ఫ్యాషన్‌ మేళా!

తీరైన చీరకట్టులో ఓ అందం ఉంది... సౌకర్యం ఉంటుంది. అన్నింటినీ మించి ఆరుగజాల చీరని ఎన్ని రకాలుగా అయినా కట్టుకోవచ్చు. అందుకే దాన్ని ప్రాంతానికో రీతిలో కడుతుంటారు. ఇప్పుడదే

Published : 17 Apr 2022 00:31 IST

ఫ్యాషన్‌ మేళా!

తీరైన చీరకట్టులో ఓ అందం ఉంది... సౌకర్యం ఉంటుంది. అన్నింటినీ మించి ఆరుగజాల చీరని ఎన్ని రకాలుగా అయినా కట్టుకోవచ్చు. అందుకే దాన్ని ప్రాంతానికో రీతిలో కడుతుంటారు. ఇప్పుడదే చీరతో డిజైనర్లు కొత్త ఫ్యాషన్లెన్నో సృష్టించేస్తున్నారు. ఆడవాళ్లతోపాటు అబ్బాయిలతోనూ దాన్ని అందంగా కట్టించేస్తున్నారు. అలా పుట్టుకొచ్చినవే... ఈ సరికొత్త శారీ ట్రెండ్స్‌..!

మగవాళ్లకో చీరపంచె..!

పెళ్లి షాపింగ్‌లో ఈమధ్య అబ్బాయిలు సైతం అమ్మాయిలకు తక్కువ కాదు అన్నట్లుగా డ్రెస్సులూ నగలూ కొంటున్నారు. అందుకే వాళ్లు వేసుకునే షేర్వాణీ డిజైన్లలో వందలకొద్దీ వెరైటీలు వస్తున్నాయి. తాజాగా ధోతీ లేదా పంచెల్ని సైతం రంగురంగుల్లో అచ్చం చీరల్లా డిజైన్‌ చేస్తున్నారు. అవునండీ... పట్టు పంచెలన్నీ ఒకప్పుడు లేతరంగుల్లో చిన్నపాటి అంచులతోనూ ఉండేవి. ఇప్పుడు కంచి, పైథానీ, గద్వాల చీరల్లోలా భారీ అంచులతో చీరపంచెల్నీ డిజైన్‌ చేస్తున్నారు. ఈ పంచెల్లో- కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా రెడీమేడ్‌గా కుట్టినవీ వస్తున్నాయి. పైగా ‘అమ్మాయిలు చీరల్ని పంచెల్లా కుట్టించుకోగా లేనిది... మేం వాళ్ల చీరల్ని పంచెల్లా కట్టుకుంటే తప్పేంటీ’ అంటూ వాటిని మగమహారాజులు ఇష్టంగా కట్టేస్తున్నారట.


శారీప్యాంట్‌ తొడిగేస్తున్నారు!

అమ్మాయిలకు డ్రెస్సుల్లో ఎన్ని కొత్త ఫ్యాషన్‌లు వచ్చినా సంతృప్తి ఉండదు. అందుకే సంప్రదాయబద్ధమైన చీరకట్టు కూడా స్టైలిష్‌గా ఉండాలని అనుకుంటున్నారు. దాంతో చీరతో ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో అన్నీ చేస్తున్నారు డిజైనర్లు. చీరని చీరలా ఉండనీయకుండా ఆమధ్య ధోతీ చీర అంటూ ఓ సరికొత్త డిజైన్‌ రూపొందించారు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ తారలంతా ఆ కట్టులో మెరిసి మురిశారు. కొన్నాళ్లకు అదీ బోరే కదా... దాంతో ఈసారి ప్యాంట్‌మీద చీర కడితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చినట్లుందో డిజైనర్‌కి. ఫలితం... యాంక్‌ల్‌ లెన్త్‌ ప్యాంట్‌ వేసుకుని దానిమీద నిండుగా ఓణీ వేసినట్లుగా ఉండే రెడీమేడ్‌ సెట్లు మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిల్లోనే మళ్లీ షరారా, సల్వార్‌, చుడీ... ఇలా రకరకాల ప్యాంట్‌ డిజైన్లతో కుట్టిన చీరలు విభిన్న బ్లౌజ్‌ డిజైన్లతో వస్తున్నాయి. మొత్తమ్మీద ఫ్యూజన్‌ ఫుడ్స్‌లో మాదిరిగా ప్యాంట్‌చీరల్నీ వెరైటీ డ్రెస్సుల్లా వేసుకుని పెళ్లిళ్లకు హాజరయిపోతున్నారు నేటి అమ్మాయిలు.


పట్టుచీరతో లాంగ్‌ఫ్రాక్‌!

అనార్కలీ తరవాత అమ్మాయిల మనసు  దోచుకుంది ఏదయినా ఉందీ అంటే, అది లాంగ్‌ ఫ్రాక్‌ అనే చెప్పాలి. లంగా ఓణీ, శారీ, షరారా ప్యాంట్స్‌...ఏవయినాగానీ ఒకటి రెండు ఫంక్షన్స్‌కి అయితే ఓకే. కానీ ఎప్పుడూ అవే వేసుకోవాలంటే ఇబ్బందే. కానీ తమ పెళ్లికో లేదా అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లకోసమో కొనుక్కున్న పట్టుచీరలన్నీ ఏం కావాలి... ఏళ్ల తరబడి బీరువాలో అలా ముడుచుకుని ఉండాల్సిందేనా అనిపించినట్లుంది నేటి డిజైనర్లకి. వెంటనే ఓ పట్టుచీరతో లాంగ్‌ ఫ్రాక్‌కి డిజైన్‌ చేసేశారు. అదీగాక పట్టుచీర కట్టుకోవడం అంటే యమా కష్టం అని ఫీలయ్యేవాళ్ల కోసం డిజైనర్లే నేరుగా పట్టుగౌన్లూ కుట్టేస్తున్నారు. దాంతో క్రేప్‌, జార్జెట్‌, నైలాన్‌, నెట్‌, టస్సర్‌... ఇలా రకరకాల క్లాత్‌లతో వచ్చే లాంగ్‌ ఫ్రాక్స్‌ ఇప్పుడు పట్టుతోనూ వచ్చేస్తున్నాయి. సో, ఇకపైన- ‘వేలకు వేలు పోసి కొన్న చీరలన్నీ వేస్టేనా’ అని అమ్మలూ అమ్మాయిలూ బాధపడకుండా రెండుమూడుసార్లు కట్టేశాక ఫ్రాక్స్‌లా కుట్టించుకోవచ్చన్నమాట..!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..