సిసింద్రీ

అనగనగా ఓ పల్లెటూరు. ఆ ఊళ్లో ఓ కప్పల గుంపు ఉండేది. వాటిలో జిహ్విక అనే కప్ప ఆకలి వేసినా, వేయకున్నా కనిపించిన ప్రతి పురుగునూ తినేది. బద్ధకంగానూ ఉండేది. దీంతో మిగతా కప్పలన్నీ దానికి తిండిపోతు, సోమరిపోతు అని పేర్లు పెట్టాయి. ఓసారి ఆ కప్పల గుంపంతా కలిసి వనభోజనాలకని దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లాయి. 

Updated : 08 Jan 2022 23:05 IST

సిసింద్రీ


కప్ప అత్యాశ!

నగనగా ఓ పల్లెటూరు. ఆ ఊళ్లో ఓ కప్పల గుంపు ఉండేది. వాటిలో జిహ్విక అనే కప్ప ఆకలి వేసినా, వేయకున్నా కనిపించిన ప్రతి పురుగునూ తినేది. బద్ధకంగానూ ఉండేది. దీంతో మిగతా కప్పలన్నీ దానికి తిండిపోతు, సోమరిపోతు అని పేర్లు పెట్టాయి. ఓసారి ఆ కప్పల గుంపంతా కలిసి వనభోజనాలకని దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లాయి. అక్కడ మంచి మంచి పురుగులు కనిపించాయి. కప్పలన్నీ తమ ఆకలి తీరేలా తిన్నాయి, తరవాత కాసేపు ఆడుకున్నాయి. కానీ జిహ్విక మాత్రం తన ఆకలి తీరినా... పొట్ట ఉబ్బిపోతున్నా... సాయంత్రం వరకూ తింటూనే ఉంది. చీకటవుతోందని మిగతా కప్పలన్నీ ఊళ్లోకి వెళ్లడానికి బయలుదేరాయి. జిహ్విక మాత్రం ఇంకా తింటూనే ఉంది.
అప్పటికీ మిగతా కప్పలు జిహ్వికను హెచ్చరించాయి. అయినా అది వాటి మాట వినకుండా.. వాటిని వెళ్లిపోమనీ, తాను తర్వాత వస్తాననీ చెప్పింది. దాంతో మిగిలినవి వెళ్లిపోయాయి. జిహ్విక సమయాన్నే మరిచిపోయింది. దొరికిన పురుగును దొరికినట్లు ఇంకా తింటూనే ఉంది. ఆఖరుకు దాన్ని ఒక పాము చూసింది. మంచిగా కండపట్టి ఉన్న జిహ్వికను చూడగానే దానికి నోరూరింది. తనను పాము గమనిస్తోన్న విషయాన్ని జిహ్విక పసిగట్టింది. వేగంగా గెంతి పారిపోవాలని ప్రయత్నించింది. కానీ కడుపునిండా ఆహారం ఉండటంతో దాని వల్ల కాలేదు. దాంతో అది తేలిగ్గా పాముకు చిక్కి తన ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని చెట్టు మీదున్న పావురం చూసి కప్పలకు సమాచారం చేరవేసింది. తమలో ఒకరిని కోల్పోయినందుకు అవి ముందు బాధపడ్డాయి. తర్వాత నుంచి తిండి విషయంలో అవి నియంత్రణ పాటిస్తున్నాయి. తమకు ఎంత అవసరమో అంతే తింటున్నాయి. తోటి కప్పలు ఏమైనా చెబితే వింటున్నాయి. ఇప్పటికీ కప్పలు తమ పిల్లలకు ‘మీరు మాత్రం దానిలా చేయకండి’ అని జిహ్విక గురించి చెబుతున్నాయి. ఆ కప్పపిల్లలు కూడా బుద్ధిగా తల్లికప్పల మాట వింటున్నాయి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..