బాబూ... ధర్మం చేయొద్దు పెట్టుబడి పెట్టండి!

ఆ స్టార్టప్‌ పేరు ‘బెగ్గర్స్‌ కార్పొరేషన్‌’. పేరుకు తగ్గట్టు ఇందులో భిక్షగాళ్ళే ఉంటారు కానీ... వాళ్ళు ముష్టి అడగరు. తమకి ‘ధర్మం’ చేసే మొత్తాన్ని భిక్షంలా కాకుండా ఓ పెట్టుబడిగా ఇవ్వమంటారు.

Updated : 07 May 2023 10:24 IST

బాబూ... ధర్మం చేయొద్దు పెట్టుబడి పెట్టండి!

ఆ స్టార్టప్‌ పేరు ‘బెగ్గర్స్‌ కార్పొరేషన్‌’. పేరుకు తగ్గట్టు ఇందులో భిక్షగాళ్ళే ఉంటారు కానీ... వాళ్ళు ముష్టి అడగరు. తమకి ‘ధర్మం’ చేసే మొత్తాన్ని భిక్షంలా కాకుండా ఓ పెట్టుబడిగా ఇవ్వమంటారు. అలా ఎవరైనా పెట్టుబడి పెడితే... ఆ సాయంతో రకరకాల ఉత్పత్తులు చేసి బడా సంస్థలకి అమ్ముతున్నారు. వచ్చిన లాభంలో భారీ ‘రిటర్న్స్‌’ ఇస్తున్నారు! దేశంలో భిక్షగాళ్ల కోసం ఏర్పడ్డ ఈ సంస్థ కథేమిటో చూద్దామా...
కాశీ... హిందువులూ, జైనులూ, బౌద్ధులకి ఇదెంత పుణ్యస్థలమో చెప్పక్కర్లేదు. కాకపోతే, అక్కడ అంతేస్థాయిలో భిక్షగాళ్ళుంటారు. 38 ఏళ్ళ విమలా పాథక్‌ వాళ్ళలో ఒకరు. పక్కనే ఆమె 12 ఏళ్ళ కొడుకు విశాల్‌ దీనంగా నిల్చుని ఉండేవాడు. భర్త రెండోపెళ్ళి చేసుకుని తల్లీకొడుకులిద్దరినీ వెళ్ళగొట్టడంతో ఆకలి బాధ భరించలేక ఇలా కాశీ పంచన చేరారట. గత ఏడాది ఆ ఇద్దర్నీ చేరదీసింది ‘బెగ్గర్స్‌ కార్పొరేషన్‌’. విమలా పాథక్‌కి కుట్టులో శిక్షణ ఇస్తామంటే ‘నేనా..? నేర్చుకోగలనా?’ అని బెదిరిపోయిందట. దాంతో ఆమె ఆత్మన్యూనతని పోగొట్టి నలుగురితో హుందాగా మాట్లాడటం నేర్పాలని ముందుగా వ్యక్తిత్వవికాస తరగతులు ఇప్పించింది బెగ్గర్స్‌ కార్పొరేషన్‌. ఆ తర్వాతే ఆధునిక డిజైన్‌లపైన కుట్టుశిక్షణ అందించింది. కాశీలో ఇలాంటి ఉపాధి అందించే ఎన్జీఓలు ఇదివరకే ఉన్నాయి. కానీ బెగ్గర్స్‌ కార్పొరేషన్‌ సంస్థ భిక్షగాళ్ళని తాము ‘సేవ’ చేయాల్సిన ‘లబ్ధిదారులు’గా చూడదు. వాళ్ళని తమ స్టార్టప్‌లో భాగస్వాములుగానే పరిగణిస్తుంది. భిక్షగాళ్ళకిచ్చే మెషీన్‌లూ, వాళ్ళకోసం పెట్టిచ్చే షాపులూ అన్నింటికీ వాళ్ళనే యజమానులుగా చేస్తుంది... ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా మారుస్తుంది. ఈ సంస్థ ఒక్క విమలనే కాదు... అలాంటి 14 కుటుంబాలని అక్కునచేర్చుకుంది. ఒడిశాకి చెందిన చంద్రామిశ్రా ఈ స్టార్టప్‌ వ్యవస్థాపకుడు.

‘ధర్మం’ కాదు...

