Published : 29 Jan 2023 00:24 IST

సిసింద్రీ

ఔరా.. రబ్బరు బొమ్మ!

కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన ఖుషీ(13) తన శరీరాన్ని విల్లులా వంచుతుంది. ఎంతలా అంటే అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయా లేవా అనేంతలా. తనకు క్రంచర్‌ గర్ల్‌ అనే పేరు సైతం ఉంది. ఖుషీ శరీరం ఇంత ఫ్లెక్సిబుల్‌గా మారడానికి కారణం యోగా. తను శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుండేది. దీన్నుంచి బయటపడటం కోసం ఖుషీ యోగాను నేర్చుకుంది. ఈ చిన్నారి అష్టాంగ యోగాను అవలంబిస్తుంది. ఎంతో కష్టమైన యోగాసనాలను కూడా తేలికగా వేయగలుగుతోంది. షాంఘైలో జరిగిన ఇంటర్నేషనల్‌ యోగా ఇన్విటేషనల్‌ టోర్నమెంట్‌లో కాంస్యం, ఆరో ఆసియా యోగా ఛాంపియన్‌ షిప్‌లో రెండు స్వర్ణం, రెండు రజతం, ఏడో ఆసియా యోగా ఛాంపియన్‌ షిప్‌లో నాలుగు స్వర్ణం, ఒక రజత పతకం కైవసం చేసుకుంది. అంతటితోనే ఆగిపోకుండా బ్యాక్‌ ప్లాంక్‌ రిక్లైన్‌ క్రంచెస్‌ ప్రాక్టీస్‌ చేసింది. నిలుచున్న చోట నుంచే శరీరాన్ని విల్లులా వెనక్కు వచ్చి నేలపై వెల్లకిలా పడుకుని, మళ్లీ యథాస్థితికి రావడం చాలాకష్టం. కానీ ఖుషీ చాలా తేలికగా నేర్చుకుంది. ఇలా ఒక నిమిషంలో 14 బ్యాక్‌ ప్లాంక్‌ రిక్లైన్‌ క్రంచెస్‌ చేసి వరల్డ్‌ రికార్డూ సాధించింది.


సాకేతుడు చూపిన మార్గం!

పూర్వం అవంతీపురం రాజ్యాన్ని సురేంద్రుడు పరిపాలించేవాడు. అతని ఆస్థానంలో సాకేతుడు అనే కవివర్యుడు ఉండేవాడు. అక్బర్‌ కొలువులోని బీర్బల్‌లా, రాయలవారి ఆస్థానంలోని తెనాలి రామకృష్ణుడిలా చతురుడు. ఆ రాజ్యంలో నెలకోసారి విజ్ఞాన సదస్సులు జరిగేవి. వాటికి ప్రజలంతా తప్పనిసరిగా హాజరవ్వాలని నియమం. సాకేతుడికి మాత్రం వాటి మీద సదభిప్రాయం లేకపోగా.. ఓసారి తానే వక్తగా ప్రసంగించాల్సి వచ్చింది. మొదటి రోజు సభ ప్రారంభమైంది. సాకేతుడు వచ్చి... ‘మీకు పాండిత్యం అంటే అసలు అర్థం ఏంటో తెలుసా?’ అన్నాడు. అందరూ ‘తెలియదు’ అన్నారు. ‘తెలియని వాళ్లకు ఏం చెబుతాం. ఏం చెప్పినా... ఎంత చెప్పినా అర్థం కాదు’ అని సభ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మళ్లీ సదస్సు ప్రారంభమైంది. ‘మీకు కవిత్వం అంటే ఏంటో తెలుసా?’ అన్నాడు. క్రితంరోజు జరిగింది గుర్తొచ్చి అందరూ... ‘ఓ... తెలుసు’ అన్నారు. ‘మరింకేం... తెలిసిన వాళ్లకు నేను ఇంకేం చెప్పాలి’ అని సాకేతుడు సభ నుంచి వెళ్లిపోయాడు. మూడో రోజు మళ్లీ సభ ప్రారంభమైంది. ‘మీకు కావ్యం అంటే తెలుసా?’ అన్నాడు సాకేతుడు. ఈసారి సదస్సులో సగం మంది తెలుసు అని, మరో సగం మంది తెలియదు అని చెప్పారు. సాకేతుడు ఓ చిరునవ్వు నవ్వి... ‘మీలో తెలిసిన వాళ్లు తెలియని వాళ్లకు చెప్పండి, తెలియని వాళ్లు తెలిసిన వాళ్ల దగ్గర తెలుసుకోండి’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఈ విషయం రాజు చెవిన పడింది. సురేంద్రుడికి విపరీతమైన కోపం వచ్చింది. సాకేతుణ్ని పిలిపించి... ‘సభలో మీరు ప్రసంగించకపోవడానికి కారణం ఏంటి? రాజాజ్ఞనే పరిహాసం చేస్తారా?’ అన్నాడు. ‘ప్రభూ... మన్నించాలి. మీరు ప్రతి నెలా సభలు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ కచ్చితంగా హాజరు కావాలంటున్నారు. మీ ఆలోచన మంచిదే. కానీ ఆచరణ మంచిదికాదు. కార్మికులు, కర్షకులు, వ్యాపారులు... ఇలా అందరూ ఇక్కడ సభకు వస్తే, అక్కడ పనులు ఆగిపోతున్నాయి. రాజ్య ప్రగతి కుంటుపడుతోంది’ అని చెప్పాడు. రాజు ఆలోచనలో పడ్డాడు. సభలను రద్దు చేశాడు. పనులు ఆగకుండా ప్రజలను విజ్ఞానవంతులను చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు