లంగా ఓణీ.. కట్టు మారుతోంది

పరవళ్లుతొక్కే పడుచుదనం చిందులువేసే చిలిపిదనం వాలుజడ వయ్యారం ఓరచూపు సింగారం ఇదీ... ఒకప్పటి సంప్రదాయ లంగాఓణీ సోయగం... ఆ పరువాల సోయగం ఇప్పుడు రోజుకో కొత్తందంతో ముస్తాబవుతోంది! సుమారు పదీపదిహేనేళ్లక్రితం..

Updated : 09 Jan 2022 01:06 IST

లంగా ఓణీ.. కట్టు మారుతోంది

పరవళ్లుతొక్కే పడుచుదనం చిందులువేసే చిలిపిదనం వాలుజడ వయ్యారం ఓరచూపు సింగారం ఇదీ... ఒకప్పటి సంప్రదాయ లంగాఓణీ సోయగం... ఆ పరువాల సోయగం ఇప్పుడు రోజుకో కొత్తందంతో ముస్తాబవుతోంది!

సుమారు పదీపదిహేనేళ్లక్రితం... లంగాఓణీ ఓ వేడుకలా మాత్రమే మిగిలిపోతుందేమోనని భయపడ్డారు సంప్రదాయవాదులు. అయితే అనార్కలీలూ లాంగ్‌ఫ్రాక్‌లూ ఎంత అందంగా ఉన్నా జీన్స్‌ ప్యాంట్లూ టీషర్టులూ ఎంత సౌలభ్యంగా అనిపించినా లంగాఓణీమీద మాత్రం తెలుగువాళ్లకి మోజు పెరిగిందేకానీ కాస్త కూడా తగ్గలేదు. అందుకే ఒకప్పటి సంప్రదాయ లంగాఓణీ సరికొత్త అందాలతో టీనేజీ అమ్మాయిల్నే కాదు, పాతికేళ్ల పడుచుల్నీ ఆకర్షిస్తోంది. అవును మరి... అప్పట్లో కేవలం పదహారేళ్ల ప్రాయంలోనో పెళ్లయ్యేవరకూనో మాత్రమే లంగాఓణీ వేసుకునేవారు. ఇప్పుడో... పెళ్లికూతుర్ని చేసినప్పుడు లంగాఓణీ తప్పనిసరి డ్రెస్సుగా మారింది. అక్కడితో ఆగితే చెప్పేదేముందీ... పాప పుట్టినరోజనీ చెల్లి పెళ్లనీ స్నేహితురాలి రిసెప్షననీ... ఇలా మళ్లీ మళ్లీ లంగాఓణీని వేస్తున్నారు. అయితే, ఎంత అందంగా ఉన్నా ఎప్పుడూ ఒకేలా లంగాఓణీ వేసుకుంటే బోరే కదా... అందుకే దాన్ని రకరకాలుగా వేస్తున్నారు. కుచ్చెళ్లు ముందువైపు కాకుండా వెనుకవైపున దోపి లెహంగామీద వేసినట్లుగా వదులుగా ఓణీని వేస్తున్నారు. ఇది చూడ్డానికి కొత్తగానూ ఉంటుంది. సంగీత్‌లాంటి వేడుకల్లో ఇలా వేయడం వల్ల నడుం వయ్యారం మరింత చక్కగా కనిపిస్తుంది. ఓణీని మామూలుగానే వేసినా లంగాలో కొత్తదనం చూపించాలనుకున్నట్లున్నారు డిజైనర్లు. రెండు పట్టుచీరల్ని లేదా క్లాత్‌ల్ని కలిపి హాఫ్‌ అండ్‌ హాఫ్‌ పద్ధతిలో లంగా కుట్టేస్తూ ఇదో కొత్త స్టైల్‌ అంటున్నారు. వెనుకటి రోజుల్లో ఒక్క పట్టుచీరని రెండు పరికిణీలు కుట్టించాల్సి వచ్చినప్పుడు కొంగు ఒక పరికిణీకి మధ్యలోకో పక్కకో వచ్చినట్లుగా కుట్టినట్లన్నమాట.

లంగామీదకి మళ్లీ ఓణీ ఎందుకు... చీరనే చుట్టేద్దాం అని దాన్ని ఓణీగా వేసి కుచ్చెళ్లు వెనకగా పెట్టి ఇదో స్టైల్‌ అంటున్నారు కొందరు ఫ్యాషనిస్టులు. దాన్నే కొంచెం మార్చి కుచ్చెళ్లని ముందువైపుకీ పెట్టేవాళ్లూ ఉన్నారు. ఇక, లెహంగా మాదిరిగా పట్టులంగాని కుట్టాక చుడీదార్‌మీద వేసే చున్నీ మాదిరిగా ఓణీని బెల్టులోకి పెట్టి వేసే స్టైల్‌ ఒక రకమైతే, ఆ చున్నీని లంగాలోపలికి అతుక్కునేలా కుట్టే స్టైల్‌ మరొకటి. ఇవేవీ మా వల్ల కాదులే... అనుకునేవాళ్లకోసం ఓణీని లంగాకి కలిపి కుట్టిన రెడీమేడ్‌వీ వస్తున్నాయి. సో, విభిన్న వస్త్రధారణ ఇష్టపడేవాళ్లకోసం డిజైనర్లు సైతం సరికొత్త ఆలోచనలతో లంగాఓణీల్ని డిజైన్‌ చేసేస్తున్నారు. ఎలా వేస్తేనేం... ఏదో రూపంలో లంగాఓణీ వయ్యారం ఒలికిస్తూ ఎప్పటికీ అమ్మాయిల్ని అంటిపెట్టుకునే ఉంటుందనేది నిజం. కాబట్టి, మీకే స్టైల్‌ కావాలో చూసుకోండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..