ఈ సారు... బడినే కాదు ఊరినీ మార్చేశారు!

‘టీచర్‌ అంటే విద్యాబుద్ధులు నేర్పించడమేనా... కచ్చితంగా అంతకుమించీ’ అంటున్నారు కేడర్ల రంగయ్య. కుమురం భీం జిల్లా కెరమెరి మండలం సావర్‌ఖేడ గ్రామ ప్రధానోపాధ్యాయుడిగా చేస్తున్న ఆయన ఓ ప్రభుత్వ బడి రూపురేఖలే మార్చేశారు. తమ పిల్లల్ని పంపడానికి ‘ససేమిరా’

Published : 30 Jan 2022 01:05 IST

ఈ సారు... బడినే కాదు ఊరినీ మార్చేశారు!

‘టీచర్‌ అంటే విద్యాబుద్ధులు నేర్పించడమేనా... కచ్చితంగా అంతకుమించీ’ అంటున్నారు కేడర్ల రంగయ్య. కుమురం భీం జిల్లా కెరమెరి మండలం సావర్‌ఖేడ గ్రామ ప్రధానోపాధ్యాయుడిగా చేస్తున్న ఆయన ఓ ప్రభుత్వ బడి రూపురేఖలే మార్చేశారు. తమ పిల్లల్ని పంపడానికి ‘ససేమిరా’ అన్న ప్రజల్లోనే మార్పు తీసుకొచ్చి, వారి సాయంతోనే బడిని బాగుచేశారు. అంతేకాదు, ఊరిని పీడిస్తున్న ప్రధాన సమస్యల్నీ పరిష్కరించారు. ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు’గా అవార్డూ అందుకున్న ఈ మాస్టారు ప్రయాణం ఆయన మాటల్లో...

ది 2010 సంవత్సరం. అప్పుడే ఉద్యోగంలో చేరుతూ సావర్‌ఖేడ బడిలో అడుగుపెట్టా. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 54 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. చాలా మంది పిల్లలు చుట్టుపక్కలున్న ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేవారు. ఇదేమంటే ‘ప్రైవేటు స్కూల్లోనే చదువు బాగా వస్తుంది’ అనే వాళ్లు ఆ ఊరివాళ్లంతా. అప్పట్లో స్కూలు హెడ్‌మాస్టారుగా ఉన్న పోతన్న పిల్లల్ని బడిలో చేర్పించడానికి చేసిన ఎన్నో ప్రయత్నాలు ఫలించలేదు. కానీ విద్యార్థుల కోసం ఆయన పడిన తపన మాత్రం నాలో స్ఫూర్తి నింపింది. 2013లో ఆయన వేరే స్కూలుకు బదిలీ అవ్వడంతో ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు నాపైన పడ్డాయి. బడిలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడా. కాన్వెంట్‌ స్కూలుకు దీటుగా మా బడి చదువులుంటాయంటూ జనాల్ని ఒప్పించా. కొద్దికొద్దిగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. మా పాప అక్షరనూ మా బడిలోనే చేర్పించా. అది చూసి మామీద ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఊళ్లో వాళ్లు చాలావరకూ ప్రైవేటు స్కూళ్ల నుంచి మార్చి మా బడికే పంపడం మొదలుపెట్టారు. అలా ఇప్పుడు మా విద్యార్థుల సంఖ్య మొత్తం 260కి చేరింది. సొంతంగా దాదాపు లక్షరూపాయల వరకూ ఖర్చుపెట్టి స్కూలు మరమ్మతులు చేయించా. బడిపైనా, విద్యార్థులమీదా మా శ్రద్ధను చూసిన గ్రామస్థులూ సహాయానికి ముందుకొచ్చారు. తలా కొంత పోగు చేసి రూ.6 లక్షలు జమ చేసి పాఠశాల బాగోగుల కోసం అందించారు. వీటితో తరగతి గదిలో ప్రొజెక్టరూ, టీవీలూ, కుర్చీలూ ఏర్పాటు చేశాం. ఇద్దరే ఉపాధ్యాయులు ఉండడంతో గ్రామంలో బీఎడ్‌, టీటీసీ చదివిన ఐదుగురు యువతీ యువకులు ప్రస్తుతం ఉచితంగా పాఠాలు బోధిస్తున్నారు.

కరోనా సమయంలో...

లాక్‌డౌన్‌లో చాలా పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు పెట్టారు. కానీ ఇక్కడ ఫోన్లూ,  సిగ్నల్‌ వ్యవస్థా సరిగా లేకపోవడంతో ‘ఎఫ్‌ఎం సావర్‌ఖేడ, సూపర్‌ 100’ కార్యక్రమాలు మొదలుపెట్టాం. పాఠశాల మైకుల్లో పాఠాలు బోధిస్తే పిల్లలందరూ ఇళ్ల నుంచే వినేవారు. ఉన్నత విద్య పూర్తి చేసిన పూర్వ విద్యార్థులతో ‘సూపర్‌ 100’ కార్యక్రమం రూపొందించాం. వీరి ఆధ్వర్యంలో పిల్లలకు పాఠాలు బోధించాం. ఇప్పటి వరకూ మా బడిలో చదువుకున్న విద్యార్థుల్లో 100 మంది పిల్లలు వివిధ గురుకులాల్లో సీట్లు సాధించారు.  

టీచర్‌గానే కాకుండా....

ఈ ఊళ్లో జరిగిన రెండు సంఘటనలు నాకెంతో తృప్తినిచ్చాయి. మొదటి సంఘటన ఏంటంటే... గ్రామంలో చాలావరకూ అమ్మాయిలు పదో తరగతి మాత్రమే పూర్తిచేసేవారు. పది కాగానే తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేసే ప్రయత్నాల్లో ఉండేవాళ్లు. అది చూశాకా వీళ్లలో మార్పు తేవాలనిపించింది. చిన్న వయసులో తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలనుకున్నవారిని కలిసి మాట్లాడ్డం మొదలుపెట్టా. అయినా వినకపోతే 100కు ఫోన్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి. దాదాపు పది బాల్య వివాహాలు ఆపగలిగా. ఇప్పుడు వారందరూ ఉన్నత చదువులు చదువుతున్నారు. రెండోది... గ్రామంలో జోరుగా మద్యం బెల్టు దుకాణాలు ఉండేవి. వాటిని మూసివేయాలంటూ 2020 ఏప్రిల్‌లో మద్యం దుకాణాల ముందు పది రోజుల పాటు దీక్ష చేశా. ఎన్ని విమర్శలు వచ్చినా వెనకడుగు వేయలేదు. పట్టువిడవకుండా నేను చేసిన ఈ దీక్షకు స్పందించి గ్రామ సర్పంచీ, ప్రజలూ ఊళ్లో మద్యం దుకాణాలు పెట్టకూడదనీ, విక్రయించకూడదనీ తీర్మానం చేసుకున్నారు.

ఇదే నా లక్ష్యం...

పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే 12 మందికి ఆర్థిక సహాయం చేస్తున్నా. నా దగ్గర 20 వేల పుస్తకాలు ఉన్నాయి. వీటితో పాటు దాతల సాయంతో పది గ్రామాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 2021లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారాన్ని అందించింది. ఆ అవార్డు కన్నా నా విద్యార్థుల విజయాలే ఎక్కువ సంతృప్తినిస్తాయి. నేను చదువు చెబుతున్న వారిలో ఒకరిద్దరినైనా ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా చూడాలన్నదే నా కల.

- చొక్కాల రమేశ్‌, ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..