రోగాలను పోగొట్టే. శ్రీకంఠేశ్వరుడు!

దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో గరళకంఠుడు శ్రీకంఠేశ్వరుడిగా కొలువై... భక్తుల అనారోగ్యాలను దూరం చేసే ధన్వంతరిగానూ పూజలు అందుకుంటున్నాడు.ఈ ఆలయంలో స్వామికి రోజూ ఆయుర్వేద మందును నివేదించడమే కాదు... అన్నంతోనూ అభిషేకించడం విశేషం.

Published : 29 Oct 2022 23:24 IST

రోగాలను పోగొట్టే. శ్రీకంఠేశ్వరుడు!

దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో గరళకంఠుడు శ్రీకంఠేశ్వరుడిగా కొలువై... భక్తుల అనారోగ్యాలను దూరం చేసే ధన్వంతరిగానూ పూజలు అందుకుంటున్నాడు.ఈ ఆలయంలో స్వామికి రోజూ ఆయుర్వేద మందును నివేదించడమే కాదు... అన్నంతోనూ అభిషేకించడం విశేషం.

అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడిని అన్నంతోనూ అభిషేకించడం శివాలయాల్లో చూస్తూంటాం. కానీ ఇక్కడ మాత్రం స్వామిని రోజూ అన్నంతో అభిషేకిస్తారు. అలాగే ప్రత్యేకంగా తయారుచేసిన ఆయుర్వేద మందునూ ప్రసాదంగా నివేదిస్తారు. దక్షిణ కాశీగా గుర్తింపు పొంది... భక్తుల చేత శ్రీకంఠేశ్వరుడిగా, నంజుండేశ్వరుడిగా శివుడు పూజలు అందుకుంటున్న ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రం మైసూర్‌ జిల్లాలోని నంజనగూడులో ఉంటుంది.

స్థలపురాణం

నంజు అంటే విషం అనీ, నంజుండేశ్వర అంటే విషం స్వీకరించిన స్వామి అనీ అర్థం. పురాణాల ప్రకారం అమృతం కోసం సాగర మథనం చేస్తున్న సమయంలో
వచ్చిన గరళాన్ని స్వీకరించిన పరమేశ్వరుడు ఇక్కడ శ్రీకంఠేశ్వరుడిగా వెలిశాడని అంటారు. మరో కథ ప్రకారం ఒళ్లంతా విషాన్ని నింపుకొన్న కేసియా అనే అసురుడు దేవతల్ని ఇబ్బందిపెట్టడంతో అంతా కలిసి పరమేశ్వరుడికి విన్నవించుకున్నారట. అప్పుడు శివుడు వాళ్ళకి ఈ ప్రాంతంలో యాగం చేసి ఆ అసురుడిని అంతమొందించమని సూచించాడట.  స్వామి చెప్పినట్లుగానే దేవతలు ఆ అసురుడిని ఆహ్వానించి అగ్నిలోకి నెట్టేశారట. అప్పుడు శివుడు అగ్నిరూపంలోనే వచ్చి రాక్షసుడిని సంహరించాడట. ఆ తర్వాత, శివుడు ఇక్కడ లింగం రూపంలో వెలిశాడనీ..  అప్పటినుంచీ స్వామిని నంజుండేశ్వరుడిగా పిలుస్తున్నారనీ ప్రతీతి. కొంతకాలానికిఆ లింగం మాయమయ్యిందట. అది జరిగిన కొన్నాళ్లకు తల్లిని వధించిన పరశురాముడు ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేస్తున్న సమయంలో అతనికి నెత్తురోడుతున్న శివలింగం కనిపించిందట. దాంతో పరశురాముడు స్వామి అనుగ్రహంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాడని అంటారు.

స్వామికి ప్రత్యేక ప్రసాదం

ఇక్కడ శివలింగానికి రోజూ అన్నంతో అభిషేకించడం వల్ల స్వామిపైన ఉన్న విష ప్రభావం కొంతైనా తగ్గుతుందని అంటారు. అదేవిధంగా వెన్న, శొంఠి, చక్కెరతో చేసిన సుగంధిత సక్కరై అనే ప్రసాదాన్నీ నివేదిస్తారు. భక్తుల అనారోగ్యాలనూ దూరం చేసే ఈ స్వామికి ఏడాదికి రెండుసార్లు ప్రత్యేక జాతర్లను నిర్వహిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..