శునక ‘బంధాలు’!
పెంపుడు కుక్కలతో బోలెడు ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు స్విట్జర్లాండ్‌కు చెందిన బేసల్ యూనివర్సిటీ నిపుణులు. వాటిని తాకినా చూసినా సామాజిక బంధాల్నీ భావోద్వేగాల్నీ నియంత్రించే ప్రి-ఫ్రాంటల్ కార్టెక్స్ అనే మెదడు భాగం మరింత చురుకుగా మారుతుందట.
శునక ‘బంధాలు’!
పెంపుడు కుక్కలతో బోలెడు ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు స్విట్జర్లాండ్‌కు చెందిన బేసల్ యూనివర్సిటీ నిపుణులు. వాటిని తాకినా చూసినా సామాజిక బంధాల్నీ భావోద్వేగాల్నీ నియంత్రించే ప్రి-ఫ్రాంటల్ కార్టెక్స్ అనే మెదడు భాగం మరింత చురుకుగా మారుతుందట. ఆ కుక్క అక్కడి నుంచి వెళ్లిన తరవాతా ఇది కొనసాగుతుందనీ, అదే నిజమైన కుక్కల స్థానంలో బొమ్మ కుక్కల్ని పెడితే ఆ ప్రభావం ఉండదనీ అంటున్నారు. మిగిలిన జంతువులతో పోల్చినప్పుడు కూడా కుక్కలతో కాసేపు ఆడుకున్నవాళ్లలోనే ఒత్తిడీ డిప్రెషన్... వంటివి తగ్గినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు 19 మందిని ఎంపికచేసి, వాళ్లు కుక్కలతో ఆడుకుంటున్నప్పుడూ, స్టఫ్‌డ్ బొమ్మల్ని ఇచ్చినప్పుడూ న్యూరో ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా పరిశీలించారట. రెండో సందర్భంకన్నా కుక్కలతో ఆడుకుంటున్నప్పుడే వాళ్ల మెదడు ఎంతో చురుకుగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తమ్మీద పెంపుడు శునకాలు బంధాలకు సంబంధించిన భావోద్వేగాలనూ సమన్వయం చేస్తాయన్నమాట.
ఆల్జీమర్స్‌కి మందు!
ఆల్జీమర్స్‌ను తగ్గించేందుకు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా- ఈజై, బయోజెన్ అనే కంపెనీలు తయారుచేసిన ఓ మందు, లండన్ యూనివర్సిటీ కాలేజ్‌లో క్లినికల్ పరీక్షలన్నీ పూర్తి చేసుకుంది. ఇది రోగుల్లో ఆలోచనాశక్తి తగ్గకుండా చేయగలిగిందట. ఆల్జీమర్స్ వచ్చినవాళ్లలో హానికర అమిలాయిడ్ బీటా ప్రొటీన్ విడుదలవడంతో నాడుల పనితీరు తగ్గిపోతుంది. అయితే ఈ కొత్త మందులోని యాంటీబాడీలు ఆ ప్రొటీన్‌ను బంధించడంతో మెదడు పనితీరు దెబ్బతినకుండా చేయగలిగాయి. ఇందుకోసం ఆల్జీమర్స్ ప్రాథమిక దశలో ఉన్నవాళ్లను ఎంపికచేసి ఈ మందును పద్దెనిమిది నెలలపాటు ఇచ్చి, ఏడాదిన్నర తరవాత సమీక్షిస్తే- ఆల్జీమర్స్ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయట. అయితే ఈ మందు వ్యాధిని పూర్తిగా తగ్గించలేదనీ, కానీ ఎక్కువ కాకుండా చేయగలదని అంటున్నారు. అయినప్పటికీ ఆల్జీమర్స్ రోగులకు ఈ మందు వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని శాస్త్ర ప్రపంచం భావిస్తోంది.
ఆలస్యంగా తింటే!
