పత్తి... రంగుల్లో పండుతోంది!

ప్రస్తుతం ప్రపంచం సేంద్రియ మంత్రాన్ని పఠిస్తోంది... పర్యావరణ పరిరక్షణకోసం తపిస్తోంది. అందులో భాగంగానే కృతిమ రంగులద్దని సహజ దుస్తులకోసం తెల్లని పత్తిని సైతం నేరుగా రంగుల్లో పండించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Published : 03 Dec 2022 23:45 IST

పత్తి... రంగుల్లో పండుతోంది!

ప్రస్తుతం ప్రపంచం సేంద్రియ మంత్రాన్ని పఠిస్తోంది... పర్యావరణ పరిరక్షణకోసం తపిస్తోంది. అందులో భాగంగానే కృతిమ రంగులద్దని సహజ దుస్తులకోసం తెల్లని పత్తిని సైతం నేరుగా రంగుల్లో పండించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవునండీ... నిన్నమొన్నటివరకూ పాలతెలుపు రంగులో మాత్రమే ఉండే పత్తి, ఇకనుంచి గోధుమ ఛాయల్లోనూ ఆకుపచ్చ రంగులోనూ పండేలా కొత్త వంగడాలను సృష్టించారు వ్యవసాయ నిపుణులు.

త్తి అనగానే తెల్లని దూది మాత్రమే స్ఫురిస్తుంది. అయితే ఇప్పుడు ఆ దూది రంగుల్లోనూ పండుతోంది. తద్వారా జల కాలుష్యాన్నీ తగ్గించవచ్చు. అదెలా అంటే- తెలుపు ఎంత హాయిగా ఉన్నా అందరూ రంగురంగుల దుస్తుల్ని ధరించడానికే ఇష్టపడతారు. అందుకే అవన్నీ సిల్కు, పత్తి, రేయాన్‌, నైలాన్‌... ఇలా ఏ దారాలతో తయారైనప్పటికీ వాటిని రంగుల్లో ముంచి తీస్తుంటారు. అయితే పత్తి దారాలకు రంగులు అద్దడం వల్ల నీటి వృథా పెరుగుతుంది. అందుకే నేరుగా పత్తినే భిన్న రంగుల్లో పండిస్తే... అన్న ఆలోచనతో గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు శాస్త్ర నిపుణులు. నాగపూర్‌లోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ సంస్థ, ధార్వాడలోని అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలకు చెందిన నిపుణులు రంగుల పత్తి వంగడాలను సృష్టించి, గత ఐదేళ్ల నుంచీ వివిధ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. పైగా వాణిజ్యపరంగా పండించే పత్తి పంటలకి తెగుళ్లు ఎక్కువ. దాంతో పురుగు మందులు కొట్టడం వల్ల నేల మరే పంటకీ పనికిరాకుండా పోతోంది. అందుకే తెగుళ్లని తట్టుకోవడంతోపాటు నాణ్యమైన దారాల్ని అందించే రంగుల హైబ్రిడ్‌ పత్తి వంగడాల్ని అభివృద్ధి చేశారట.

పూర్వకాలం నుంచీ...

అలాగని రంగుల పత్తి మనదగ్గర మరీ కొత్తదేమీ కాదు. ఐదువేల ఏళ్ల క్రితమే మొహంజొదారొలో నాలుగైదు రంగుల పత్తిని పండించినట్లు తెలుస్తోంది. ఆ తరవాత బెంగాల్‌లో ముదురు గోధుమ రంగు పత్తినీ, మేఘాలయలోని గారో కొండల్లో పసుపుతో కూడిన లేతాకుపచ్చ, లేత గులాబీరంగు పత్తి రకాల్ని ఎప్పటినుంచో పండిస్తున్నారు. అంతెందుకు... ఆంధ్రప్రదేశ్‌లోని గొల్లప్రోలు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ లేత గులాబీ రంగు పత్తిని పండించేవారు. దీన్నే ఎర్ర పత్తి అనేవారు.  కేవలం మనదగ్గరనే కాదు, ఇజ్రాయెల్‌, పెరు, మెక్సికో, ఈజిప్టు దేశాల్లో గ్రే, లేత గోధుమ, గోధుమ, నలుపు, లేతపసుపు, గులాబీ, నీలం, ఆకుపచ్చ, ఎరుపు... ఇలా దాదాపు 40 రంగుల్లో పత్తి సహజంగానే పండుతుందట. అయితే ఆయా పత్తి దారాలకు దృఢత్వం తక్కువగా ఉండటంతో చేత్తో నేసే చిన్నపాటి వస్త్రాలకే తప్ప మెషీన్లమీద దుస్తుల్ని తయారుచేసేందుకు పనికిరావడం లేదు. కానీ అతినీలలోహిత కిరణాల్ని తట్టుకునే శక్తి రంగుల పత్తిదారాల్లోనే ఎక్కువట.

అందుకే, గత కొన్ని దశాబ్దాలుగా పలు ప్రాంతాల్లోని పత్తి పరిశోధక కేంద్రాలు దీనిమీద విస్తృత కృషిచేసి గోధుమ ఛాయల్లో పండే ఎన్‌డీఎల్‌హెచ్‌-1, హెచ్‌సి-2, డిడిసిసి1, డిఎంబి-225, ఎంఎస్‌హెచ్‌-53... ఇలా కొన్ని రకాల పత్తి వంగడాలను అభివృద్ధి చేశాయి. అదెలా అంటే- ఆ రంగులకి కారణమైన జన్యువుల్ని మన్నికైన దారాల్నిచ్చే తెలుపురంగు పత్తిలోకి చొప్పించి నాణ్యమైన హైబ్రిడ్‌ రకాల్ని రూపొందించారు. వీటి పంట దిగుబడి కూడా బాగుండటంతో ఇప్పుడిప్పుడు వాణిజ్యపరంగానూ పండిస్తున్నారు. ఆస్ట్రేలియాలో అయితే నలుపుతోపాటు అనేక ముదురు రంగుల పత్తి వంగడాలనీ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. బ్రెజిల్‌కు చెందిన ‘నేచురల్‌ కాటన్‌ కలర్‌’ అనే ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఇప్పటికే సహజ రంగులతో పండిన కాటన్‌ దుస్తుల్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆల్గోడోన్స్‌ మాయాస్‌, బ్రాండ్‌తో విక్రయిస్తోన్న గోధుమ రంగు పత్తి దుస్తులు అమెరికన్లకు తెగ నచ్చేస్తున్నాయట. సో, మున్ముందు ఫ్యాషన్‌ సామ్రాజ్యంలో రంగులద్దని కాటన్‌ వస్త్రాలదే హవా అన్నమాట!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..