మొక్కలు పెంచడం నేర్పిస్తారు!

వంకాయ మొక్క బాగానే పెరిగింది కానీ... కాయలే ఇంకా రావడంలేదు... ఆకుకూరల్ని సేంద్రియపద్ధతిలో పెంచాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో... పిల్లలకు కూరగాయలపైన ఇష్టాన్ని కలిగించాలంటే ఎలా... ఇలాంటి వాటన్నింటికీ పరిష్కారాన్ని చూపిస్తుంది ‘ఆర్గానో ఎట్‌ స్కూల్‌’.

Updated : 08 Jan 2023 03:26 IST

మొక్కలు పెంచడం నేర్పిస్తారు!

వంకాయ మొక్క బాగానే పెరిగింది కానీ... కాయలే ఇంకా రావడంలేదు... ఆకుకూరల్ని సేంద్రియపద్ధతిలో పెంచాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో... పిల్లలకు కూరగాయలపైన ఇష్టాన్ని కలిగించాలంటే ఎలా... ఇలాంటి వాటన్నింటికీ పరిష్కారాన్ని చూపిస్తుంది ‘ఆర్గానో ఎట్‌ స్కూల్‌’. ఆసక్తి ఉన్నవారికి వ్యవసాయంలో ప్రత్యేక కోర్సుల్ని నిర్వహిస్తూ... రైతు పడే కష్టాన్ని పరోక్షంగా తెలియజేస్తోంది.

గరాలూ, పట్టణాల్లో పెరిగే పిల్లలకు మట్టివాసనలోని ఆనందం అర్థంకాదు. ఓ కూరగాయను పండించడం వెనక ఉన్న కష్టం వాళ్లకు తెలియదు. అలాంటి పిల్లలకు మొక్కల పెంపకంలోని ఆనందాన్నీ సంతృప్తినీ రుచి చూపాలనుకున్న ఓ సంస్థ వాళ్లకోసం ప్రత్యేకంగా వ్యవసాయ పాఠశాలనే ప్రారంభించి వారాంతాల్లో తరగతుల్ని నిర్వహిస్తోంది. సేంద్రియ పద్ధతిలో మూడు నెలల్లోగా పండించగలిగే పంటలపైన సంపూర్ణ అవగాహన కల్పిస్తోంది. ‘పర్యావరణానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ‘ఆర్గానో ఎకో ఇన్‌హాబిటాట్స్‌’ అనే సంస్థను నేను, రఘు, మీనా మురుగప్పన్‌ కలిసి ప్రారంభించాం. వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌లుగా ఉన్న మేం ఇప్పటికే పర్యావరణానికి మేలు చేసే దిశగా వివిధ ప్రాంతాల్లో, కార్పొరేట్‌ సంస్థల్లో, గేటెడ్‌ కమ్యూనిటిల్లో సోలార్‌ప్యానెళ్ల ఏర్పాటు, నీటి సంరక్షణపైన అవగాహనా కార్యక్రమాలు, బయోగ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటు, వ్యర్థాలను సద్వినియోగం చేసే విధానం... తదితర అంశాలపైన పనిచేశాం, శిక్షణ కూడా అందించాం. అవన్నీ చేస్తున్నప్పుడే చాలామందికి వ్యవసాయంపైన ఎలాంటి అవగాహనా లేదని తెలిసి బాధనిపించింది. దానికి పరిష్కారంగానే ఈ వ్యవసాయ పాఠశాలను రెండేళ్లక్రితం హైదరాబాద్‌లోని కేసారంలో ప్రారంభించామ’ని వివరిస్తారు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నగేష్‌.  

ఏం నేర్పిస్తారంటే...

ఈ పాఠశాలలో వయసులవారీగా శిక్షణ తరగతులు ఉంటాయి. ఆరు నుంచి ఎనిమిదేళ్ల పిల్లల కోసం ‘కిండర్‌గార్డెన్‌’ పేరుతో అందించే కోర్సులో రెండు రకాల ఆకుకూరల సాగుపై శిక్షణ ఉంటుంది. సాగుకు అనుకూలంగా భూమిలో పోషక విలువలను పరిశీలించడం, విత్తనాలు నాటడం, కలుపుతీయడం, మొక్క ఎదుగుదలను అర్థంచేసుకోవడం, చీడపీడల నివారణ, సేంద్రియ ఎరువుల తయారీ, కోత... ఇలా ప్రతి విషయాన్నీ ఈ ఐదువారాల కోర్సులో నేర్పిస్తారు. అలాగే ‘బి ఎ ఫార్మర్‌’ పేరుతో పదివారాల పాటు నిర్వహించే కోర్సులో భాగంగా రబీ, ఖరీఫ్‌ సీజన్ల ఆధారంగా పండే పంటలపైన ఇరవై మంది విద్యార్థులకు ఒక బ్యాచ్‌ చొప్పున తర్ఫీదునిస్తారు. వీటితో పాటు వృథాను తగ్గించడం, నీటి సంరక్షణ, సేంద్రియ ఎరువుల తయారీ.. తదితర అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. ఈ తరగతులన్నీ ఆదివారాలే ఉంటాయి కాబట్టి... కుటుంబమంతా సరదాగా గడిపేందుకు కూడా ఈ పాఠశాల తోడ్పడుతోందని చెబుతున్నారు ఇక్కడి నిర్వాహకులు.

‘వ్యవసాయంలో శిక్షణ అంటే కేవలం పాఠాలను చెబుతామనుకుంటే పొరపాటు. ఒక పంటపైన ప్రాథమిక అవగాహనను కల్పించాక మట్టిని సిద్ధం చేసుకోవడం, జీవామృతం తయారీ నుంచీ... ప్రతి పనీ విద్యార్థులతోనే చేయిస్తాం. శిక్షణ కాలం పూర్తయ్యాక విద్యార్థులు పండించిన పంటను వాళ్లే తీసుకెళ్లొచ్చు. మా దగ్గర శిక్షణ తీసుకున్న వారిలో ఇప్పుడు చాలామంది దీన్నో అభిరుచిగానూ మార్చుకుంటున్నారు. ప్రస్తుతం మా దగ్గర ఇరవై మందికి పైగా ఉన్న నిపుణుల బృందం ఇక్కడకు వచ్చేవారికే కాదు ఆన్‌లైన్‌లో సంప్రదించేవారి సందేహాలనూ తీరుస్తారు. శిక్షణ కాలం పూర్తయ్యాక కూడా... ఏవైనా సందేహాలున్నా మేం నివృత్తి చేస్తాం. ఇప్పటివరకూ మా దగ్గర శిక్షణ తీసుకున్న వారిలో విద్యార్థుల నుంచి అన్ని వయసులవారూ ఉన్నారు. కొందరు మా గురించి తెలిసి.. ఇక్కడకు వచ్చి శిక్షణ తీసుకుంటుంటే.. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు కూడా తమ విద్యార్థుల్ని ఇక్కడకు పంపిస్తున్నాయి. అలా వచ్చిన స్కూళ్లలో శ్లోకా, శ్రీనిధి, చిరెక్‌, గ్లాండియల్‌ అకాడమీ, జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌స్కూల్‌.. వంటివెన్నో ఉన్నాయి. చిన్నారులు కాకుండా గేటెడ్‌ కమ్యూనిటీలూ, కార్పొరేట్‌ ఉద్యోగులూ మమ్మల్ని సంప్రదిస్తుంటారు...’ అంటున్నారు ఈ పాఠశాల నిర్వాహకులు.  

కాసాల ప్రశాంత్‌, ఈనాడు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..