నాటి కూలీ చేతులు... నేడు వీఐపీలకి వడ్డిస్తున్నాయి!

‘ఏమిటీ కష్టాలు... మన బతుకులు ఇక మారవా?’ అని మధనపడేవాళ్ళకి కొత్త నమ్మకాన్నిస్తుంది ఈ కుటుంబం కథ. చేతిలోని నైపుణ్యానికి సానపట్టి శ్రమించాలేకానీ...  అట్టడుగు నుంచైనా అద్భుత విజయాలు అందుకోవచ్చని చెబుతుంది.

Updated : 06 Aug 2023 10:44 IST

‘ఏమిటీ కష్టాలు... మన బతుకులు ఇక మారవా?’ అని మధనపడేవాళ్ళకి కొత్త నమ్మకాన్నిస్తుంది ఈ కుటుంబం కథ. చేతిలోని నైపుణ్యానికి సానపట్టి శ్రమించాలేకానీ...  అట్టడుగు నుంచైనా అద్భుత విజయాలు అందుకోవచ్చని చెబుతుంది. ఆ కుటుంబానికి చెందిన ‘మాదంపట్టి పాకశాల’ అన్న కేటరింగ్‌ సంస్థ నేడు వీఐపీల  ఇంటి వేడుకలకి సేవలందిస్తోంది! ప్రధాని నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల దాకా దేశవ్యాప్తంగా ప్రముఖులకి షడ్రసోపేత విందుభోజనాన్ని వడ్డిస్తోంది. ఆ సంస్థని నడిపిస్తున్న స్ఫూర్తి ఇది...

ఆ నది పేరు నొయ్యల్‌. వారానికోసారి దాని ఒడ్డుకెళ్ళి... చుట్టుపక్కల ఎండిన చెట్టుకొమ్మలని కొట్టి ఆ పేళ్లని మోపుకట్టి నెత్తికెత్తుకుంటుంది లక్ష్మి. తలపైన కట్టెలమోపుతోపాటు చిన్నకొడుకుని చంకనేసుకుని... తోడుగా వచ్చిన పెద్దకొడుక్కి కబుర్లేవో చెబుతూ ఇంటికి నడుస్తూ ఉంటుంది. అలా ఆమె చెప్పే కబుర్లలో తప్పకుండా తన పెళ్ళి కథా ఉంటుంది. ‘మీ నాన్నది మలయాళ దేశంరా! వాళ్ళు ఏడుగురు సంతానమైతే మీ నాన్నే పెద్దవాడు. ఎనిమిదేళ్ళప్పుడే తండ్రి చనిపోతే... తల్లి కోయంబత్తూరులోని ఓ ఇంట్లో పనివాడిగా కుదిర్చిందట. అక్కడి వంటమనిషి చేతి కింద పదేళ్లు పనిచేశాడు. ఆ తర్వాత- ఆ యజమాని కొడుకులిద్దరూ బెంగళూరులో చదువుకోవడానికి వెళ్తుంటే వాళ్ళకి వండిపెట్టడానికని వెళ్ళాడు. ఆ ఇద్దరి చదువయ్యాక- ఈయన బెంగళూరులోనే ఉండిపోయి ఓ హోటల్‌లో పనికి కుదిరాడు. కొంతకాలానికి- మీనాన్న నిజాయతీ నచ్చి ఆ యజమాని హోటల్‌ బాధ్యతలు ఈయనకే ఇచ్చాడట. కానీ- అప్పట్లో బెంగళూరులో చెలరేగిన అల్లర్లలో ఆ రెస్టరంట్‌ని ధ్వంసం చేసేశారు. దాంతో- కట్టుబట్టలతో తిరిగొచ్చిన మీ నాన్న కోయంబత్తూరు దగ్గరున్న తెలుగుపాళెంలో ఓ మోతుబరి రైతుదగ్గర పాలేరుగా చేరాడు. అక్కడే నన్ను చూశాడు. నన్ను పెళ్ళాడతానని అడిగితే ‘ఏమీలేనివాడికి పిల్లనివ్వం’ అన్నారు అమ్మమ్మవాళ్ళు. నేనూ ఈయన్నే చేసుకుంటాననడంతో... ఎన్నో గొడవల మధ్యే మా పెళ్ళైంది. అప్పట్లో మా ఇద్దరికీ కలిపి వారానికి 90 రూపాయలు కూలీ. నువ్వు కడుపున పడ్డాక నేను కూలీ మానేశాను. నాన్న ఓ స్టీల్‌ ఫ్యాక్టరీలో పనికెళ్ళేవాడు. రోజంతా సమ్మెటతో ఇనుముని కొట్టేపని అది. రాత్రికి అరచేతులు వాచి నొప్పితో అల్లాడేవాడు. ఖాళీ దొరికితే కోయంబత్తూరు వీధుల్లో కాయగూరలూ అమ్ముతుండేవాడు.

ఆ కష్టాలు తాళలేకే ఇద్దరం పెళ్ళిళ్ళకి వంటపని ఆర్డర్‌లు తీసుకోసాగాం. తర్వాత- మాదంపట్టి అన్న ఈ ఊరొచ్చాం. ఈ వ్యాపారానికి మీ నాన్న ‘లక్ష్మీ మెస్‌’ అని పేరుపెట్టాడు. ఇప్పుడు ఆ వ్యాపారమే మనకి అన్నం పెడుతోంది... దానికోసమే ఇలా వారానికి సరిపడా వంట చెరకు తెచ్చుకుంటున్నాం. ఇక, కథ కంచికీ మన ముగ్గురం ఇంటికీ...’ అని చెప్పేదట లక్ష్మి.

- ఈ కథంతా విన్న ఆ పెద్దకొడుకు పేరు రంగరాజు. కష్టాలు పడుతున్న ఆ తండ్రిపేరు తంగవేలు. తన తండ్రి పడ్డ కష్టం అతనిలో ఎంత పట్టుదలని రాజేసిందో కానీ... పదో తరగతి, ఇంటర్‌లో ర్యాంకర్‌గా నిలిచాడు. బీఎస్సీలో గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు. అతనితోపాటే ‘లక్ష్మీ మెస్‌’ కూడా ఎదిగింది. చూస్తుండగానే జిల్లాలోనే పెద్ద కేటరింగ్‌ సంస్థగా పేరుతెచ్చుకుంది. ఆ సమయంలోనే రంగరాజు దాని బాధ్యతలు తీసుకున్నాడు.

కాఫీ కూడా చేయడం రాదు...

‘కంపెనీ బాధ్యతలు తీసుకునే నాటికి నాకు కాఫీపెట్టడం కూడా రాదు. ఏడాదిపాటు క్యాటరింగ్‌ కోర్సు చదివి ఇటొచ్చాను. మా చిన్న సంస్థని ఊరి పేరు మీద ‘మాదంపట్టి పాకశాల’ అన్న కార్పొరేట్‌ కంపెనీగా మార్చాలనుకున్నాను. అమ్మానాన్నల చేతిరుచుల్ని ఫైవ్‌స్టార్‌ హోటల్‌ స్థాయికి తీసుకెళ్ళాలనుకున్నాను. ప్రపంచ ప్రమాణాలతో అతిపెద్ద కిచెన్‌ని నిర్మించాను. దాని ద్వారా కార్పొరేట్‌ కంపెనీలకి రోజూ 3500 భోజనాలు సరఫరా చేయసాగాను. తమిళ హీరో కార్తి పెళ్ళి-రిసెప్షన్‌ ఈ నగరంలోనే జరగడంతో... ఆ క్యాటరింగ్‌ ఆర్డర్‌ మాకిచ్చారు. ఆ తర్వాత- చెన్నైలో హీరో విక్రమ్‌ కూతురి పెళ్ళికీ, హైదరాబాద్‌లో దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి వాళ్ళబ్బాయి రిసెప్షన్‌కీ మేమే భోజనం సరఫరా చేశాం. తమిళనాడు రాజకీయ ప్రముఖులూ రాసాగారు... అక్కడి గవర్నర్‌ కూతురి పెళ్ళి క్యాటరింగ్‌ బాధ్యతలూ మాకే అప్పగించారు. తాజ్‌మహల్‌ ప్రాంగణంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న ‘తమిళ సంవత్సరాది వేడుకల’కి మేమే భోజనం సరఫరా చేశాం. అప్పటి నుంచీ మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలోని భారీ వేడుకలకీ సేవలందిస్తున్నాం. నిజానికి, మరో 734 రోజుల దాకా మా డేట్స్‌ ఖాళీ లేవు!’ అంటాడు రంగరాజు ఆనందంగా. అలా- కేవలం ఇద్దరి రెక్కల కష్టంతో రూపుదిద్దుకున్న ఈ సంస్థలో ప్రస్తుతం... రెండువేలమంది ఉద్యోగులున్నారు! అన్నట్టు... రంగరాజు ప్రస్తుతం కోలీవుడ్‌ హీరో కూడా. కీర్తిసురేశ్‌ థ్రిల్లర్‌ ‘పెంగ్విన్‌’ చిత్రంలో నటించాడు. ‘మెహందీ సర్కస్‌’ అన్న తమిళ చిత్రంలోనూ హీరోగా చేస్తే... అది హిట్టయ్యింది!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..