మొసలితో పెళ్లేంటండీ...

వర్షాకాలంలో సరిగా వానలు పడకపోతే చాలా ప్రాంతాల్లో కప్పలకు పెళ్లిళ్లు చేయడం మనకు తెలిసిందే. అదే మెక్సికోలోని ఒహాకాలో మగవారు మొసలిని పెళ్లాడటం ఆనవాయితీ. ఒహాకా మేయర్‌గా ఉన్నవారు- లేదంటే ఆ ప్రాంత పెద్దలుగా పలుకుబడి ఉన్నవారు మొసలిని వివాహం చేసుకుంటారు.

Updated : 17 Jul 2022 05:38 IST

మొసలితో పెళ్లేంటండీ...

వర్షాకాలంలో సరిగా వానలు పడకపోతే చాలా ప్రాంతాల్లో కప్పలకు పెళ్లిళ్లు చేయడం మనకు తెలిసిందే. అదే మెక్సికోలోని ఒహాకాలో మగవారు మొసలిని పెళ్లాడటం ఆనవాయితీ. ఒహాకా మేయర్‌గా ఉన్నవారు- లేదంటే ఆ ప్రాంత పెద్దలుగా పలుకుబడి ఉన్నవారు మొసలిని వివాహం చేసుకుంటారు. అందులో భాగంగా ఓ ఆడ మొసలిని తెల్లని దుస్తులతో అలంకరిస్తారు. అది దాడి చేయకుండా గట్టిగా తాళ్లతో బంధించి మేళ తాళాలతో వేదిక వద్దకు తీసుకొస్తారు. అలా గ్రామస్థులంతా కలిసి వారి సంప్రదాయం ప్రకారం ఆ పెళ్లి తంతుని జరిపించి రుచికరమైన వంటకాలతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు విందు ఏర్పాటు చేస్తారు. అంతేకాదు, మొసలిని పెళ్లి చేసుకున్నవారిని అక్కడ దైవ సమానులుగా భావిస్తారు. పెళ్లి సమయంలో గ్రామస్థులంతా వర్షాలు బాగా కురవాలనీ, పంటలు పండాలనీ, కరవు లేకుండా తమని బాగా చూడమని వేడుకుంటారు. మొసలిని పెళ్లి చేసుకుంటే అవన్నీ జరుగుతాయని వారి నమ్మకం. అలానే పెళ్లి కోసం ఆ గ్రామంలో మొసలి పిల్లల్ని పెంచుతారు. పెళ్లి జరిగిన తరవాత దాన్ని నదిలో వదిలేస్తారు.


పదేళ్లలో 11 దేశాలు

చాలామంది ఆడవాళ్లు పెళ్లై పిల్లలు పుట్టాక తమ గురించి ఆలోచించడమే మానేస్తారు. అలాంటిది కేరళలోని చిత్రపుళకి చెందిన 61 ఏళ్ల మోలీ జాయ్‌ కిరాణా షాపు నడుపుతూ ప్రపంచ దేశాలు చుట్టొస్తోంది. పదో తరగతి వరకూ చదువుకున్న మోలీకి చిన్నతనం నుంచీ విహారయాత్రలకు వెళ్లడం ఇష్టం. కానీ పేదరికం వల్ల కుదరలేదు. పెళ్లయ్యాక భర్తయినా ఆ ముచ్చట తీర్చలేదు. అతను నడిపించే కిరాణా షాపు ఒక్కరోజు తీయకపోయినా వారికి పూట గడిచేది కాదు. ఇంతలో ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త మరణించడంతో కుటుంబ బాధ్యత మోలీపైనే పడింది. దాంతో కిరాణా షాపు నడుపుతూనే పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. వాళ్లిద్దరూ చదువుకుని విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డాక పెళ్లిళ్లు చేసి తన గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. పిల్లలపైన ఆధారపడకుండా పొదుపుగా డబ్బులు దాచుకుని విదేశీ పర్యటనకు వెళుతోంది. అలా పదిహేనేళ్లలో ఇటలీ, ఫ్రాన్స్‌, వాటికన్‌సిటీ, స్విట్జర్లాండ్‌, జర్మనీ, మలేషియా, సింగపూర్‌, నెదర్లాండ్స్‌, బెల్జియం వంటి 11 దేశాల్ని చుట్టొచ్చింది. మనదేశంలో మదురై, ఊటీ, కొడైకెనాల్‌, మైసూరు, చెన్నై, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళలోని కొన్ని పర్యటక ప్రాంతాల్నీ చూసొచ్చింది. తన కిరాణా షాపు నడపగా వచ్చే డబ్బును దాచుకుని ఏడాదికో, ఆర్నెల్లకో విహారయాత్రకు వెళుతోంది. అందుకోసం ఇప్పటి వరకూ పది లక్షలు సంపాదించుకుని ఖర్చు చేసింది.


