నది కింద మెట్రో పరుగులు

ఇప్పటి వరకూ మనదేశంలో రవాణా కోసం నీళ్లపైన వంతెనలు కట్టడం, కొండల్ని తొలిచి సొరంగమార్గాల్ని నిర్మించడం తెలిసిందే.

Updated : 19 Feb 2024 16:38 IST

ఇప్పటి వరకూ మనదేశంలో రవాణా కోసం నీళ్లపైన వంతెనలు కట్టడం, కొండల్ని తొలిచి సొరంగమార్గాల్ని నిర్మించడం తెలిసిందే. నీటి అడుగున రహదారులు వేయడం ఎప్పుడైనా విన్నారా... తొలిసారి నదీగర్భంలో రైలు మార్గాన్ని నిర్మించి సరికొత్త రికార్డును సృష్టించారు కోల్‌కతా మెట్రో అధికారులు. ఆ నిర్మాణ విశేషాలివే...

కోల్‌కతా-హవ్‌ డా జంట నగరాల్ని చీల్చుకుంటూ వెళుతుంది హుగ్లీ నది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఆ నగరంలో ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలంటే- హుగ్లీపైన నిర్మించిన హవ్‌ డా బ్రిడ్జి, మెట్రో మార్గం ద్వారానే ప్రయాణికులు గంటల తరబడి ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో హుగ్లీ నదీగర్భంలో మెట్రో నిర్మించి ప్రయాణీ¨కుల సమయాన్ని ఆదా చేస్తున్నారు అధికారులు.

* దేశంలో మెట్రో సేవల్ని పొందిన తొలి నగరం కోల్‌కతా. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ మరో కొత్త రికార్డును నమోదు చేసింది.

* ప్రయాణీకుల సమయాన్ని ఆదా చేసి వారి  ప్రయాణాన్ని మరింత సౌకర్యంగా మార్చాలనే ఉద్దేశంతోనే అధికారులు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  కోల్‌కతాలోని హవ్‌ డా మైదాన్‌- ఎన్‌ప్లనేడ్‌ స్టేషన్ల మధ్య ప్రయాణించాలంటే- హుగ్లీ నదిపైన నిర్మించిన మెట్రో మార్గంలో నలభై ఐదు నిమిషాలూ, హవ్‌ డా బ్రిడ్జిపైన రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటన్నరా పడుతుంది. కేవలం నది కారణంగా ప్రయాణీ¨కుల సమయం వృథా కావడం గమనించిన అధికారులు... ఎలాగైనా ఆ సమయాన్ని కుదించాలనుకున్నారు.

* ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌లో భాగంగా కోల్‌కతా నగరంలోని టెగోరియా స్టేషన్‌ నుంచి హుగ్లీ నదికి అవతల ఉన్న హవ్‌ డా మైదాన్‌ వరకు కోల్‌కతా మెట్రో లైన్‌-2 (గ్రీన్‌ లైన్‌) వెళ్తుంది. ఈ మార్గంలో 17 రైల్వే స్టేషన్లు ఉంటే వాటిలో 6 భూగర్భంలో ఉంటాయి. ఈ గ్రీన్‌ లైన్‌ పొడవు 16.6 కిలోమీటర్లు. ఇందులో 10.8 కిలోమీటర్ల లైన్‌ భూగర్భంలో వెళ్తుంది. అందులో భాగంగానే హుగ్లీ నదీ గర్భంలో 520 మీటర్ల పొడవున మెట్రో కారిడార్‌ను నిర్మించారు.

* ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌కు ఫిబ్రవరి 2009లో పునాదిరాళ్లు వేసిన అధికారులు 2014 అక్టోబర్‌ నాటికి ఆ మార్గంలో మెట్రో సేవల్ని అందుబాటులోకి తేవాలనుకున్నారు. కానీ వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, జనసాంద్రత కారణంగా కొన్నేళ్లపాటు పనులు ఆగిపోయాయి. సొరంగంలో పనులు చేస్తున్నప్పుడు 2019లో జరిగిన ఓ ప్రమాదం కారణంగా సెంట్రల్‌ కోల్‌కతాలోని బౌబజార్‌ ప్రాంతంలో పదుల కొద్దీ భవంతులకు పగుళ్లు వచ్చాయి. కొన్ని పేకమేడల్లా కూలిపోవడంతో మరికొంత ఆలస్యమైంది. ఈ ఏడాది తొలినాళ్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.

* హుగ్లీ నదికి తూర్పు తీరంలో మహాకరణ్‌ స్టేషన్‌, పశ్చిమ తీరంలో హవ్‌ డా స్టేషన్‌ ఉంటాయి. మెట్రో మార్గం కోసం నదీ మట్టానికి 32 మీటర్ల లోతులో సొరంగాలను నిర్మించారు. హవ్‌ డా మెట్రో స్టేషన్‌ మాత్రం భూమి ఉపరితలానికి 33 మీటర్ల దిగువన ఉంటుంది. మన దేశంలోనే అతి లోతైన భూగర్భ మెట్రో స్టేషన్‌గానూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

* రైలు ట్రాక్‌ కోసం నిర్మించిన సొరంగాల వైశాల్యం 5.55 మీటర్లు. అందులో నడవడానికీ ఒక మార్గం ఉంది. మెట్రో రైలులో సాంకేతిక లోపాలున్నా, మరే ఇతర ఇబ్బందులు ఎదురైనా ప్రయాణీకులు సొరంగ మార్గంలోని వాకింగ్‌ ట్రాక్‌ మీదుగా నడిచి వెళ్లొచ్చు.

* కోల్‌కతా మెట్రో లైన్‌-2లో ఇప్పటికే టెగోరియా స్టేషన్‌ నుంచి మొదలయ్యే  రైళ్లు సీల్దా స్టేషన్‌ వరకు నడుస్తున్నాయి. ఏప్రిల్‌ 12న హవ్‌ డా- మహాకరణ్‌ స్టేషన్ల మధ్య అండర్‌ వాటర్‌లో ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. ఇది దేశంలో తొలిసారి నదీగర్భంలో జరిపిన నిర్మాణం కాబట్టి ఇంకొన్నాళ్లు  ట్రయల్‌ రన్స్‌ జరిపి... ఆ తరవాతే ఈ మార్గాన్ని అందుబాటులోకి తేనున్నారు.

* మెట్రో కారిడార్‌లో సొరంగ మార్గాన్ని- 1.4 మీటర్ల వెడల్పు కలిగిన కాంక్రీట్‌ రింగులతో నిర్మించారు. ఆ కాంక్రీట్‌ రింగులను జత చేసిన చోట నీళ్లు లోపలికి రాకుండా హైడ్రోఫిలిక్‌ గ్యాస్కెట్‌ అనే దృఢమైన రబ్బరుతో కాంక్రీటు రింగుల్ని అనుసంధానించారు. దాంతో చుక్క నీరు కూడా సొరంగాల్లోకి వచ్చే అవకాశం ఉండదు.

* బ్రిటన్‌కు చెందిన ప్రపంచ స్థాయి సంస్థలు అట్కిన్స్‌, సైస్ట్రాలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యాయి. వారివద్ద ఉన్న టెక్నాలజీతో 67 రోజుల్లోనే సొరంగాలను తొలిచారు. అందులో ఉంచిన కాంక్రీ¨ట్‌ రింగులను జర్మనీలో ప్రత్యేకంగా తయారు చేయించి సొరంగం నిర్మాణం పూర్తి చేశారు అధికారులు.

* ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా నిర్మించిన ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.8600 కోట్లు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..