అరవైఏళ్ళ చంద్రామిశ్రా మాజీ జర్నలిస్టు. ఓ ఒడియా పత్రిక తరపున దిల్లీలో పనిచేస్తుండేవారు. ఉపాధి అవకాశాలపైన ఎంతో పరిశోధన చేశారు. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో యువత ఉపాధి కోల్పోవడంపైన ఆయన ఓ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. ఆ సర్వే ద్వారా ఒక్క కాశీలోనే 27 వేలమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నట్టు తేలింది. దాంతో క్షేత్రస్థాయిలో పరిస్థితేమిటో చూద్దామని వారణాసికి వచ్చారు. అక్కడి భిక్షగాళ్ళ దైన్యం ఆయన్ని కలచివేసింది. తన రిసెర్చ్‌ని పక్కనపెట్టి... వాళ్ళకోసం ఏదైనా చేద్దామనుకున్నారు. ముందుగా భిక్షగాళ్ళ పిల్లలకోసం ‘స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌’ పేరుతో బడిని ప్రారంభించారు. అది చూసి పిల్లలతోపాటు తల్లిదండ్రులూ ఆయన వద్దకు రాసాగారు. వాళ్ళకి ఉపాధిని అందించేందుకు ఏదైనా చేయాలనుకున్నారు. కేవలం సేవగా కాకుండా ఓ స్టార్టప్‌ పెట్టి భిక్షగాళ్లనీ భాగస్వాముల్ని చేస్తే... వాళ్ళలో పోటీతత్వంతోపాటు సృజనా పెరుగుతుందని భావించారు. వాళ్లూ సంస్థ యజమానులవుతారని ఆశపడ్డారు. మార్కెటింగ్‌ నిపుణులైన తన మిత్రులు బద్రినాథ్‌ మిశ్రా, దేవేంద్ర థాపాలతో కలిసి ‘బెగ్గర్స్‌ కార్పొరేషన్‌’ని ప్రారంభించారు. ముందుగా భిక్షగాళ్ళ కోసం తమ సంస్థ తరపున ‘బ్యాగ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’ పేరుతో ఆధునిక బట్టలబ్యాగు తయారీ ప్రాజెక్టుని చేపట్టారు. మరి అందుకు డబ్బు...? ‘మనం జీవితంలో భిక్షగాళ్ళకి ఎంతోకొంత మొత్తం ధర్మం చేస్తుంటాం. ఆ డబ్బునే ఓ పదివేల రూపాయల పెట్టుబడిగా ఇవ్వండి. మంచి లాభాలతో తిరిగిస్తాం’ అంటూ 2022 జులైలో సామాజిక మాధ్యమాల్లో సరికొత్త ప్రచారం మొదలుపెట్టారు. ‘ఇదంతా అయ్యేపనేనా’ అన్నారట కొందరు. కానీ అయ్యింది...

చక్కటి లాభాలతో తిరిగిచ్చారు...

వీళ్ళ ఆలోచన నచ్చి.. దేశం నలుమూలల నుంచి 57 మంది 5.4 లక్షల రూపాయలు ఇచ్చారు! ఆ డబ్బుతో 12 కుటుంబాల భిక్షగాళ్ళకి వ్యక్తిత్వ శిక్షణతోపాటూ ఆధునిక వస్త్రాల తయారీలో తర్ఫీదు కూడా ఇప్పించి బ్యాగుల తయారీ మొదలుపెట్టారు. వీటిని కాశీలోని పెద్ద హోటళ్ళకీ, కొన్ని షాపులకీ సరఫరా చేశారు. బడా పారిశ్రామికవేత్తలకి తమ సంస్థ గురించి వివరించి... వాళ్ళ కాన్ఫరెన్స్‌లకి ఈ సరికొత్త బ్యాగుల్ని అందించారు. ఆ మధ్య ఓ జాతీయపార్టీ దిల్లీలో ఎగ్జిక్యూటివ్‌ కార్యకర్తల సమావేశం పెడితే... వాళ్ళకోసం 10 రోజుల్లో 500 బ్యాగులు సిద్ధం చేసి ఆశ్చర్యపరిచారు. 12 కుటుంబాల కోసం ఏర్పాటుచేసిన ‘బ్యాగ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ ప్రాజెక్టు’కి... ఒకప్పుడు ‘నేను ఇవన్నీ చేయగలనా?’ అంటూ భయపడిన విమలాపాథక్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతోపాటూ మరో రెండు కుటుంబాల కోసం కాశీలో పూజాసామగ్రి విక్రయాన్నీ పెట్టించింది బెగ్గర్స్‌ కార్పొరేషన్‌. ఈ రెండు ప్రాజెక్టులతో ఆరునెలలు తిరక్కుండానే- 55 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే వాళ్ళు అందుకున్న పెట్టుబడికి ఇది పదిరెట్లన్నమాట! ఆ ఆదాయం నుంచి పెట్టుబడిని 16.6 శాతం రిటర్న్స్‌తో ఇచ్చారు. అన్ని ఖర్చులూపోను ప్రతి సభ్యుడికీ 80 వేల దాకా మిగిలాయట! ఈ రెండు ప్రాజెక్టుల విజయంతో కాశీలో పూజాసామగ్రిని హోటళ్లలో డోర్‌ డెలీవరీ చేసే కొత్త పథకానికీ శ్రీకారం చుట్టబోతోంది బెగ్గర్స్‌ కార్పొరేషన్‌. దీని ద్వారా మరెన్నో కుటుంబాలని... యాచకవృత్తి నుంచి బయటపడేస్తామంటున్నారు చంద్రమిశ్రా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు