Updated : 27 Mar 2022 05:44 IST

ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం తెలుగు నేర్చుకున్నా..!

అందం, అభినయం కలగలిపితే ఆలియా భట్‌ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. పాన్‌ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్‌కి జోడీగా సీత పాత్రలో ఎంచక్కా ఒదిగిపోయింది. లంగావోణీలో లక్షణంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టిన ఈ బాలీవుడ్‌ భామ ఒక్కోమెట్టూ ఎక్కుతూ హాలీవుడ్‌ అవకాశాలను సైతం అందిపుచ్చుకుంది. తండ్రి పేరు వాడకుండా తనదైన నటనతో ఎదిగిన ఆలియా సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిమంతం.

సినీ నేపథ్యమున్న నటీనటులకు ఎదురయ్యే విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఫలానా వాళ్ల పిల్లలు కాబట్టి అవకాశాలు త్వరగా వస్తాయి అని చాలామంది అనుకుంటారు. నిజానికి ఛాన్స్‌లు రావాలన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నా- నటనతో నిరూపించుకోవడంతోపాటు పట్టుదలా, శ్రమా కూడా ఉండి తీరాల్సిందే. నా విషయంలో అదే రుజువైంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో నా సినిమాలన్నీ ఫ్లాపులే. ‘ఈ అమ్మాయికి నటనొచ్చా...’ అంటూ ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర వేసినవాళ్లూ లేకపోలేదు. దాంతో కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లినా నన్ను నేను వెతుక్కుంటూ మళ్లీ వెనక్కి వచ్చేశా. అప్పట్నుంచీ ప్రతి సినిమాకూ వ్యక్తిగతంగా వృత్తిగతంగా నన్ను నేను ఎంతో మెరుగుపరుచుకుంటున్నా. అందుకే పాన్‌ ఇండియా స్థాయిలో నిలబడగలిగానని నమ్ముతా. అయితే ఇప్పుడు ఎంతో ఇష్టపడే ఈ రంగాన్ని ఒకప్పుడు బాగా తిట్టుకునేదాన్ని తెలుసా... అదీ నాన్న మహేశ్‌భట్‌ వల్లే. ఆయన బాలీవుడ్‌లో పేరున్న దర్శకుల్లో ఒకరు. అమ్మ సోనీ రజ్దాన్‌. కొన్ని బాలీవుడ్‌ సినిమాల్లోనూ, వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. రాజీలో మా అమ్మ పాత్రలో కనిపించింది తనే. నా బాల్యంలోకి తొంగిచూస్తే నాన్న ఉండరు. ఆయన ఇంట్లో కంటే షూటింగ్‌లోనే ఎక్కువ ఉండేవారు. మమ్మల్ని మిస్‌ అవుతున్నట్టు అనిపిస్తే మధ్యాహ్న భోజనం సమయానికి పిలిపించి, తింటూ కాసేపు కబుర్లు చెప్పేవారు. నాకేమో షూటింగ్‌ దగ్గర పెట్టే భోజనాలు బాగా నచ్చేవి. నిజం చెప్పాలంటే-ఊహ తెలిశాక, తినడానికే సెట్‌కి వెళ్లేదాన్ని. ఐదేళ్ల వయసులో అనుకుంటా అలా వెళితే ‘సంఘర్ష్‌’ అనే సినిమాలో ప్రీతిజింటా చిన్నప్పటి పాత్రలో యాక్ట్‌ చేయించారు నాన్న. అప్పటికి నాకు సినిమాల గురించి ఏమీ తెలియదు. సినిమాల వల్లే నాన్న దూరంగా ఉంటున్నారని తిట్టుకునే నాకు- ఐదో తరగతిలో ఉన్నప్పుడు సినిమాలపైన ఆసక్తి కలిగింది.

