ఏ ప్లేటులో తింటున్నారు?

ఎలాంటి ఆహారమైనా కనువిందుగా ఉంటే, ఎవరికైనా వెంటనే తినాలనిపిస్తుంది. అయితే ఏ వంటకాన్ని ఎందులో పెట్టినా తినేవాళ్లు కొందరుంటే, ఏదీ రుచించక చూసుకుని చూసుకుని తినేవాళ్లు మరికొందరుంటారు.

Updated : 10 Dec 2022 23:10 IST

ఏ ప్లేటులో తింటున్నారు?

ఎలాంటి ఆహారమైనా కనువిందుగా ఉంటే, ఎవరికైనా వెంటనే తినాలనిపిస్తుంది. అయితే ఏ వంటకాన్ని ఎందులో పెట్టినా తినేవాళ్లు కొందరుంటే, ఏదీ రుచించక చూసుకుని చూసుకుని తినేవాళ్లు మరికొందరుంటారు. అలాంటివాళ్లకు వడ్డించే ప్లేట్లూ గిన్నెలూ కూడా వాళ్లు తినే తిండిని ప్రభావితం చేస్తాయి అంటున్నారు పోర్ట్స్‌మౌత్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఎందుకంటే- ఏవో కొన్ని రకాలు మాత్రమే తినేవాళ్లకు పోషకాలన్నీ అందక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. దానికితోడు వీళ్లు నలుగురిలో కూర్చున్నప్పుడు అన్నిరకాల ఆహారపదార్థాలనూ తినలేకపోవడంవల్ల ఒత్తిడికి గురవుతుంటారు. ఇక, వాళ్లకు వడ్డించే ప్లేటు కూడా సరైనది కాకపోతే అసలేమీ తినలేరు అన్నది నిపుణుల పరిశీలన. ఇందుకోసం తిండి విషయంలో పట్టింపులు ఉన్నవాళ్లను ఎంపికచేసి, ఒకే రకమైన స్నాక్స్‌ను వేర్వేరు రంగుల ప్లేటుల్లో పెట్టి తినమన్నారట. తెలుపురంగుతో పోలిస్తే ఎరుపు, నీలం రంగు ప్లేటుల్లోవి తిన్నప్పుడు అవి ఉప్పగా ఉన్నట్లు ఫీలయ్యారట. పైగా రంగుల గిన్నెల్లో పెట్టడంవల్ల వాటిని అస్సలు తినాలనిపించలేదనీ చెప్పారట. అదే అన్ని రకాలూ తినేవాళ్లమీద రంగు ఎలాంటి ప్రభావాన్నీ చూపించలేదు. అందుకే ఆహారపదార్థాలు ఏవైనాగానీ తెల్లని పింగాణీ ప్లేటులో వడ్డిస్తే, రంగు ప్రభావం ఉండదు కాబట్టి కాస్తయినా ఇష్టంగా తింటారని చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..