Updated : 06 Nov 2022 05:16 IST

సిసింద్రీ

భలే భలే మ్యాప్‌!

హాయ్‌ నేస్తాలూ... మీ దగ్గర ఇండియా మ్యాప్‌ ఉందా... ఉన్నా... ఇలాంటి మ్యాప్‌ ఉండి ఉండదు. ఇది యాక్టివిటీని పెంచే మ్యాప్‌. ఈ మ్యాప్‌లో రాష్ట్రాలు ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా వాటి రాజధానులు గుర్తించడమే. దాని కోసమూ ఓ ఏర్పాటు ఉంది నేస్తాలూ. ఈ మ్యాప్‌తో పాటే సైన్‌బోర్డుల్లా రాజధానుల పేర్లు వస్తాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని రాష్ట్రాలతో జతపరచడమే. దీంతో పాటు ప్రాచీన కట్టడాల కిట్టూ ఉంటుంది. తాజ్‌మహల్‌, కుతుబ్‌మినార్‌, ఎర్రకోట ఇలాంటి కట్టడాల ముక్కలుంటాయి. వాటిని క్రమపద్ధతిలో కూర్చి, అవి ఉన్న ప్రాంతాల ప్రకారం ఇండియా మ్యాప్‌లో పెట్టాలి. భలే ఉంది కదూ! ఇంకో విషయం నేస్తాలూ... కేవలం ఇండియా మ్యాపే కాకుండా వరల్డ్‌ మ్యాప్‌ కూడా ఉంది. మ్యాపాలజీ ఇండియా, మ్యాపాలజీ వరల్డ్‌ పేరుతో ఈ మ్యాప్‌ల కిట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.


అక్బర్‌ పరీక్ష!

ఒక రోజు అక్బర్‌ తన సభలో, మనుషులు చేస్తున్న వృత్తి, వారి స్వభావం రెండూ ఒకేలా ఉంటాయని అన్నాడు. అది బీర్బల్‌ ఒప్పుకోలేదు. ఎలానో నిరూపించమన్నాడు అక్బర్‌. ‘రేపు నాతోపాటు రండి. మీకు నిరూపిస్తా’ అన్నాడు బీర్బల్‌. మర్నాడు ఇద్దరూ మారువేషంలో నగర పర్యటన చేశారు. కాస్త దూరంలో ఓ మిఠాయి వ్యాపారి కనిపించాడు. ‘ఈ వ్యాపారి మనసు కూడా మిఠాయిలా తియ్యగా ఉంటుంది’ అన్నాడు అక్బర్‌. బీర్బల్‌ ఏమీ మాట్లాడలేదు. అనుకున్న ప్రకారం ఇద్దరూ వ్యాపారి దగ్గరకు వెళ్లి...  ‘మేము పొరుగూరి నుంచి వస్తున్న బాటసారులం. దారిలో దొంగలు పడి, ఉన్నదంతా దోచుకున్నారు! ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. తినడానికి ఏమైనా ఇవ్వండి’ అని అడిగారు. ‘ఇదేమైనా ధర్మసత్రమా... ఆకలితో ఉన్న వాళ్లందరికీ కడుపు నింపడానికి. పొండి... పొండి’ అని కసిరాడు. అక్బర్‌, బీర్బల్‌ అక్కడి నుంచి ముందుకు కదిలారు. కొంతదూరం వెళ్లాక వారికి రాళ్లు కొట్టి జీవనం సాగించే కూలీ కనిపించాడు. ఆ కూలీ మనసు కూడా రాయిలాగే కఠినంగా ఉంటుంది అన్నాడు అక్బర్‌. ఈసారీ బీర్బల్‌ ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఇద్దరూ అతని దగ్గరికెళ్లి మిఠాయి వ్యాపారికి చెప్పినట్లే చెప్పారు. ఆ కూలీ వెంటనే... ‘అయ్యో! అలాగా! నాతో రండి’ అని పక్కనే ఉన్న తన గుడిసెకు తీసుకుని వెళ్లాడు. వాళ్లకు కాళ్లూ చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి, తన భార్యతో భోజనం తయారు చేయించి, వడ్డించాడు. దారిలో వాళ్లు తినడానికి కొన్ని తినుబండారాలూ మూటలో కట్టి ఇచ్చి వారికి వీడ్కోలు పలికాడు. అక్కడి నుంచి నేరుగా కోటకు చేరుకున్న తర్వాత... ‘ప్రభూ..! చేస్తున్న పనికీ స్వభావానికీ సంబంధం ఉండదని ఇప్పటికైనా ఒప్పుకుంటారా?’ అని అడిగాడు బీర్బల్‌. అక్బర్‌ ఓ చిరునవ్వు నవ్వి... ‘అవును బీర్బల్‌! నువ్వన్నది నిజం’ అని అంగీకరించాడు. తర్వాత ఆ కూలీ కుటుంబాన్ని కోటకు పిలిపించి సత్కరించి, బహుమతులు ఇచ్చి పంపించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..