ఒకసారి స్కూల్లో స్నేహితులతో కలిసి ఓ నాటకం ప్రదర్శించా. అప్పుడు పిల్లలూ, టీచర్లూ చప్పట్లు కొడుతుంటే ఉత్సాహంగా అనిపించింది. సినిమా వాళ్లని కూడా అలానే చూస్తారు కదా అనిపించింది. దాంతో నాకూ సినిమాల్లోకి రావాలనిపించింది. నాన్నకి చెబితే ‘కష్టపడే తత్వం ఉంటే ఏపనైనా చేయొచ్చు. నా పేరు వాడుకోవడం మాత్రం నాకు ఇష్టముండదు’ అని చెప్పారు. అమ్మకి కూడా నా నిర్ణయం నచ్చింది. ఆ సమయంలో సంజయ్‌లీలా భన్సాలీ ‘బ్లాక్‌’ సినిమాలో ఛైల్డ్‌ ఆర్టిస్టు కోసం వెతుకుతున్నారని తెలిసి అమ్మ నన్ను తీసుకెళ్లింది. ‘తను ఛైౖల్డ్‌ ఆర్టిస్టు కాదు. తప్పకుండా హీరోయిన్‌ అవుతుంది. ఇప్పుడే సినిమాలు చేయించొద్దు’ అని వెనక్కి పంపారు. అప్పట్నుంచీ అమ్మ డాన్స్‌, నటనలో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టింది. వీలున్నప్పుడల్లా సినిమా ఆఫీసులకూ ఆడిషన్లకూ తీసుకెళ్లేది. అలా ఒకసారి కరణ్‌జోహార్‌ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ఆడిషన్స్‌లో పాల్గొన్నా. అప్పటికే ఐదొందల మంది ఆడిషన్‌ తీసుకున్నారు. ‘ఇంకేమొస్తుందీ ఛాన్స్‌’ అనుకునేలోపు కరణ్‌ నుంచి ఫోన్‌... ‘నీ నటన బాగుంది. అయితే నీకు ఈ అవకాశం దక్కాలంటే బరువు తగ్గాల్సిందే’ అని షరతుపెట్టారు. అప్పటికి 80 కిలోలున్నా. పట్టుబట్టి మూడునెలల్లో 18 కిలోల బరువు తగ్గాక నాకు ఆ ఛాన్స్‌ ఇచ్చారు. అప్పటికి నాకు పద్నాలుగేళ్లు. చదువు కూడా ఆగిపోయింది. ఇంగ్లిష్‌ తప్ప హిందీ మాట్లాడటం అంతగా రాదు. దాంతో మొదటి సినిమాకి ఎన్నో విమర్శలొచ్చాయి. చాలారోజులు ఆ బాధలోంచి బయట పడలేకపోయా. తరవాత ఏడెనిమిది సినిమాల్లో అవకాశాలు వచ్చినా నిరాశపరిచాయి. నాకు నటన రాదని చాలామంది విమర్శించారు. డిప్రెషన్‌లోకి వెళ్లా. సినిమాలు మానేద్దాం అనుకున్నా. ఆ సమయంలో అమ్మా, కరణ్‌ నా పక్కన ఉండి కథల ఎంపిక, పాత్రకోసం చేయాల్సిన హోమ్‌వర్క్‌ గురించి చెప్పేవారు. ఆ జాగ్రత్తలు తీసుకున్నాక 2015లో వచ్చిన ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ సినిమాకి మంచి పేరు వచ్చింది.

హోమ్‌వర్క్‌ తప్పనిసరి...

నాకు పెద్ద బ్రేక్‌నిచ్చింది మాత్రం ‘ఉడ్‌తా పంజాబ్‌’. అందులో నాది డ్రగ్స్‌కి బానిసైన బిహారీ కూలీ హాకీ ప్లేయర్‌గా మారే పాత్ర. ముందుగా డ్రగ్స్‌ తీసుకున్న వారి వీడియోలు చూసి వారు ఎలా నడుస్తారూ మాట్లాడతారూ అన్నది సాధన చేశా. బిహారీ కూలీల  యాస నేర్చుకున్నా. కూలీ పాత్రలో జీవించడం మొదలుపెట్టా. ఆ షూటింగ్‌లో ఎంత పరిగెత్తానో. చాలా దెబ్బలు కూడా తగిలాయి. నటన అంటే శారీరక శ్రమ కూడా అని ఆ రోజే తెలిసింది. సెట్‌లో మొదటిరోజు కూలీ గెటప్‌లో ఉన్న నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. ఆలియా ఇంకా లొకేషన్‌కి రాలేదంటూ అంతా నాకోసం ఎదురు చూశారు. అప్పుడే అనిపించింది ఆ పాత్ర మంచిపేరు తెస్తుందని. విడుదలయ్యాక పేరుతోపాటు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా వచ్చింది. ఆ తరవాత 2018లో వచ్చిన ‘రాజీ’లో అమ్మతో కలిసి నటించా. ఆ సినిమాకోసం గూఢచారి వ్యవస్థ వాడే మోర్స్‌కోడ్‌, ఇండియన్‌ ఆర్మీ నడిపే జోంగా అనే హెవీ జీపును నడపడం, ఆత్మరక్షణవిద్య వంటివి నేర్చుకోవడంతోపాటు ఆయుధ శిక్షణ కూడా తీసుకున్నా. పాకిస్థానీ వెబ్‌సిరీస్‌లు చూసి ఉర్దూ నేర్చుకున్నా.

