద్ర.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..