Updated : 05 Feb 2023 04:38 IST

అమ్మవారి తరువాతే...అయ్యవారి దర్శనం!

ఏ ఆలయంలో అయినా... మొదట స్వామిని దర్శించుకున్నాకే దేవేరిని చూస్తారు భక్తులు. కానీ ఈ శివాలయంలో మాత్రం అమ్మవారిని పూజించాకే స్వామిని చూడాలంటారు. పరమశివుడు గణపేశ్వరుడిగా, దేవి దుర్గమ్మగా దర్శనమిస్తోన్న ఈ గణపేశ్వర ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది.

ముద్రతీరాన... ప్రశాంతమైన వాతావరణంలో కాకతీయుల శైలిలో నిర్మించిన గణపేశ్వర ఆలయం... కృష్ణా జిల్లా అవనిగడ్డలోని నాగాయలంక మండలంలో గణపేశ్వరం గ్రామంలో ఉంటుంది. ఇక్కడ శివుడు గణపేశ్వరుడిగా పూజలు అందుకుంటుంటే దేవి కనకదుర్గగా దర్శనమిస్తోంది.  

స్థలపురాణం

స్కంద పురాణం ప్రకారం... కాకతీయులు దివిసీమకు వచ్చినప్పుడు అయ్య వంశీయుడైన పినచోడదేవుడు ఈ ప్రాంతాన్ని పాలించేవాడట. యుద్ధంలో ఈ ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తి గణపతిరుద్రుడు కైవసం చేసుకోవడంతో పినచోడదేవుడు తన ఇద్దరు కుమార్తెలైన నారమ్మ, పేరమ్మలను ఆయనకిచ్చి పెళ్లి చేశాడట. ఆ తరువాత గణపతిరుద్రుడు ఓరుగల్లుకు వెళ్తూ తన బావమరిది జాయపనూ తీసుకెళ్లాడట. అక్కడ జాయప ప్రతిభాపాటవాల్ని గుర్తించిన గణపతి రుద్రుడు అతడిని ఏనుగులకు సేనాధిపతిగా నియమించాడు. దాంతో తన బావ గణపతి రుద్రుడి పేరుప్రఖ్యాతుల్ని స్వస్థలంలోనూ ఇనుమడింపజేసేందుకు ఇక్కడ గణపేశ్వరం అనే గ్రామాన్ని ఏర్పాటు చేసి కాకతీయశైలిలో ఆలయాన్ని నిర్మించి శివుడిని ప్రతిష్ఠించాడని కథనం. ఈ ఆలయాన్ని కట్టిన కొన్నాళ్లకు దుర్గమ్మ జాయపసేనుడికి కలలో కనిపించి తలగడదీవి చెరువులో తన విగ్రహం ఉందనీ దాన్ని బయటకు తీసి స్వామికి కుడి వైపున ప్రతిష్ఠించమనీ చెప్పిందట. దాంతో జాయపసేనుడు అమ్మవారి విగ్రహాన్ని వెలికితీసి ఇక్కడ ప్రత్యేకంగా సింహద్వారాన్ని నిర్మించి పదిచేతులున్న దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడనీ   అనంతరం ఆలయానికి దక్షిణాన కనకదుర్గ ఆలయాన్ని కట్టించాడనీ అంటారు. ఈ అమ్మవారి విగ్రహం విజయవాడ కనకదుర్గను పోలినట్లుగా ఉంటుంది. 1977లో సంభవించిన దివిసీమ ఉప్పెన సమయంలో ఎంతోమంది ఈ ఆలయంలో తలదాచుకున్నారనీ.. ఇక్కడున్న శివుడూ అమ్మవారే వాళ్లని కాపాడారనీ చెబుతారు.    

శక్తిస్వరూపిణికీ నవరాత్రులు

సాధారణంగా అన్ని ఆలయాల్లో అమ్మవారు స్వామికి ఎడమ వైపున ఉంటే... ఇక్కడ మాత్రం కుడివైపున కనిపిస్తుంది. అందుకే భక్తులు మొదట అమ్మవారిని దర్శించుకున్నాకే శివుడిని పూజిస్తారు. ఈ ఆలయంలో కాశీవిశ్వేశ్వర లింగంతోపాటు నవగ్రహాలూ వినాయకుడూ కాలభైరవుడి విగ్రహాలనూ దర్శించుకోవచ్చు. చైత్రమాసంలో స్వామి కల్యాణం, దేవీశరన్నవరాత్రులు, కార్తికంలో నెల రోజులపాటు నిర్వహించే ప్రత్యేక పూజల్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడకు వస్తారు.  

ఎలా చేరుకోవచ్చు

విజయవాడ నుంచి కరకట్ట రహదారి మీదుగా అవనిగడ్డకు చేరుకుని నాగాయలంకకు వెళ్లాలి. అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకునేందుకు బస్సులూ, ఆటోలూ ఉంటాయి. లేదంటే విజయవాడ నుంచి పామర్రు, గుడివాడ, మచిలీపట్నం మీదుగా కూడా చేరుకోవచ్చు. గుంటూరు నుంచి వచ్చే వారు రేపల్లెకు చేరుకుని అక్కడినుంచి ఆలయానికి వెళ్లాలి. 

ముత్తా నారాయణరావు, ఈనాడు, అమరావతి

చిత్రాలు: పేర్ల వేణు, న్యూస్‌టుడే, నాగాయలంక


ఎందుకు ఎలా?
ఇదీ నంది కథ

శివాలయంలో గర్భగుడికి ముందు నందివిగ్రహం ఉండటం తెలిసిందే. నంది అలా స్వామికి ఎదురుగా కొలువుదీరడం వెనక ఓ కథే ఉంది తెలుసా... పురాణాల ప్రకారం శిలదా అనే రుషికి సంతానం లేకపోవడంతో తపస్సు చేశాడట. కొన్నాళ్లకు పరమేశ్వరుడు అనుగ్రహించడంతో ఆ రుషికి కుమారుడు కలిగాడట. రుషి ఆ పిల్లాడికి నంది అని పేరు పెట్టుకున్నాడు. చిన్నతనంలోనే సకల కళల్లో ప్రావీణ్యం సాధించిన నందిని చూసి తండ్రి మురిసిపోయేవాడు. ఓ సారి వరుణ, మిత్ర దేవతలు శిలదా ఇంటికి ఆతిథ్యానికి వచ్చినప్పుడు ఆ పిల్లాడికి ఆయుర్దాయం లేదని చెప్పారట. శిలదా ఇదే విషయాన్ని కుమారుడికి చెప్పడంతో తండ్రి బాధను చూడలేక నంది శివుడికోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు.

ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైనప్పుడు... స్వామి స్వరూపాన్ని చూసి తన్మయుడైన నంది... తనకు ఆయుష్షు ఇవ్వమని కాకుండా ఎల్లప్పుడూ పరమేశ్వరుడితోనే ఉండేలా వరం ఇవ్వమంటూ వేడుకున్నాడట. అలా శివుడు తన దగ్గరున్న ఎద్దు రూపాన్ని అతడికి ఇచ్చి తనతోనే అనుక్షణం ఉండమంటూ దీవించాడట. అప్పటినుంచీ స్వామికి ఎదురుగా నందివిగ్రహమూ ఉంటోందని పురాణ కథ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..