ఫ్యాషన్‌ మేళా!

పెళ్లయిన స్త్రీలు మెడలో సూత్రాల గొలుసుతోపాటూ నల్లపూసల్నీ వేసుకోవడమనేది తెలిసిందే. ఆ మధ్య నగల డిజైనర్లు నల్లపూసల గొలుసు సైజును తగ్గించి ముచ్చటైన బ్రేస్‌లెట్ల రూపంలో డిజైన్‌ చేశారు.

Published : 07 May 2023 00:24 IST

ఫ్యాషన్‌ మేళా!

నల్లపూసల లోలాకులు!

పెళ్లయిన స్త్రీలు మెడలో సూత్రాల గొలుసుతోపాటూ నల్లపూసల్నీ వేసుకోవడమనేది తెలిసిందే. ఆ మధ్య నగల డిజైనర్లు నల్లపూసల గొలుసు సైజును తగ్గించి ముచ్చటైన బ్రేస్‌లెట్ల రూపంలో డిజైన్‌ చేశారు. ఒకటి లేదా రెండు వరుసల్లో చాలా చిన్న పెండెంట్‌తో వచ్చిన ఆ బ్రేస్‌లెట్లను చూసి మురిసిపోయిన మహిళలు... వాటిని తమ నల్లపూసల గొలుసుకి జతగా వేసుకోవడం మొదలుపెట్టారు. ఆ రెండింటికీ మ్యాచింగ్‌గా ఇప్పుడు నల్లపూసల లోలాకులు కూడా వచ్చేశాయి. మంగళసూత్ర ఇయర్‌రింగ్స్‌ పేరుతో దొరికేస్తున్న ఈ లోలాకుల్ని రంగురాళ్లూ, ముత్యాలతో కలిపి కాస్త పొడుగ్గా, వేలాడేలా ట్రెండీలుక్‌తో డిజైన్‌ చేయడంతో.. అవి చీరలపైకే కాదు, చుడీదార్లూ, పాశ్చాత్య దుస్తులమీదకూ చక్కగా నప్పేస్తున్నాయి.  ఇక్కడ కనిపిస్తున్న ఈ లోలాకులన్నీ అలా డిజైన్‌ చేసినవే మరి. బాగున్నాయా...


లెదర్‌కు అద్దాల మెరుపులు

మొన్నటివరకూ లెదర్‌బ్యాగు అనగానే కేవలం నలుపు, గోధుమ, నీలం, బ్రౌను వంటి రంగుల్లోనే దొరికేది. క్రమంగా ఆ రంగుల్లోనే
రకరకాల షేడ్‌లూ వచ్చాయి. అక్కడితో ఆగిపోకుండా ఆ బ్యాగులపైన పూల ప్రింట్లూ, ఇతర డిజైన్లనూ తేవడంతో ఉద్యోగినులూ, విద్యార్థులూ వాటిని సందర్భానికి తగినట్లుగా ఎంచుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు తయారీదారులు మరో అడుగు ముందుకేసి వాటిపైన బంజారా అద్దాల కళను ఆవిష్కరించేసి... లెదర్‌బ్యాగులకు కొత్త అర్థాన్ని చెబుతున్నారు. బ్యాగు ఆకృతిని బట్టి మధ్యలో లేదా ఒకవైపు... అదీ కాదంటే పట్టీలను మాత్రం వదిలేసి మొత్తంగా ఈ పనితనాన్ని చూపిస్తూ లెదర్‌బ్యాగులకు నయా లుక్‌ను తెచ్చి వావ్‌ అనిపిస్తున్నారు. స్లింగ్‌ బ్యాగు, టోటె, ల్యాప్‌ట్యాప్‌ బ్యాగు... ఇలా అన్నింటిపైనా అద్దాలు చమక్‌చమక్‌మంటూ మెరిసిపోతుండడంతో ఫ్యాషన్‌ ప్రేమికులూ ఈ ట్రెండ్‌ను ఫాలో అయిపోతూ తెగ ఆనందపడిపోతున్నారు.


నగల చెప్పులు నచ్చాయా...

ఫ్యాషన్‌ ప్రపంచంలో ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌ జ్యువెలరీకి ఉన్న డిమాండు అంతా ఇంతా కాదు. అటు పాశ్చాత్య వస్త్రశ్రేణి మీదకే కాకుండా... ఇటు సంప్రదాయ దుస్తులకూ మ్యాచింగ్‌గా వేసుకునేలా, అన్ని సందర్భాలకూ నప్పేలా... ఎప్పటికప్పుడు కొత్తకొత్త డిజైన్లలో వచ్చేస్తూ షాపింగ్‌మాళ్లలోనే కాదు ఆన్‌లైన్‌లోనూ దొరికేస్తున్నాయవి. ఇప్పుడు ఆ నగల అందాల్నే చెప్పులపైకీ చేర్చి... వాటిని ఇలా కూడా డిజైన్‌ చేయొచ్చని చూపించేస్తున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. సాదా చెప్పులపైన సిల్వర్‌ నగల పట్టీలను అందంగా అమర్చేసి వాటిని వీలైనంత ట్రెండీగా మార్చేస్తున్నారు. అలా వస్తున్నవే ఈ డిజైన్లు. ఆలస్యమెందుకు మరి... ప్రత్యేక సందర్భాల్లో వేసుకునే ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌ జ్యువెలరీకి జతగా వీటినీ ఎంచుకుంటే చాలు. మ్యాచింగ్‌కు నిండుదనం వచ్చేసినట్లేగా... ఏమంటారూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..