అనాథలకు... సినిమాలూ పిక్నిక్కులూ!

‘అనాథలకు కడుపు నిండా అన్నంపెట్టడమో, కావాల్సిన వస్తువులు ఇవ్వడమో చేస్తే సరిపోతుందా. కాసింత వినోదాన్నీ, కూసింత ఆనందాన్నీ కూడా అందించాలి కదా’ అనుకున్నాడు హనుమకొండకు చెందిన మండువ సంతోష్‌.

Updated : 20 Nov 2022 00:11 IST

అనాథలకు... సినిమాలూ పిక్నిక్కులూ!

‘అనాథలకు కడుపు నిండా అన్నంపెట్టడమో, కావాల్సిన వస్తువులు ఇవ్వడమో చేస్తే సరిపోతుందా. కాసింత వినోదాన్నీ, కూసింత ఆనందాన్నీ కూడా అందించాలి కదా’ అనుకున్నాడు హనుమకొండకు చెందిన మండువ సంతోష్‌. అందుకే అనాథ చిన్నారుల్నీ, వృద్ధుల్నీ... విహారయాత్రలకు తీసుకెళుతున్నాడు.

అందరు చిన్నారుల్లాగే అనాథాశ్రమాల్లో ఉండే పిల్లలూ రెస్టరంటులో భోజనం చేయాలనీ, థీమ్‌ పార్కుకెళ్లి రైడ్లలో తిరగాలనీ కోరుకుంటారు. వృద్ధాశ్రమంలోని పెద్దలూ కాలక్షేపం కోసం ఎక్కడికైనా వెళితే బాగుండనుకుంటారు. కానీ కుటుంబమే లేని ఆ అనాథలకు మూడుపూటలా ఆహారం.. దొరకడమే గొప్ప అయితే ఇక, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇదే సందేహం వచ్చింది సంతోష్‌కు. వెంటనే తాను నడుపుతున్న సేవా సమితి ద్వారా అనాథల సరదాలు తీర్చాలనుకున్నాడు.

సంతోష్‌... తన స్నేహితులతో కలిసి 2013లో ‘సులక్ష్య సేవా సమితి’ (ఫోన్‌ నం- 99852 66949) పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారానే ఓసారి అనాథల్ని ‘కాకతీయ యాత్ర’ పేరుతో వేయిస్తంభాల గుడి, కోటగుళ్ల లాంటి చారిత్రక ప్రదేశాలకు విహార యాత్రకు తీసుకెళ్లాడు. మరోసారి అనాథ శరణాలయంలోని పిల్లల్ని కలిసేందుకు వెళ్లినప్పుడు ‘మా స్నేహితుల్లానే మాకూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనుంది అన్నయ్యా’ అన్నారట. వెంటనే సంతోష్‌ ఆ పిల్లలను థియేటర్‌కు తీసుకెళ్లి సినిమా చూపించాడు. ఆ తర్వాత నుంచీ చుట్టుపక్కల ఉన్న అనాథాశ్రమాల్లో ఉండే వాళ్లందరినీ యాత్రలకు తీసుకెళ్తున్నాడు. మరి వీటన్నింటికీ డబ్బు ఎలా అంటే... ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న సంతోష్‌ తాను సంపాదించిన దాంట్లోనే సేవకీ కొంత ఖర్చు చేస్తున్నాడు. ఇంకా ఈయన సేవా కార్యక్రమాల గురించి తెలిసినవారు ముందుకొచ్చి ఆర్థిక సహకారం అందిస్తున్నారట. తెలుగురాష్ట్రాల్లోని ఏ అనాథాశ్రమానికి చెందిన వారు అయినా సరే ‘సులక్ష్య సేవా సమితి’ని సంప్రదిస్తే ఆ పిల్లల సరదాలూ తీర్చడానికి మేం సిద్ధంగా ఉన్నామంటున్నాడు సంతోష్‌.

- గుండు పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..