సిసింద్రీ

ఒకసారి అక్బర్‌కు వంటవాడు లేలేత వంకాయలతో చక్కగా కూర చేసి పెట్టాడు. దాని రుచి గురించి బీర్బల్‌కు వర్ణించి చెప్పాడు అక్బర్‌. ‘రేపు నువ్వు కూడా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వంకాయ కూర రుచి చూడు’ అని ఆహ్వానించాడు.

Published : 03 Apr 2022 00:52 IST

సిసింద్రీ

వంకాయ చెప్పిన నీతి!

కసారి అక్బర్‌కు వంటవాడు లేలేత వంకాయలతో చక్కగా కూర చేసి పెట్టాడు. దాని రుచి గురించి బీర్బల్‌కు వర్ణించి చెప్పాడు అక్బర్‌. ‘రేపు నువ్వు కూడా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వంకాయ కూర రుచి చూడు’ అని ఆహ్వానించాడు. నిజానికి బీర్బల్‌కు వంకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఆ విషయాన్ని చెబితే... ‘అక్బర్‌కు ఆగ్రహం రావొచ్చు’ అని భయపడ్డాడు. వెంటనే ఓ ఆలోచన తట్టి.. ‘ప్రభూ...! ఈ ప్రపంచంలో వంకాయ కూరే రుచికరమైనది, శ్రేష్టమైనది. అందుకే దేవుడు దాని నెత్తిన కిరీటం పెట్టాడు. అది నిజానికి మీలాంటి చక్రవర్తులే తినదగ్గ ఆహారం. మీ పక్కన కూర్చొని తినే యోగ్యత నాకు లేదు’ అని చెప్పాడు బీర్బల్‌. అక్బర్‌ కూడా ఇక బలవంతం చేయలేదు. కొన్ని రోజుల తర్వాత అక్బర్‌, బీర్బల్‌ను పిలిపించాడు. ‘నా ఒంటి నిండా దురదలు వచ్చాయి. దానికి కారణం నువ్వే’ అన్నాడు కోపంగా. ‘నేనెలా కారణం జహాపనా!’ అని అడిగాడు బీర్బల్‌. ‘వంకాయ.. చక్రవర్తులే తినదగ్గ ఆహారం అని నువ్వు ఆ రోజు చెప్పావు. అందుకే నేను రోజూ ఆ కూరే చేయించుకుని తిన్నాను. వైద్యులేమో దాని వల్లే ఈ దురదలు వచ్చాయంటున్నారు. నీకు శిక్ష పడాల్సిందే’ అన్నాడు అక్బర్‌. ‘జహాపనా...! ఆ వంకాయకు కిరీటం ఉందన్న తలపొగరుతోనే అది తనను అతిగా తిన్నవారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుకే దేవుడు దాని నెత్తి మీద మేకు కూడా కొట్టాడు’ అని దాని కాడ గురించి వివరించాడు బీర్బల్‌. ‘మొన్నేమో మంచిది అన్నావు. ఇప్పుడేమో కాదంటున్నావు’ అని గద్దించాడు అక్బర్‌. ‘యథారాజా... తథా ప్రజా!... మీ మనసెరిగి మసలుకోవడమే మాలాంటి అల్పజీవులకు మంచిది.  మన్నించండి జహాపనా!’  అన్నాడు బీర్బల్‌ వినయంగా. బీర్బల్‌ మాటలకు అక్బర్‌కు జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి ఎవ్వరు తన అభిప్రాయంతో ఏకీభవించకపోయినా.. కోపగించుకోకుండా... వారు చెప్పేది పూర్తిగా విని, అందులో మంచీచెడులను బేరీజు వేసుకోవడం అలవాటు చేసుకున్నాడు.