ఆలస్యంగా తినడం వల్ల ఆకలి పెరగడమే కాదు, జీర్ణశక్తి తగ్గి, తిన్న క్యాలరీలన్నీ కొవ్వు కణజాలంగా మారిపోతాయి అంటున్నారు బ్రిగమ్ అండ్ విమెన్స్ హాస్పిటల్‌కి చెందిన నిపుణులు. అందుకే అర్ధరాత్రి స్నాక్స్ తినడం అలవాటు ఉన్నవాళ్లకి ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఈ స్థూలకాయం వల్లే మధుమేహం, క్యాన్సర్, ఇతరత్రా వ్యాధులన్నీ వస్తున్నాయి. కాబట్టి అర్ధరాత్రి తిండి ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం వీళ్లు బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న కొందరు వ్యక్తుల్ని ఎంపికచేసి, సగం మందికి నిర్ణీత సమయానికీ మిగిలినవాళ్లకి నాలుగు గంటలు ఆలస్యంగానూ ఆహారాన్ని ఇచ్చారట. అంతేకాదు, ఆ తరవాత రోజంతా వాళ్లకి ఎప్పుడు ఆకలేస్తుందీ, జీర్ణవ్యవస్థ ఎలా పనిచేస్తుందీ, శరీర ఉష్ణోగ్రత ఎంత ఉందీ, ఎన్ని క్యాలరీలు ఖర్చవుతున్నాయీ... వంటి విషయాలన్నింటినీ రక్తనమూనాల ద్వారా ఎప్పటికప్పడు పరీక్షిస్తూ వచ్చారట. ఇలా దాదాపు మూడువారాలపాటు నిశితంగా పరిశీలించగా- ఆకలినీ జీర్ణశక్తినీ నియంత్రించే లెప్టిన్, గెర్లిన్ ... వంటి హార్మోన్ల శాతం ఆలస్యంగా తిన్నవాళ్లలో తగ్గిందట. దాంతో క్యాలరీలు ఖర్చవడం తగ్గి, తిన్నదాంట్లో ఎక్కువ శాతం కొవ్వు కణజాలంగా మారినట్లు గుర్తించారు. దీన్నిబట్టి నిర్ణీత వేళల్లో కాకుండా- ముఖ్యంగా, అర్ధరాత్రి తినడం వల్ల ఊబకాయులుగా మారే అవకాశం ఎక్కువ అనేది తెలుస్తోంది.
ఆ సమస్యలన్నీ కొవిడ్ వల్లే!
కొవిడ్‌కు తీవ్రంగా గురయినవాళ్లకి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయనేది తెలిసిందే. అయితే స్వల్పంగా కొవిడ్ వైరస్‌కు గురైన వాళ్లకి కూడా దీర్ఘకాలంలో రకరకాల మానసిక సమస్యలు వస్తున్నట్లు సెయింట్ లూయీలోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశీలకులు పేర్కొంటున్నారు. లక్షా యాభై వేల మందిని ఏడాదిపాటు నిశితంగా పరిశీలించగా- వాళ్లలో 42 శాతం మందికి మెదడుకి సంబంధించిన సమస్యలు తీవ్రస్థాయిలో ఉన్నాయట. కొవిడ్ వచ్చి తగ్గిన ఏడాది కాలంలోనే- అదీ ఆసుపత్రి పాలైనవాళ్లకే హృద్రోగ సమస్యలూ మానసిక సమస్యలూ వస్తున్నాయి అని తొలినాళ్లలో భావించారు. కానీ వాళ్లను మరింత నిశితంగా గమనించినప్పుడు- సంవత్సరం గడిచిన తరవాత, స్వల్పంగా కొవిడ్ వచ్చి తగ్గినవాళ్లలోనూ నాడీ సమస్యలు తలెత్తుతున్నట్లు తేలింది. ముఖ్యంగా పక్షవాతం, మైగ్రెయిన్, మూర్ఛ, ఆల్జీమర్స్... వంటివి ఎక్కువగా ఉంటున్నాయట. మొత్తమ్మీద కొవిడ్ వచ్చిన వాళ్లలో 77 శాతం మందికి మతిమరుపు, 50 శాతానికి పక్షవాతం, 30 శాతం మందికి కంటి సమస్యలు వస్తున్నట్లు గమనించారు. నిజానికి ఆల్జీమర్స్ అనేది దీర్ఘకాలంలోనే అంటే- వృద్ధాప్యంలోనే బయటపడుతుంది. కానీ కొవిడ్‌తో మరో పదేళ్లకు వస్తుందనుకున్న మతిమరుపు ముందుగానే బయటపడుతుంది అంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి