Updated : 25 Sep 2022 04:01 IST

మీకు తెలుసా!

నైజీరియాలోని ఉబాంగ్‌ అనే గ్రామంలో మహిళలు ఒక భాషనీ పురుషులు మరో భాషనీ మాట్లాడతారు. ఒకరు మాట్లాడేది మరొకరికి అర్థమవుతుంది. కానీ ఎవరి భాషని వాళ్లే మాట్లాడతారు. పిల్లలు మాత్రం పదేళ్ల వరకూ రెండు భాషల్లో ఏదైనా మాట్లాడొచ్చు. ఆపై మాత్రం నియమం తప్పకూడదు. అయితే పిల్లలు చిన్నప్పుడు తల్లితోనే ఎక్కువగా గడుపుతారు కాబట్టి ఆడవాళ్ల భాషనే మాట్లాడతారు. ఆడపిల్లలకు దానివల్ల ఎలాంటి సమస్యా ఉండదు కాబట్టి అదే కొనసాగిస్తారు. మగ పిల్లలు మాత్రం పదేళ్లు దాటాక, ఎవరూ చెప్పకుండానే ఆ విషయాన్ని గమనించుకుని మగవాళ్ల భాషే మాట్లాడాలట. ఒకవేళ అలా కాకుండా అప్పటికీ రెండు భాషల్నీ మాట్లాడితే మానసికంగా ఎదగలేదనీ వాళ్లలో ఏదో తేడా ఉందనీ భావిస్తారట. అయితే అసలీ పద్ధతి ఎలా మొదలైందన్న విషయం మాత్రం ఆంత్రోపాలజిస్టులకు కూడా అంతుపట్టడంలేదట.


ఈకల్లేని కోడి... నిజమేనా?

కలు పీకేసిన కోడి అనడం వింటుంటాం. కానీ ఇజ్రాయెల్‌లోని రెహొవట్‌ అగ్రానమీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఓ జన్యుశాస్త్ర నిపుణుడు ఏకంగా అలాంటి కోడినే సృష్టించాడు. మెడదగ్గర ఈకల్లేని చర్కీ లేదా టర్కెన్‌ అనే ఓ రకం కోడిని బ్రాయిలర్‌తో సంకరీకరించి ఈ నేకెడ్‌ చికెన్‌ని పుట్టించాడట. ఉష్ణప్రాంతాల్లోని కోళ్లకు ఈకల కారణంగా చల్లదనం కోసం కూలర్లనూ ఏసీలనూ ఏర్పాటుచేయాల్సి ఉంటుందనీ, మాంసంకోసం వండేటప్పుడు ఈకల్ని తీయడం పెద్ద పని అనీ ఆ ఖర్చు తగ్గించేందుకే ఈ కొత్త రకం కోళ్లని సృష్టించామనీ చెప్పుకొచ్చారు సదరు సంస్థ నిపుణులు. పైగా జన్యుమార్పు చెందించడం ద్వారా దీన్ని పుట్టించలేదనీ కేవలం రెండు రకాల వాటిని సంకరీకరించడం ద్వారా పుట్టిన రకమనీ, ఈకలకోసం శక్తి ఖర్చుకాదు కాబట్టి ఇవి మరింత త్వరగా పెరుగుతాయనీ అంటున్నారు. కానీ ఈ రకమైన కోళ్లు వ్యాధుల బారినపడే ప్రమాదం ఎక్కువ కాబట్టి వీటివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మిగిలిన ప్రపంచమంతా కోడై కూసింది. అందుకో ఎందుకోగానీ ఆ సంస్థ భారీయెత్తున వీటిని సృష్టించకుండా ఊరుకున్నట్లు ఉంది. అయినా ఎంతటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నప్పటికీ మరీ ఇంతటి ప్రతిసృష్టి ఉండకూడదు సుమీ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts