Updated : 18 Apr 2022 12:41 IST

ఆ అలవాటు కోతుల నుంచే...

ఆల్కహాల్‌కి అలవాటు పడినవాళ్లు అంత తేలికగా మానుకోలేరు. దానికి గల కారణం ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నించినప్పుడు- మనిషి ఆల్కహాల్‌కి అలవాటుపడటం అనేది ఈనాటిది కాదు, కోతుల నుంచే వచ్చింది అని చెబుతున్నారు బెర్కెలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. చెట్లమీద కాయలు తెగ పండినప్పుడు వాటి నుంచి వచ్చే ఒక రకమైన పుల్లటి వాసనని పసిగట్టిన కోతులు రోజూ ఒకే సమయానికి ఆ పండ్ల దగ్గరకు వెళ్లి వాటిని తినేవట. పనామాకి చెందిన స్పైడర్‌ కోతులు తింటున్న పండ్లను పరిశీలించినప్పుడు- వాటిల్లో ఒకటి నుంచి రెండు శాతం ఇథనాల్‌ ఉందనీ, కొన్ని పండ్లలో ఏడు శాతం కూడా ఉన్నట్లు గుర్తించారు. తరవాత ఆ కోతుల మూత్రాన్ని పరిశీలించినప్పుడు- ఆ ఆల్కహాల్‌కి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయట. అయితే ఆ కోతులు పండ్ల ద్వారా ఆల్కహాల్‌ను ఎక్కువ శక్తికోసమే తీసుకునేవి. అదేవిధంగా మనిషి సైతం మిగలపండిన పండ్లను శక్తికోసం తీసుకోవడం మొదలై, క్రమంగా అది తిన్నప్పుడు కలిగే ఆనందాన్ని గుర్తించి దాన్ని ద్రవపదార్థ రూపంలో తీసుకోవడం ప్రారంభించి ఉంటాడని భావిస్తున్నారు సదరు పరిశోధకులు.


సోడియం పెరగకుండా..!

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ అనేది నేషనల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా పరిశీలనలో తేలిందట. ద్రవపదార్థాలను ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకునేవాళ్లలో శరీర అవయవాలన్నీ సక్రమంగా పనిచేయడంతోపాటు భవిష్యత్తులో గుండె సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. ఇందుకోసం వీళ్లు 45-66 మధ్య వయసులోని 15 వేల మందిని పరిశీలించినప్పుడు- ఉప్పు తక్కువగా తీసుకుని, నీటిని ఎక్కువగా తాగేవాళ్ల శరీరంలో సోడియం శాతం తక్కువగా ఉందనీ, ఫలితంగా గుండె సమస్యలు తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. అదే, నీటిని తక్కువగా తాగేవాళ్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురవడంతోపాటు వాళ్లు కార్డియాక్‌ ఫైబ్రోసిస్‌ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిసిందట. ప్లాస్మాలో సోడియం శాతం పెరగడమే ఇందుకు కారణమట. కాబట్టి ప్లాస్మాలో సోడియంశాతాన్ని గమనించుకోవడంతో పాటు రోజూ కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.


సౌరశక్తితో వాటర్‌ ఫిల్టర్‌!

సరైన ఫిల్టర్లు లేక ఇప్పటికీ గుంతల్లో చెరువుల్లో నీళ్లని నేరుగా తాగి హానికర సూక్ష్మజీవుల కారణంగా రోగాల బారిన పడుతున్న వాళ్లెందరో. అందుకే పెద్దగా ఖర్చు లేకుండా సహజంగా దొరికే సౌరశక్తితో నడిచే వాటర్‌ ఫిల్టర్‌ని రూపొందించింది స్విట్జర్లాండ్‌కు చెందిన ఇపిఎఫ్‌ఎల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌. అదెలా అంటే- నలుచదరంగా ఉన్న గాజు పలకకి అమర్చిన ట్యూబు ద్వారా నీరు పై అరలోంచి కింది అరలోకి చేరుతుంది. ఈ గాజుపలకకి మధ్యలో ఓ పలుచని షీటులాంటిది ఉంటుంది. దీన్ని టైటానియం డై ఆక్సైడ్‌, కార్బన్‌ నానో ట్యూబ్స్‌తో తయారుచేస్తారు. ఈ నానోవైర్లు సూర్యరశ్మితో చర్యపొంది హైడ్రోజన్‌పెరాక్సైడ్‌, హైడ్రాక్సైడ్‌, ఆక్సిజన్‌లను విడుదల చేయడంతో అవి నీటిలోని సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తాయి. అంతేకాదు, నీటిలో కలిసిన ఇతరత్రా రసాయనాల్నీ పురుగుల మందుల్నీ హరిస్తాయి. ట్యూబు ద్వారా ఈ గాజుపలక మీదకి చేరిన నీరు నానోవైర్లతో చర్యపొంది కింది కంటెయినర్‌లోకి వెళుతుంది. అయితే పై భాగంలో అమర్చే పాత్ర పారదర్శకంగా ఉండాలి. దాంతో నానోవైర్లే కాదు, యూవీ కిరణాల వల్ల కూడా చాలావరకూ నీళ్లలోని హానికర సూక్ష్మజీవులన్నీ చనిపోతాయట. కాబట్టి ఈ పద్ధతిలో భారీ ఫిల్టర్లు తయారుచేసే ఆలోచనలో ఉన్నారు సదరు పరిశోధకులు.


మెదడు పెద్దగా ఉంటే..!

మెదడు పెద్దగా ఉంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. ఆ సంగతెలా ఉన్నా మెదడు పరిమాణం పెద్దగా ఉంటే ఎక్కువ కాలం జీవిస్తారు అని మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇటీవల వీళ్లు చిలుక జాతుల్లో చేసిన పరిశీలనల్లో ఈ విషయం స్పష్టమైందట. ఇందుకోసం వీళ్లు 217 చిలుక జాతుల్ని క్షుణ్ణంగా పరిశీలించగా- స్కార్లెట్‌ మకావొ, సల్ఫర్‌ క్రెస్ట్‌డ్‌ కాకాటూ జాతులు సుమారు 30 సంవత్సరాలకు పైబడి జీవించడం గమనించారు. సాధారణంగా భారీ పక్షులు మాత్రమే అంతకాలం జీవిస్తాయట. దాంతో వాళ్లు వీటిని నిశితంగా పరిశీలించగా- ఆ చిలుకల మెదడు పెద్దగా ఉందనీ దాంతో వాటికి ఆలోచనాశక్తి కూడా ఎక్కువనీ కాబట్టే అవి వాతావరణ మార్పుల్ని పసిగట్టి ఎక్కువకాలం జీవిస్తున్నాయనీ తేలింది. పైగా మెదడు పెద్దగా ఉన్న పక్షులు చుట్టుపక్కల ఉన్న చిన్నా పెద్దా పక్షుల్ని చూసి అనేక మెలకువల్ని నేర్చుకుంటున్నాయనీ అందుకే అవి పరిస్థితులకు అనుగుణంగా మారుతూ జీవించగలుగుతున్నాయనీ అంటున్నారు. దీన్నిబట్టి నేర్చుకునే ప్రక్రియ ఉన్న ప్రాణులే దీర్ఘకాలం మనుగడ సాగించగలవనీ, మనుషులకీ ఇదేసూత్రం వర్తిస్తుందనీ, ఆ కారణం వల్లే ఒకప్పటితో పోలిస్తే మనిషి ఆయుఃప్రమాణం పెరిగి ఉంటుందనీ అంటున్నారు.Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని