పులుసు... పసందుగా!

పప్పు, సాంబార్‌ కాకుండా ఇంకేదైనా వెరైటీగా చేసుకోవాలనుకునేవారికి పులుసు చక్కని ప్రత్యామ్నాయం అంటారు కదా... మరి వీటిల్లో మీకు ఏ పులుసు నచ్చుతుందో చూసేయండి మరి.

Updated : 30 Oct 2022 05:13 IST

పులుసు... పసందుగా!

పప్పు, సాంబార్‌ కాకుండా ఇంకేదైనా వెరైటీగా చేసుకోవాలనుకునేవారికి పులుసు చక్కని ప్రత్యామ్నాయం అంటారు కదా... మరి వీటిల్లో మీకు ఏ పులుసు నచ్చుతుందో చూసేయండి మరి.


గుత్తివంకాయ పులుసు

కావలసినవి: వంకాయలు: అరకేజీ, చింతపండు: నిమ్మకాయంత, నూనె: పావుకప్పు, పసుపు: పావుచెంచా, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత, బెల్లం తరుగు: మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: చెంచా, ఎండుమిర్చి: రెండు, ఇంగువ: పావుచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు. మసాలాపొడికోసం: పచ్చిసెనగపప్పు-మినప్పప్పు-పల్లీలు- జీలకర్ర-దనియాలు: టేబుల్‌స్పూను చొప్పున, నువ్వులు: రెండు టేబుల్‌స్పూన్లు, మెంతులు: పావుచెంచా, ఎండుమిర్చి: పది.

తయారీ విధానం:వంకాయల్ని గుత్తొంకాయ తరహాలో కోసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి మసాలాకోసం పెట్టుకున్న పదార్థాలను విడివిడిగా వేయించుకుని ఆ తరువాత అన్నింటినీ మిక్సీలో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి ముప్పావువంతు నూనె వేసి వంకాయల్ని వేయించుకుని మూత పెట్టాలి. అవి మెత్తగా మగ్గాక చింతపండు రసం, రెండుకప్పుల నీళ్లు, పసుపు, తగినంత ఉప్పు, చేసిపెట్టుకున్న మసాలా నాలుగు టేబుల్‌స్పూన్లు, బెల్లం తరుగు, కొత్తిమీర వేసి పావుగంట ఉడికించుకుని చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి మిగిలిన నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేయించి పులుసులో కలిపితే చాలు.


ఉల్లిపాయ పులుసు

కావలసినవి: నూనె: నాలుగు టేబుల్‌స్పూన్లు, ఇంగువ: చిటికెడు, కరివేపాకు రెబ్బలు: మూడు, సాంబారు ఉల్లిపాయలు: పది, వెల్లుల్లి రెబ్బలు: పది, టొమాటో: ఒకటి, చింతపండు: ఉసిరికాయంత, ఉప్పు: తగినంత, చక్కెర: రెండు టేబుల్‌స్పూన్లు, దనియాలు: చెంచా, ఎండుమిర్చి: మూడు, సెనగపప్పు: చెంచా, మిరియాలు: చెంచా, మెంతులు: పావుచెంచా, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, మినప్పప్పు: చెంచా.

తయారీ విధానం: చింతపండును నానబెట్టుకుని రసం తీసి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి... చెంచా నూనె వేసి దనియాలు, ఎండుమిర్చి, సెనగపప్పు, మిరియాలు, మెంతుల్ని వేయించుకుని తీసుకోవాలి. ఆ తరువాత ఈ దినుసుల్ని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. స్టౌమీద మళ్లీ కడాయి పెట్టి మిగిలిన నూనె వేసి ఆవాలు, ఇంగువ, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేయించుకుని... ఉల్లిపాయలు, వెల్లుల్లి, టొమాటోముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక చేసిపెట్టుకున్న మసాలాపొడి, చింతపండురసం, మరో కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. పులుసు ఉడుకుతున్నప్పుడు తగినంత ఉప్పు, చక్కెర వేసి బాగా కలిపి దింపేయాలి.


గోంగూర పులుసు

కావలసినవి: శుభ్రంగా కడిగిన గోంగూర ఆకుల తరుగు: రెండు కప్పులు, సెనగపప్పు: పావుకప్పు (అరగంటసేపు నానబెట్టుకోవాలి), చిన్న ఉల్లిపాయలు: పది, పచ్చిమిర్చి: అయిదు, పసుపు: పావుచెంచా, జీలకర్ర: చెంచా, ఆవాలు: చెంచా, ఎండుమిర్చి: నాలుగు, కారం: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: ఓ గిన్నెలో గోంగూర ఆకుల తరుగు, ఉల్లిపాయలు, సెనగపప్పు, పచ్చిమిర్చి తీసుకుని అవి మునిగేలా నీళ్లు పోసి స్టౌమీద పెట్టాలి. గోంగూర, సెనగపప్పు ఉడికాక తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి... సిమ్‌లో పెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేయించుకుని పులుసులో వేసి చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. 


ముక్కల పులుసు

కావలసినవి: తీపి గుమ్మడికాయ, సొరకాయ, చిలగడదుంప బెండకాయ ముక్కలు: అన్నీ కలిపి రెండు కప్పులు, మునక్కాడలు: రెండు, సాంబారు ఉల్లిపాయలు: ఆరు, చింతపండు గుజ్జు: పావుకప్పు, బెల్లం తరుగు: పావుకప్పు, బియ్యప్పిండి: చెంచా, కందిపప్పు: పావుకప్పు, పసుపు: అరచెంచా, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: అరచెంచా, ఎండుమిర్చి: మూడు, నూనె: రెండు చెంచాలు, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, కరివేపాకు రెబ్బలు: మూడు, కారం: రెండు చెంచాలు, దనియాలపొడి: చెంచా.

తయారీ విధానం: కందిపప్పు, కూర ముక్కలన్నింటినీ కుక్కర్‌లో వేసుకుని ఉడికించుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకుని కరివేపాకు, ఉడికించిపెట్టుకున్న కూరగాయ ముక్కలు పప్పుతో సహా వేసి బాగా కలపాలి. ఇందులో చింతపండు గుజ్జు, పసుపు, బెల్లం, తగినంత ఉప్పు వేసి కలపాలి. అయిదు నిమిషాలయ్యాక కారం, దనియాలపొడి, కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఇప్పుడు బియ్యప్పిండిలో పావుకప్పు నీళ్లు కలిపి.. పులుసులో వేయాలి. ఇది ఉడికి దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..