బుజ్జాయితో సినిమా చూడొచ్చు!

థియేటర్‌లో సినిమా చూసిన అనుభూతి ఎంత బాగుంటుందో. కానీ, ఇంట్లో పసిపిల్లలు ఉన్నప్పుడు అలా వెళ్లి చూడటం కుదరదు. అలాగని పిల్లల్ని వదిలేసి వెళ్లలేం.

Published : 24 Dec 2022 23:54 IST

బుజ్జాయితో సినిమా చూడొచ్చు!

థియేటర్‌లో సినిమా చూసిన అనుభూతి ఎంత బాగుంటుందో. కానీ, ఇంట్లో పసిపిల్లలు ఉన్నప్పుడు అలా వెళ్లి చూడటం కుదరదు. అలాగని పిల్లల్ని వదిలేసి వెళ్లలేం. ఒకవేళ ధైర్యం చేసి థియేటర్‌కి తీసుకెళ్లినా ఆ శబ్దాలకి ఏడవడం, నిద్రపోకుండా చిరాకు చేయడం వంటివి చేస్తుంటారు. దాంతో మిగతా ప్రేక్షకులకీ ఇబ్బంది కలుగుతుంది. అందుకే, సినిమా మధ్యలోనే ఇంటికెళ్లిపోవడం తప్ప తల్లిదండ్రులకు మరో ఆప్షన్‌ ఉండదు. ఇటువంటి ఇబ్బందులను తొలగించడానికి కేరళ ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేసింది. కేరళ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (కేఎస్‌ఎఫ్‌డీసీ) నిర్వహించే కైరాళి శ్రీనీల థియేటర్‌లో పసిపిల్లలకోసం ‘క్రైయింగ్‌ రూమ్‌’ పేరిట ప్రత్యేక గదిని ఏర్పాటు చేసింది. పసివాళ్లు ఏడుపందుకోగానే వాళ్లను పారదర్శకంగా అద్దాలతో నిర్మించిన ఆ గదిలోకి తీసుకెళ్లిపోవచ్చు. అది సౌండ్‌ ప్రూఫ్‌ గది కావడంతో అందులోంచి పిల్లల ఏడుపులు బయటికి వినపడవు. బయట శబ్దాలు చాలా నిదానంగా లోపలికి వినిపిస్తాయి. పిల్లల్ని సముదాయించుకుంటూనే సినిమా చూసే వెసులుబాటున్న ఆ గదిలో తల్లిపాలు ఇవ్వడంతోపాటు, డైపర్లూ మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. పిల్లల ఏడుపుతో మిగిలిన ప్రేక్షకులకూ ఎటువంటి అసౌకర్యమూ కలగదు. తల్లిదండ్రులకు వినోదాన్ని పంచాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ గదుల్లో చక్కగా పిల్లలను లాలిస్తూ సినిమాను ఎంజాయ్‌ చేయవచ్చన్న మాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..