అష్టలక్ష్మీ... నమో నమః

విశాలమైన ప్రాంగణంలో అష్టలక్ష్ములూ కొలువుదీరి కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న క్షేత్రమే హైదరాబాద్‌లోని అష్టలక్ష్మి దేవాలయం. నిత్య పూజలూ... ప్రత్యేక ఉత్సవాలతో ఏడాది మొత్తం కళకళలాడే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలూ కలుగుతాయని ప్రతీతి.

Published : 23 Oct 2022 00:03 IST

అష్టలక్ష్మీ... నమో నమః

విశాలమైన ప్రాంగణంలో అష్టలక్ష్ములూ కొలువుదీరి కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న క్షేత్రమే హైదరాబాద్‌లోని అష్టలక్ష్మి దేవాలయం. నిత్య పూజలూ... ప్రత్యేక ఉత్సవాలతో ఏడాది మొత్తం కళకళలాడే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలూ కలుగుతాయని ప్రతీతి.

శ్రీమన్నారాయణుడు ఆదిలక్ష్మి సమేతంగా మూలవిరాట్టుగా కొలువుదీరితే ఆ విగ్రహమూర్తుల చుట్టూ సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, మహాలక్ష్మి ఆశీనులై దర్శనమిచ్చే క్షేత్రమే అష్టలక్ష్మి దేవాలయం. హైదరాబాద్‌, కొత్తపేటలో ఉండే ఈ ఆలయాన్ని ఆ కాలనీ వాసులే నిర్మించుకోవడం విశేషం.  

ఇలా నిర్మాణం

కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఉన్న ముప్ఫై ఎకరాలను వాసవీ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ అమ్మడంతో మూడువందలకు పైగా కుటుంబాలు ఇక్కడ సొంత ఇళ్లు నిర్మించుకున్నాయి. క్రమంగా ఈ ప్రాంతం వాసవీ కాలనీగా మారింది. ఆ ఇళ్ల మధ్యలో ఖాళీగా ఉన్న కొండభాగాన్ని వదిలేయకుండా అక్కడ ఏదో ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్న కాలనీ వాసులు ప్రముఖ శిల్పి గణపతి స్తపతి సలహాతో... అష్టలక్ష్మి దేవాలయాన్ని కట్టించాలనుకున్నారు. చివరకు కంచికామ కోటి పీఠాధిపతులైన జయేంద్ర సరస్వతీ, విజయేంద్ర సరస్వతులు శంకుస్థాపన చేయడమే కాకుండా... వాళ్ల సలహాలూ సూచనలతో నిర్మాణం మొదలైందనీ ఇరవై ఆరేళ్లక్రితం ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగిందనీ చెబుతారు ఆలయ నిర్వాహకులు. రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ మందిరంలో మొదటి అంతస్తులో అష్టలక్ష్ములను  దర్శించుకోవచ్చు. ఈ ప్రాంగణంలోనే నిత్య ప్రవచన మండపం, యాగశాల, చక్రతీర్థం, రథశాల, భోజనశాల... ఇలా అన్నీ ఉంటాయి. ఇవి కాకుండా సనాతన ధర్మాన్ని బోధించేందుకు శారదా శిశు విద్యాలయం పేరుతో ప్రత్యేక పాఠశాలనూ నిర్వహిస్తోందీ ఆలయం.  

గోమాత దర్శనం తరవాతే...

ఈ ఆలయంలో శ్రీమన్నారాయణుడూ అష్టలక్ష్ములూ కాకుండా... అభయ గణపతి, కృష్ణుడు, గోదాదేవి, గరుడస్వామి, సుదర్శన లక్ష్మీనరసింహస్వామి.... తదితర విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నడిచే ఈ ఆలయాన్ని సందర్శిస్తే కీర్తి, జ్ఞానం, ఐశ్వర్యం, ధైర్యం, ఆనందం... వంటివన్నీ పొందవచ్చని భక్తుల నమ్మకం. ఇక్కడ రోజువారీ పూజా కార్యక్రమాలూ, రెండుపూటలా నిత్యహోమాలూ జరుగుతాయి. ఇవి కాకుండా వైశాఖమాసంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణంలో పవిత్రోత్సవాలు, వరలక్ష్మి వ్రతాలు... దీపావళి నాడు అష్టలక్ష్ములకు విశేష పూజలు... కార్తికంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ఆకాశ దీపోత్సవం... ధనుర్మాసంలో గోదారంగనాథస్వామి కల్యాణం... ఇలా ఏడాది మొత్తం జరిగే విశేష పూజల్లో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు... తదితర ప్రాంతాల నుంచీ భక్తులు వస్తారు. ఇక్కడున్న మరో విశేషం ఏంటంటే... ప్రతిరోజూ ఆలయంలో పూజా కార్యక్రమాలను చేశాక అర్చకులు గోమాతనూ పూజిస్తారు. తరవాత ఆ గోమాతను ఆలయ ప్రాంగణం చుట్టూ తిప్పాకే... భక్తులను అనుమతిస్తారు.  

ఎలా చేరుకోవచ్చు

అష్టలక్ష్మిదేవాలయం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు దగ్గర్లో కొత్తపేటలో ఉంటుంది. కొత్తపేట వరకూ వచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులూ ఆటోలూ అందుబాటులో ఉంటాయి.


ఇది విన్నారా...
గుస్సాడి... ఆదివాసీల శివతాండవం  

దివాసీలు నిర్వహించే వేడుకలు కాస్త వింతగానే ఉంటాయి.  ఈ దండారీ వేడుక కూడా అలాంటిదే. దీపావళి వరకూ సాగే ఆ వేడుకలో ఆదివాసీలు చేసే నృత్యవిన్యాసాలను తిలకించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిసర గ్రామాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తాయి. తలపైన నెమలిపింఛాలతో చేసిన కిరీటాలు, ఒంటినిండా విబూది, నడుముకు గంటలు చుట్టుకుని... దుడ్డుకర్ర చేతబూని ఆ ఆదివాసీలు చేసే గుస్సాడి నృత్యం చూస్తే పరమశివుడే స్వయంగా నర్తిస్తున్నాడా అన్నట్లుగా ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలు ప్రదర్శించే గుస్సాడి నృత్యం దసరా పండుగ నుంచి దీపావళి తరువాత వచ్చే నెలవంక వరకు సాగుతుంది. ఏడాది మొత్తం వివిధ ప్రాంతాల్లో తిరిగే ఆదివాసీలు ఈ సమయంలో మాత్రమే ఒకచోటకు చేరి... ఇప్పచెట్టునే దైవంగా భావించి ఏత్మాసూర్‌ దేవతను పూజిస్తూ చేసే నృత్యమే గుస్సాడి. ఆదివాసీలు ఎంతో పరవశంతో నర్తించే ఈ దండారి వేడుకలోనే అంతా కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం, పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం.. వంటివన్నీ జరుగుతాయి. దీపావళి పండుగ అనంతరం నెలవంక రాకతో దండారి ఉత్సవానికి స్వస్తి పలుకుతారు.

- ఎం.మణికేశ్వర్‌, ఈనాడు-ఈటీవీ, ఆదిలాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..