మామిడి ముచ్చట్లు

ఈ భూమ్మీద పండే మామిడిపళ్లలో దాదాపు సగం (సుమారు కోటీ ఎనభై ఐదు లక్షల టన్నులు) భారతదేశంలోనే పండుతాయి. చైనా (47.7 లక్షల టన్నులు), థాయ్‌లాండ్‌

Updated : 15 May 2022 04:57 IST

మామిడి ముచ్చట్లు

భూమ్మీద పండే మామిడిపళ్లలో దాదాపు సగం (సుమారు కోటీ ఎనభై ఐదు లక్షల టన్నులు) భారతదేశంలోనే పండుతాయి. చైనా (47.7 లక్షల టన్నులు), థాయ్‌లాండ్‌ (36.3 లక్షల టన్నులు), మెక్సికో (22.6 లక్షల టన్నులు), ఇండోనేషియా (21.5 లక్షల టన్నులు) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.


* సీజన్‌ వచ్చీరాగానే అక్కడక్కడా మామిడి పళ్లు తినే పోటీలు నిర్వహిస్తుంటారు కదా! కేరళ కోళిక్కోడు అగ్రి హార్టికల్చర్‌ సొసైటీ కూడా ఏటా ఇలాంటి పోటీయే ఏర్పాటుచేస్తుంటుంది కానీ... ఇక్కడో విశేషముంది. ఈ పోటీలో గత 11 ఏళ్లుగా ఒక్కరే విజేతగా నిలుస్తున్నారు. ఆమె పేరు విజయా రాజగోపాల్‌. 55 ఏళ్ల వయసులో, కుర్రకారుని కూడా తోసిరాజని ఆమె మామిడిపళ్లని హాంఫట్‌ అనిపిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనేవారి ముందు రెండుకిలోల మామిడిపళ్లని ఉంచి... రెండు నిమిషాల్లోపు వాటిని తినమంటారు. విజయా రాజగోపాల్‌ రెండు నిమిషాల్లో 635 గ్రాముల మామిడిపళ్లని లాగించేశారట. ఈ విషయంలో మగవాళ్లనీ వెనక్కినెట్టి ఎంతోముందున్నారామె! రెండో స్థానం వహించిన ఆమె సమీప ప్రత్యర్థి సునీంద్రన్‌ 490 గ్రాముల్ని దాటలేకపోయారు మరి!


* 2014లో బ్రిటిష్‌ ప్రభుత్వం మన ఆల్ఫోన్సా మామిడిపళ్లను అక్కడికి దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది. దానికి వ్యతిరేకంగా అక్కడి ప్రవాసభారతీయులు వీధుల్లోకొచ్చి పోరాడారు. చివరికి ప్రభుత్వం దిగొచ్చింది. నాటి ప్రధాని టోనీ బ్లెయిర్‌ తానే స్వయంగా ఓ బుట్టెడు ఆల్ఫోన్సా పళ్లని స్వీకరించి మరీ, దిగుమతుల్ని ప్రారంభించాడు.


మామిడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా ఆ మధ్య వాటికోసం ప్రత్యేక మ్యూజియాన్ని ఏర్పాటుచేసింది ది సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సబ్‌ట్రాపికల్‌ హార్టికల్చర్స్‌(సిష్‌) సంస్థ. ప్రపంచం నలుమూలలా కాసే 800 రకాల మామిడి పళ్లని ఇక్కడ రుచి చూడొచ్చు!


* మన జాతీయ ఫలం మామిడి కదా! కానీ అది మనకి మాత్రమే కాదు... పాకిస్తాన్‌కీ ఫిలిప్పైన్స్‌కీ కూడా జాతీయ పండే. ఇక బంగ్లాదేశ్‌ అయితే మామిడి చెట్టునే తన జాతీయ వృక్షంగా చేసుకుంది.