భలే... భలే... పీచుమిఠాయి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.... మనందరికీ పీచుమిఠాయి అంటే చాలా చాలా ఇష్టం కదూ! తింటే భలే తియ్యగా ఉంటుంది కదా! దాని విశేషాలు కూడా భలేగా ఉంటాయి. చాక్లెట్లూ, తీపి పదార్థాలూ ఎక్కువగా తింటే పళ్లు పాడవుతాయని మనకు డాక్టర్లు చెబుతుంటారు. కానీ విచిత్రంగా కాటన్‌క్యాండీని అదే ఫ్రెండ్స్‌... ఈ పీచుమిఠాయిని ఓ డెంటిస్ట్‌ కనిపెట్టాడు. 1897వ సంవత్సరంలో అమెరికాలోని నాష్విల్‌ నగరంలో డెంటిస్ట్‌ విలియం మోరిసన్‌, జాన్‌ సి.వార్టన్‌ అనే ఇద్దరు కలిసి ఓ యంత్రాన్ని కనిపెట్టారు. ఈ యంత్రంలో చక్కెరను పోస్తే అది దారపు పోగుల్లా బయటకు వచ్చింది. ఈ మిఠాయిని చిన్న చిన్న చెక్కపెట్టెల్లో ప్యాక్‌ చేసి ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ అప్పటికి ఈ మిఠాయికి కాటన్‌క్యాండీ అని పేరు పెట్టలేదు. ఈ కాటన్‌క్యాండీ యంత్రంలో 1921లో జోసెఫ్‌ లాక్సోక్స్‌ మరికొన్ని మార్పులు చేశాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన కూడా ఓ డెంటిస్టే. అప్పటి నుంచి ‘కాటన్‌ క్యాండీ’ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా ఆహార పదార్థాలకన్నా ఈ కాటన్‌క్యాండీనే ఆరోగ్యకరమైనది. ఎందుకంటే కేవలం రంగు చక్కెర, గాలి సాయంతోనే ఈ మిఠాయి తయారవుతుంది మరి. ఈ కాటన్‌క్యాండీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది. కానీ ఒక్కోదేశంలో దీన్ని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఫ్రాన్స్‌లో ‘డాడీస్‌ బియర్డ్‌’, ఆస్ట్రేలియాలో ‘ఫెయిరా ఫ్లోస్స్‌’, చైనాలో ‘డ్రాగన్స్‌ బియర్డ్‌’, నెదర్లాండ్స్‌లో ‘షుగర్‌ స్పైడర్‌’ అనీ పిలుస్తారు. డిసెంబర్‌ 7న అమెరికాలో ఏకంగా ‘నేషనల్‌ కాటన్‌ క్యాండీ డే’గా జరుపుకుంటారు. ఫ్రెండ్స్‌.... మొత్తానికి ఇవీ పీచుమిఠాయి విశేషాలు.


అవును... ఎంత అన్యాయం?

టీచర్‌: పిల్లలూ నేను పాఠం చెప్పడం పూర్తైంది. రేపటి నుంచే ఎగ్జామ్స్‌. మీకేమైనా సందేహాలుంటే అడగండి.
పింకి: టీచర్‌... టీచర్‌... నాకో డౌట్‌.
టీచర్‌: ఏంటో... అడుగు పింకీ...
పింకి: ఏం లేదు టీచర్‌. మీరిచ్చే క్వశ్చన్‌ పేపర్లో క్వశ్చన్లు ఉంటాయి... కానీ ఆన్సర్‌ పేపర్లో మాత్రం ఆన్సర్లు ఉండవు ఎందుకు?
టీచర్‌: ఆఁ!!



జవాబులు

గప్‌చుప్‌: 1. ఆరుగురు 2. బుక్‌ ర్యాక్‌ మీద అంకెల వరస క్రమం సరిగా లేదు  3. Popcorn, Pens, Pad, Parrot  4. టేబుల్‌ పైన 'M',  పాప చొక్కా మీద 'S',  తలుపు పైన 'K', 'E'  5. గ్యాస్‌ సిలిండర్‌.

పోలికలేంటి?: అడ్డం: నీళ్ల సీసా, టేబుల్‌ ల్యాంప్‌, స్కూల్‌ బ్యాగ్‌; నిలువు: పూల కుండీ, గొడుగు, మాస్కు; ఐమూలగా: చొక్కాపైన డిజైన్‌, క్రికెట్‌ బ్యాట్‌.

ఒకేలా ఉన్నవి ఏవి?: 1, 6

కనిపెట్టగలరా?: JEWEL, WAFER, RELAX, FEVER.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..