అమ్మవారి పూలమాలను స్వామివారికి వేస్తారిక్కడ!

సాధారణంగా ఏ ఆలయంలో అయినా... అమ్మవారికీ, స్వామి వారికీ విడివిడిగా పూలమాలల్ని వేస్తారు. కానీ... శ్రీవిల్లీపుత్తూర్‌లోని ఆండాళ్‌ ఆలయంలో మాత్రం.. అమ్మవారికి వేసిన దండల్నే స్వామివారికి అలంకరిస్తారు. గోదాదేవి ఇక్కడే జన్మించిందని అంటారు. 108 వైష్ణవాలయాల్లో ఇదీ ఒకటి.

Updated : 18 Dec 2022 03:50 IST

అమ్మవారి పూలమాలను స్వామివారికి వేస్తారిక్కడ!

సాధారణంగా ఏ ఆలయంలో అయినా... అమ్మవారికీ, స్వామి వారికీ విడివిడిగా పూలమాలల్ని వేస్తారు. కానీ... శ్రీవిల్లీపుత్తూర్‌లోని ఆండాళ్‌ ఆలయంలో మాత్రం.. అమ్మవారికి వేసిన దండల్నే స్వామివారికి అలంకరిస్తారు. గోదాదేవి ఇక్కడే జన్మించిందని అంటారు. 108 వైష్ణవాలయాల్లో ఇదీ ఒకటి.

ఆకట్టుకునే శిల్పకళా సంపద...  ఎత్తైన రాజగోపురం... గోదాదేవి దాల్చిన పూలమాలనే స్వామికి అలంకరించడం... ఈ విశేషాలన్నీ శ్రీవిల్లీపుత్తూర్‌ ఆండాళ్‌ ఆలయంలో కనిపిస్తాయి. ఈ ఆలయం తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా మంగాపురంలో ఉంటుంది. ఇక్కడ ఓ వైపు ఆండాళ్‌ రంగనాథసమేతంగా దర్శనమిస్తుంటే.. మరోవైపు వటపత్రశాయి శ్రీదేవీ- భూదేవితో కొలువుదీరడం విశేషం.  

స్థలపురాణం

ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం దట్టమైన అడవిగా ఉండేదట. ఇక్కడ  భృగు, మార్కండేయ మహర్షులు తపస్సు చేస్తుండేవారు. అది తెలిసి కాలనేమి అనే రాక్షసుడు వాళ్ల తపస్సుకు భంగం కలిగించడంతో ఆ రుషులు విష్ణుమూర్తిని ప్రార్థించారు. దాంతో స్వామి ఆ అసురుడిని అంతమొందించి ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేతంగా ఇక్కడున్న మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడట. అలా స్వామికి వటపత్రశాయి అనే పేరు వచ్చిందట. ఇది జరిగిన కొన్నాళ్లకు ఈ ప్రాంతాన్ని మల్లి అనే రాణి పాలించింది. ఆమెకు విల్లి, పుట్టన్‌ అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. వీళ్లిద్దరూ ఓసారి వేటాడేందుకు అడవికి వెళ్లినప్పుడు పుట్టన్‌ పులితో పోరాడుతూ చనిపోయాడు. దాంతో విల్లి బాధపడుతూ తన సోదరుడి శవం పక్కనే సొమ్మసిల్లిపోయాడు. అప్పుడు అతడికి స్వామి కలలో కనిపించి ఈ అడవిని అందమైన పట్టణంగా మార్చి, ఆలయాన్ని నిర్మించి, మర్రిచెట్టు నీడలో ఉన్న తన విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించమని ఆజ్ఞాపిస్తూనే పుట్టన్‌ని బతికించాడట. ఆ తరువాత ఈ సోదరులిద్దరూ స్వామి చెప్పినట్లుగా చేయడంతో ఈ ప్రాంతానికి శ్రీవిల్లీపుత్తూర్‌ అనే పేరు వచ్చిందని కథనం. ఈ ఆలయంలోని స్వామిని విష్ణుచిత్తుడు(పెరియాళ్వార్‌) అనే భక్తుడు రోజూ పూజించేవాడు. ఓసారి అతడికి ఈ గుడి ప్రాంగణంలోని తులసి కోట దగ్గర పసిపాప దొరికిందట. సంతానంలేని విష్ణుచిత్తుడు ఆ చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి ‘గోదా’ అని పేరుపెట్టుకుని పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఆ పాప పెరిగేకొద్దీ కృష్ణ భక్తురాలిగా మారి అనేక పద్యాలు రాసేదట. అంతేకాదు... విష్ణుచిత్తుడు స్వామికి తీసుకెళ్లే పూలమాలల్ని గోదాదేవి మొదట ధరించేది. విష్ణుచిత్తుడికి ఈ విషయం తెలిసి కోపంతో ఆలయానికి వెళ్లడమే మానేశాడట. అయితే అతడికి స్వామి కలలో కనిపించి... గోదా వేసుకున్న మాలనే తనకు వేయమని కోరాడట. ఆమె పెద్దయ్యాక ఆండాళ్‌గా మారి... పాశురాలను రచించడమేకాక విష్ణుమూర్తినే పెళ్లాడతానని పట్టుబట్టిందట. ఆమె కోరిక మేరకు శ్రీరంగంలోని రంగనాథుడు గరుడ వాహనంపైన రాజు రూపంలో ఇక్కడకు వచ్చి ఆండాళ్‌ను వివాహం చేసుకున్నాడనీ తరువాత ఆమె స్వామిలో ఐక్యమైందనీ కథనం. అలా గోదాదేవి ఇక్కడ రంగమన్నార్‌ సమేతంగా కొలువయ్యిందని అంటారు.  

ఏడాది మొత్తం పాశురాలే

ఎందరో రాజులు అభివృద్ధి చేసిన ఈ ఆలయంలోని రాజగోపురాన్ని స్వయంగా విష్ణుచిత్తుడే నిర్మించినట్లుగా చెబుతారు. ఇక్కడ అమ్మవారి మెడలో వేసిన పూలమాలల్నే తీసుకెళ్లి ప్రతిరోజూ వటపత్రశాయికి అలంకరిస్తారు. ఆ మాలల్నే మదురై అళగర్‌కోయిల్‌లోని స్వామికీ, తిరుమల వేంకటేశ్వరుడికీ ఉత్సవాల సమయంలో అలంకరిస్తారు. ఆండాళ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆడిపూరమ్‌ పేరుతో పదిరోజులపాటు ఉత్సవాలను నిర్వహించి ఆఖరిరోజున గోదాదేవి- రంగనాథస్వామి కల్యాణాన్ని జరిపిస్తారు.  

ఎలా చేరుకోవచ్చు

శ్రీవిల్లీపుత్తూర్‌ ఆలయం మదురైకి 80 కి.మీ. దూరంలో ఉంటుంది. విమానంలో రావాలనుకునేవారు మదురై విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. రైల్లో వచ్చేవారు శ్రీవిల్లీపుత్తూరు రైల్వేస్టేషన్‌లోనే దిగొచ్చు. రోడ్డు మార్గంలో వచ్చేవారికి వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..