విడాకులకూ వేడుకలు!

అప్పుడెప్పుడో రమ్యకృష్ణ- శ్రీకాంత్‌ నటించిన ‘ఆహ్వానం’ సినిమాలో రమ్యకృష్ణ విడాకుల ఆహ్వాన పత్రాల్ని ముద్రిస్తుంది. బంధువులకీ, స్నేహితులకీ వాటిని పంచి విడాకుల వేడుకకు రమ్మని ఆహ్వానిస్తుంది.

Updated : 25 Sep 2022 14:08 IST

విడాకులకూ వేడుకలు!

అప్పుడెప్పుడో రమ్యకృష్ణ- శ్రీకాంత్‌ నటించిన ‘ఆహ్వానం’ సినిమాలో రమ్యకృష్ణ విడాకుల ఆహ్వాన పత్రాల్ని ముద్రిస్తుంది. బంధువులకీ, స్నేహితులకీ వాటిని పంచి విడాకుల వేడుకకు రమ్మని ఆహ్వానిస్తుంది. అది సినిమా కాబట్టి అలా చేశారు, నిజజీవితంలో ఎవరైనా చేస్తారా అనే అనుమానం కలగొచ్చు. భోపాల్‌కు చెందిన భార్యాబాధితుల సంఘం- భాయ్‌ ఇప్పుడు అదే మాదిరి విడాకుల ఆహ్వాన పత్రాల్ని ముద్రించి అందుకు సంబంధించిన వేడుకల్ని జరుపుతోంది. దాదాపు రెండువందల మందిదాకా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని భాయ్‌ ఎంతో వైభవంగా నిర్వహిస్తోంది. పెళ్లి జరిగితేనే వేడుకా... విడిపోతే ఎందుకు చేసుకోకూడదు అంటూ- ఈ మధ్యనే విడాకులు తీసుకున్న పద్దెనిమిది మంది మగవాళ్ల తరఫున ఈ కార్యక్రమాన్ని జరిపించింది.


మురికివాడలు చూపిస్తారు!

అందమైన ప్రదేశాలకు తీసుకెళ్లే టూరిస్ట్‌ కంపెనీలూ, ఆ ప్రయాణాన్ని ప్లాన్‌ చేసే సంస్థలూ చాలానే ఉన్నాయి. అయితే ట్రిప్‌ అడ్వైజర్‌ అనే ట్రావెల్‌ కంపెనీ- సామాజిక స్పృహతో- కోరుకున్న వారికి మురికివాడలు చూపించడానికి సిద్ధమైంది. స్థానిక ఎన్జీఓలతో కలిసి పనిచేస్తూ ముంబయి, దిల్లీల్లోని మురికివాడల్నీ, అక్కడి ప్రజల జీవనవిధానాన్నీ, వారి సంప్రదాయాల్నీ ‘స్లమ్‌ వాకింగ్‌ టూర్‌’ పేరిట చూపిస్తోంది. అందుకుగానూ మనిషికి పద్దెనిమిదొందలు వసూలు చేస్తూ ఆ డబ్బుని మురికివాడల అభివృద్ధికి అందిస్తోంది. విదేశీయులూ, యూనివర్సిటీ విద్యార్థులూ, ఇంటర్న్‌షిప్‌ చేసేవారూ ఎక్కువగా ఈ సేవల్ని వినియోగించుకుంటూ పరోక్షంగా మురికివాడల అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. మంచి ఆలోచనే కదూ!


‘మోదీ థాలీ’ తింటే రూ.8.5 లక్షలు

ప్రధాని నరేంద్రమోదీ అభిమానులు తమ అభిమానాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా చాటుకుంటుంటారు. కొందరు పాలాభిషేకాలూ, అన్నదానాలూ, రక్తదానాలూ చేస్తే- మరికొందరు మొక్కలు నాటడం, పరిసరాలను శుభ్రం చేయడం వంటివి చేస్తుంటారు. ఎవరి స్తోమతకూ, స్థాయికీ తగ్గట్టూ వాళ్ల అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. దిల్లీలోని ‘అడోర్‌2.1’ రెస్టరంట్‌ను నిర్వహిస్తున్న సుమిత్‌ మాత్రం మోదీపైన ఆదరాభిమానాల్ని మరోలా వ్యక్తం చేస్తున్నాడు. యాభై ఆరు రకాల పదార్థాలతో ‘56- అంగుళాల మోదీ థాలీ’ పేరుతో ఓ థాలీని అందుబాటులోకి తెచ్చాడు. నలభై నిమిషాల్లో ఆ థాలీని పూర్తి చేసిన వారికి ఎనిమిదిన్నర లక్షల నగదు బహుమతిని అందిస్తాననీ ప్రకటించాడు. అంతేకాదు, మోదీ పుట్టినరోజు నాటి నుంచి సెప్టెంబరు 26 వరకూ ఆ హోటల్‌లో భోజనం చేసిన వారిని లక్కీ డిప్‌ ద్వారా ఎంపిక చేసి మోదీకి ఇష్టమైన కేదార్‌నాథ్, చార్‌ధామ్‌ యాత్రకు తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు సుమిత్‌. మరి ఈ ప్రైజ్‌మనీనీ, యాత్రకెళ్లే అవకాశాన్నీ దక్కించుకునే అదృష్టవంతులెవరో వేచి చూడాల్సిందే!


బైక్‌ ఎక్కిన ఎద్దు!

బైకు మీద తోటివారికి లిఫ్ట్‌ ఇవ్వడం చూస్తుంటాం. మహా అయితే కుక్కల్నీ, మేక పిల్లల్నీ కూడా ఎక్కించుకోవడం మనకు తెలిసిందే. ఎక్కడైనా ఎద్దుకు లిఫ్ట్‌ ఇవ్వడం చూశారా. పైగా ఆ ఎద్దు కూడా ఎలాంటి బెరుకూ లేకుండా ఎంచక్కా కూర్చుంది. పక్కనుండి వాహనాలు వెళుతున్నా, హారన్లు వినిపిస్తున్నా కలవరపడకుండా ధీమాగా చూస్తోంది. ఎందుకంటే కొన్నేళ్లుగా అది పొలానికి రోజూ దాని యజమాని బండి మీదే వెళుతూ అలా అలవాటు పడటంతో చక్కగా కూర్చుందట. ప్రేమగా ఆ ఎద్దుని బండి మీద మేతకు తీసుకెళ్లే ఆ కుర్రాడు నిజంగా గ్రేట్‌... కదలకుండా బండి మీద కూర్చోడానికి దానికి ఎంత బాగా ట్రైనింగ్‌ ఇచ్చాడో!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..