* మొదటిసారి భారత్‌కు వచ్చి మామిడిపండు రుచి చూసిన మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ ఆ రుచికి ఫిదా అయిపోయాడు. మామిడి పట్ల ఈ ఇష్టం ఆయన తర్వాతి తరాల్లోనూ సాగింది. ఎక్కడ ఏ విజయాన్ని సాధించినా దానికి గుర్తుగా రకరకాల సంకర పద్ధతులతో ఓ కొత్త మామిడి రకాన్ని తయారుచేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు మొఘల్‌ రాజులు. తోతాపురి, జహంగిర్‌... ఇలా మనదేశంలో ఉన్న సగానికిపైగా వెరైటీలు మొఘల్‌ చక్రవర్తుల కాలంలో వచ్చినవే!


ఇప్పటిదాకా దాదాపు 80 దేశాలు మామిడిపళ్లపైన స్టాంపులు విడుదల చేశాయి. ప్రపంచంలో మరే పండుకీ ఆ గౌరవం లేదు మరి!


మామిడిని తమిళం లేదా మూల ద్రవిడ భాషలో ‘మా’ అనే అంటారు. దానికి ‘కాయ’చేరిస్తే మాంగాయ్‌ అయింది. తెలుగువాళ్ల ‘మాగాయ’ పదం దీని తోబుట్టువే. ఆ మాంగాయ్‌ కాస్తా పోర్చుగీసు భాషలోకి వెళ్లి అక్కడ ‘మాంగా’ అయ్యి, ఇంగ్లిషువాళ్ల నోటపడి ‘మ్యాంగో’ అయ్యిందట.


ఇటు చైనా నుంచి మొదలుపెట్టి అటు రష్యా, ఉక్రెయిన్‌, పోలండ్‌, జర్మనీల దాకా... ఎక్కడా మామిడి తోటల్ని చూడలేం! అక్కడి వాతావరణం ఈ పంటకి బొత్తిగా పడదు.


ఉత్తరాదిన పండే నూర్జహాన్‌ మామిడి... మనదేశంలోని ప్రధాన వెరైటీల్లో ఒకటి. కాకపోతే, మొఘల్‌ రాణి నూర్జహాన్‌కీ దీనికీ ఏ సంబంధమూ లేదు. ఈ వెరైటీ ఆఫ్ఘనిస్థాన్‌కి చెందింది.


అలెగ్జాండర్‌ చక్రవర్తి భారతీయ రాజు పురుషోత్తముడికి తలవంచి వెనుతిరిగి వెళ్లేటప్పుడు... భారీగా మామిడిపళ్లనీ తీసుకెళ్లాడని చెబుతారు. ఐరోపాకి మామిడిపళ్లు అలాగే పరిచయమయ్యాయట.


మీకు తెలుసా!
ఎవరు పెట్టినదీ వరుస?

ఆంగ్ల అక్షరాల క్రమాన్ని అల్ఫాబెటికల్‌ ఆర్డర్‌ అంటారు కానీ నిజానికి అసలు ‘ఎ’ నుంచి ‘జడ్‌’ వరకు అక్షరాలను ఆ క్రమంలో అమర్చిందెవరో ఎవరికీ తెలియదు. పురాతన ఈజిప్షియన్లు బొమ్మల లిపినే భాషగా వాడుతున్న రోజుల్లోనే అక్కడ స్థిరపడిన కొందరు విదేశీయులు ఈ అక్షరాలను రూపొందించారట. క్రీ.పూ.1500-300 మధ్య కాలంలో అభివృద్ధి చెంది, క్రీ.శ.ఎనిమిదో శతాబ్దం నాటికి గ్రీసులో వాడుకలో ఉన్న ఈ అక్షరాలకి రోమ్‌లో ఒక రూపం వచ్చిందట. మొదట్లో ఉన్న ‘జడ్‌’ని చివరికి తెచ్చి, కొత్తగా ‘వై’ని చేర్చి అల్ఫాబెటికల్‌ ఆర్డర్‌ని తయారు చేసింది వారేనట. అంటే ఎనిమిదో శతాబ్దం నుంచీ ఆంగ్ల అక్షరమాల ఇలాగే ఉందన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..