ఆ కష్టమే నాకు మరోసారి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ను తెచ్చిపెట్టింది. అదే సమయంలో వచ్చిన ‘గల్లీబాయ్‌’లో రణ్‌వీర్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించా. ఈ సినిమా 13 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్నీ సొంతం చేసుకుంది. నాకు ఉత్తమనటిగా అవార్డు వచ్చింది. 1940ల నాటి నేపథ్యంలో వచ్చిన ‘కళంక్‌’ కోసం ఏడాదిపాటు కథక్‌ నేర్చుకున్నా. అదీ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తరవాత నాన్న నిర్మాత- దర్శకుడిగా తెరకెక్కించిన సడక్‌ 2లో పనిచేయడం ఓ గొప్ప జ్ఞాపకం. అయితే నాకు మాత్రం సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలని ఉండేది. అందుకోసం ఎదురు చూసేదాన్ని. ఆ క్రమంలోనే  ‘గంగూబాయ్‌ కాఠియావాడి’ ప్రాజెక్ట్‌ నా తలుపు తట్టింది. గంగూబాయ్‌ పాత్ర నాతోనే చేయించాలని ఆయన ముందే నిర్ణయించుకుని స్క్రిప్టు వినిపించారు. నాకు మాత్రం భయమేసింది. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘నన్ను నమ్ము అంతే...’ అని చెప్పి బరువు పెరగమని సూచించారు. అప్పటి వరకూ ఎన్నో రకాల పదార్థాలను దూరం పెట్టిన నేను మూడుపూటలా బాగా తినేసి మూడు నెలల్లో పదికేజీలు పెరిగా. గుజరాత్‌లోని కాఠియావాడి నేపథ్యంలో జరిగే కథకోసం ఆ ప్రాంతం యాస పలకడానికి చాలా కష్టపడ్డా. ఇక సినిమా కోసం ముంబయిలో కామాఠిపుర సెట్‌ వేశారు. అక్కడికి వెళ్లగానే నాలోని గంగూబాయ్‌ బయటకొచ్చేది. కొన్నిసార్లు ఇంట్లో నాకు తెలియకుండానే గంగూలా కూర్చునేదాన్ని. తనలాగే మాట్లాడేదాన్ని కూడా. ఆ పాత్రకోసం నేను గంగూ ప్రపంచంలోకి వెళ్లిపోయా.

రాజమౌళిని అడిగా....

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటించడం ఓ గొప్ప అనుభూతి. రాజమౌళి సినిమాలు చూసి వీరాభిమానినయ్యా. ‘బాహుబలి’ చూశాక ఆయన దర్శకత్వంలో నటించాలనిపించింది. ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో ఆయన కనిపించినప్పుడు హాయ్‌ కూడా చెప్పకుండా నేరుగా ‘సర్‌, నేను మీతో కలిసి పనిచేస్తాను. ఒక్క సినిమాలో ఛాన్స్‌ ఇవ్వండి’ అని మొహమాటం లేకుండా అడిగా. వెంటనే నవ్వుతూ ఓకే చెప్పారు. కొన్నిరోజులకు కాల్‌ చేసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి చెప్పారు. ఒకసారి హైదరాబాద్‌ రమ్మని పిలిచి స్క్రిప్టు చెప్పారు. అల్లూరి సీతారామరాజు భార్య సీత పాత్ర అనీ, దానికి తగ్గట్టు రెడీ అవ్వమనీ చెప్పారు. ఇంతలో లాక్‌డౌన్‌ వచ్చింది. ఆ సమయంలో ఆన్‌లైన్‌లో తెలుగు నేర్చుకున్నా. ఎందుకంటే రాజమౌళి భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఉచ్చారణలో తప్పులు వస్తే ఊర్కోరు. హిందీ, ఇంగ్లిషుతో పోలిస్తే తెలుగు పలకడం చాలా కష్టంగా ఉండేది. ఆ విషయంలో రామ్‌చరణ్‌, తారక్‌ ఇద్దరు సాయపడేవారు. అప్పుడప్పుడూ నన్ను ఏడిపించడానికి నా ముందు ఎప్పుడూ తెలుగులో మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉండేవారు. ఆ తరవాత ఏం మాట్లాడుకునేవారో వివరించేవారు. అలా మొత్తానికి సినిమా పూర్తయ్యే సమయానికి తెలుగు స్పష్టంగా పలకడం నేర్చుకున్నా. ప్రస్తుతం ఎన్టీఆర్‌ సినిమాలోనే మరో అవకాశం వచ్చింది. అలానే రాజమౌళి సమర్పణలో రణ్‌బీర్‌తో కలిసి ‘బ్రహ్మాస్త్ర’లో చేస్తున్నా. అమితాబ్‌, నాగార్జున వంటి సీనియర్‌ నటులు అందులో ఉన్నారు. బ్రిటిష్‌ దర్శకుడు తీసే ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ అనే అమెరికన్‌ స్పై థ్రిల్లర్‌లోనూ నటిస్తున్నా. ఇప్పుడైతే క్షణం తీరిక లేకుండా చేతినిండా సినిమాలున్నాయి.