ఆ గది ఫ్రీ...

విహారయాత్రలకో, పుణ్యస్థలాలకో, కొత్త ప్రాంతాలకో వెళ్లినప్పుడు హోటళ్లలో ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో చాలామంది మంచి రేటింగ్‌, రాయితీ ఇచ్చే హోటళ్లను వెతికి మరీ బుక్‌ చేసుకుంటారు. అయితే స్పెయిన్‌లోని ఐబీఫా దీవిలోని పారాడిపో ఆర్ట్‌ అనే లగ్జరీ హోటల్‌ మాత్రం పర్యటకులకు ఉచితంగా ఆతిథ్యం ఇస్తోంది. అయితే అక్కడే ఉందో మెలిక. ఉచితంగా అద్దెకు ఇచ్చే ఆ గది పూర్తిగా పారదర్శకం. లోపలివాళ్లు ఏం చేస్తున్నారో బయటకు స్పష్టంగా కనిపించేలా దాన్ని అద్దాలతో నిర్మించారు. జీరో సూట్‌ పేరుతో పిలిచే ఆ గదిలో ఉన్నవారు తమని బయట వారు ఏ వేళలో ఎలా చూసినా ఏం ఫర్వాలేదు అనుకుంటే వెళ్లి నిశ్చింతగా అందులో ఉండొచ్చు. అదీ ఒక్కరోజు మాత్రమే అవకాశం కల్పిస్తోంది ఆ హోటల్‌. అసలే ఉచిత ఆఫర్‌...మరి పర్యటకులు మాత్రం వదులుకుంటారా... అక్కడ ఉండటానికి బారులు తీరిపోయారు.


ఇది పంటల పండుగ

రైతులు పంటలు వేయడానికి ముందు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా సంబరాలు చేసుకుంటారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు చల్లే రోజును హరేలా పేరుతో పండుగలా జరుపుకుంటారు. ఏటా జులై 16న ఘనంగా నిర్వహించే ఈ పండుగకు పది లేదా పదకొండు రోజుల ముందు- కుండలోగానీ, సంచిలోగానీ మట్టి పోసి అందులో ఐదు లేదా ఏడు రకాల ధాన్యాలను చల్లి దేవుడి పటాల ముందు ఉంచుతారు. పండుగ నాటికి ఆ విత్తనాలు మొక్క కట్టి కాస్త పైకి ఎదుగుతాయి. అలా ఎదిగిన హరేలా గడ్డికి పిండి వంటలూ, పండ్లూ నేవైద్యంగా సమర్పించి ఆలయానికి తీసుకెళతారు. శివపార్వతుల ముందుంచి పూజలు చేసిన తరవాత దాన్ని సగానికి కోసి ఇంటి మీద చల్లుతారు. మిగతాది ప్రసాదంగా తీసుకుంటారు. అందులో కొంత మట్టిలో నాటతారు. అంతేకాదు ఆ రోజున ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంటలు వేయడంతోపాటు, పండ్ల మొక్కల్నీ నాటతారు. అలా చేయడం వల్ల పైర్లు బాగా పెరిగి రైతు లాభపడతాడని వారు నమ్ముతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..