అప్పుడే పడిపోయా...

రణ్‌బీర్‌ని మొదటిసారి ‘సావరియా’లో చూసి పడిపోయా. అప్పటికి నాకు పద్నాలుగేళ్లు. తన సినిమాలన్నీ చూసేదాన్ని. ఆ విషయాన్ని కరణ్‌జోహార్‌తో చెబితే ‘రాక్‌స్టార్‌’ సినిమా కార్యక్రమంలో తనతో మాట్లాడించాడు. ‘రణ్‌బీర్‌ని ఎంత ఇష్టపడుతున్నావో చెప్పు...’ అన్నాడు. అప్పుడు నా నోటికి వచ్చినదంతా మాట్లాడేశాను. ఆ మాటలకి ‘యా దట్స్‌ వెరీ నైస్‌ ఆలియా...’ అని బదులిచ్చాడు. అప్పట్నుంచీ ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. ఆ క్రమంలో కొన్నాళ్లకి తనకీ నామీద సదభిప్రాయం కలగడంతో నన్నూ ప్రేమించడం మొదలుపెట్టాడు. కరోనా రాకపోయి ఉంటే ఈపాటికి పెళ్లి అయిపోయేది. అయితే నా దృష్టిలో మేం ప్రేమలో పడినప్పుడే రణ్‌బీర్‌తో నా పెళ్లి అయిపోయింది అనుకుంటా.


నాన్న అదే చెబుతారు...

* ఆలియా అంటే అరబిక్‌లో సర్వోన్నతమైన వ్యక్తి అని అర్థం. నాన్నే నాకు ఆ పేరు పెట్టారు. నేను హీరోయిన్‌గా బిజీ అయ్యాకే నాన్న ఇంటి పట్టున ఉండటం మొదలుపెట్టారు. ఇద్దరం కలిస్తే వైంకుఠపాళీ ఆడుకుంటాం. సక్సెస్‌నీ, స్టార్‌డమ్‌నీ ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోవద్దని పదే పదే చెబుతుంటారు.

* ఏఆర్‌ రెహమాన్‌ వద్ద కొంత కాలం సంగీత పాఠాలు నేర్చుకున్నా. ‘హైవే’, ‘ఉడ్‌తా పంజాబ్‌’తోపాటు మరో నాలుగు సినిమాల్లో పాటలు కూడా పాడా.

* నా ఫస్ట్‌ క్రష్‌ షారూఖ్‌. నటనలో శ్రీదేవి నాకు స్ఫూర్తి.

* పుస్తకాలు బాగా చదువుతా. ‘వెన్‌ బ్రీత్‌ బికమ్స్‌ ఎయిర్‌’ నా ఫేవరెట్‌ బుక్‌.

* పప్పన్నం, పిజ్జా, బంగాళాదుంప వంటకాలూ బాగా ఇష్టం.

* చీకటంటే భయం. అందుకే రాత్రివేళ కూడా నా రూమ్‌లో లైట్లు ఆర్పను. కిటికీ తలుపులు మూయను.

* ఎప్పటికైనా ప్రయివేట్‌ జెట్‌ కొనుక్కోవాలి, కొండ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలి. చనిపోయేలోపు ప్రపంచమంతా చుట్టేయాలి.Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని