కడుపులోని పాపాయికి ఆపరేషన్ చేశా!
ద్రాక్షపండు అంత ఉంటుంది 27 వారాల గర్భస్థశిశువు గుండె. ఆ చిట్టి గుండెలో ఏర్పడిన సమస్యకు చికిత్స చేశారు దిల్లీ ఎయిమ్స్ వైద్యులు. మనదేశంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారి జరిగిన ఈ తరహా శస్త్రచికిత్సా విధానాన్ని పదమూడేళ్ల క్రితమే ఆవిష్కరించారు డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు.
కడుపులోని పాపాయికి ఆపరేషన్ చేశా!
ద్రాక్షపండు అంత ఉంటుంది 27 వారాల గర్భస్థశిశువు గుండె. ఆ చిట్టి గుండెలో ఏర్పడిన సమస్యకు చికిత్స చేశారు దిల్లీ ఎయిమ్స్ వైద్యులు. మనదేశంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారి జరిగిన ఈ తరహా శస్త్రచికిత్సా విధానాన్ని పదమూడేళ్ల క్రితమే ఆవిష్కరించారు డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు (రెయిన్‌బో హార్ట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్). ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన ఆవిష్కరణలను దాదాపు 80 దేశాలు ఆమోదించి ఉపయోగిస్తున్నాయి. వాటి విశేషాలు ఆయన మాటల్లోనే...
మనదేశంలో ఏటా దాదాపు రెండు లక్షల(ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం) మంది పిల్లలు గుండె సమస్యలతోనే కళ్లు తెరుస్తున్నారు. వారిలో ఇరవై శాతం మందికి తక్షణ వైద్యం అంది తీరాలి. కానీ తమ పిల్లలు అలాంటి లోపంతో పుడుతున్నారని తెలుసుకునేలోపే వారిని కోల్పోతున్నారు చాలామంది తల్లిదండ్రులు. అలాంటి చిన్నారుల గుండెకు పెద్ద చికిత్సలేవీ అవసరం లేకుండా- చిన్నపాటి శస్త్రచికిత్సతో వారికి పునర్జన్మనివ్వాలనుకున్నా. అందుకోసమే కోనార్- ఎమ్‌ఎఫ్ పరికరాన్ని రూపొందించా. కొన్ని కారణాల వల్ల గుండె దిగువ గదుల్లో రంధ్రం ఏర్పడి రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ఆ రంధ్రాలను మూసివేసే పరికరమే కోనార్-ఎమ్‌ఎఫ్. అయితే దాన్ని ఆవిష్కరించడానికి ఓ బలమైన కారణమే ఉంది. శ్రీచిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్‌లో కార్డియాలజీ కోర్సు చదువుకుంటూ, అక్కడ గుండెకు సంబంధించిన ప్రయోగాలను చూసినప్పుడు ఏదైనా కొత్తగా కనిపెట్టాలనిపించింది. కేర్ ఆసుపత్రిలో వైైద్యుడిగా నా ప్రయాణం మొదలుపెట్టిన తొలినాళ్లలో... ఆరునెలల చిన్నారికీ, అరవై ఏళ్ల వారికీ ఒకరే శస్త్రచికిత్సలు చేసేవారు. పసిపిల్లలవీ, పెద్దలవీ పడకలు కూడా ఒక చోటే ఉండేవి. కానీ, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న పసివాళ్లకి ఎంతో శ్రద్ధ అవసరం. అందుకే పసివాళ్లకు ప్రత్యేకంగా గుండె విభాగం ఉండాలనిపించింది. అప్పుడే ఒకసారి అబ్దుల్‌కలాం వచ్చారు. ఆయన కూడా అదే భావించి లక్ష రూపాయల చెక్ ఇచ్చి పసి హృదయాలను ప్రత్యేకంగా చూసుకోమన్నారు. అప్పుడే కొందరు వైద్యులం కలిసి ‘లిటిల్ హార్ట్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి పేద పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయడం మొదలుపెట్టాం.
చైనాలో ప్రయోగం
అది 2004... గుండెలో లోపాలతో పుట్టిన చిన్నారులను ప్రభుత్వం పట్టించుకోవాలంటూ దాదాపు వందమంది బాధితులతో ట్యాంక్ బండ్‌పై మంద కృష్ణ మాదిగ ధర్నా చేశారు. దానికి స్పందించిన ముఖ్యమంత్రి ఆ చిన్నారులందర్నీ మా దగ్గరకు పంపి చికిత్సలు చేయమన్నారు. ఆ సమయంలో కొందరు చనిపోయారు కూడా. పైగా రోజుకు ఇద్దరికి మాత్రమే చికిత్స చేయగల పరిస్థితి మాది. వాళ్లలోని కొందరు చిన్నారులకు గుండెలోని రంధ్రాలకు అప్పటికి అందుబాటులో ఉన్న పరికరాన్ని పెట్టి ఆపరేషన్లు చేశాం. అది కుదరని వారికి ఓపెన్ హార్ట్ సర్జరీలే శరణ్యం. కానీ, అవి ఎంతో శ్రమతో కూడుకున్నవి. అయితే ఆ సమయంలోనే గుండెలో రంధ్రాలను పూడ్చడానికి వాడే బటన్‌తో హార్ట్‌బ్లాక్‌లు వస్తున్నాయని తెలిసి అన్ని దేశాలూ ఆ పరికరాన్ని నిషేధించాయి. దాంతో చిన్న సమస్యకి కూడా పెద్ద ఆపరేషనే చేయాల్సి వచ్చేది. మరోవైపు మన దగ్గర ఎంతో మంది చిన్నారులు చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవాలనిపించింది. పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించాలని నిర్ణయించుకున్నా. అయితే అప్పటికి మన దగ్గర ఇలాంటి ప్రయోగాలు చేయడానికి సౌకర్యాలేమీ లేకపోవడంతో... చైనాలోని ఓ ల్యాబ్‌తో మాట్లాడా. వైద్యుడిగా పనిచేస్తూనే దాని గురించి అధ్యయనం చేస్తూ నోట్స్ రాసుకునేవాడిని. అందుకోసం రోజుకు 12 నుంచి 16 గంటలు కష్టపడేవాడిని. వీలు కుదిరినప్పుడల్లా చైనా వెళ్లి రెండు మూడు రోజులు అక్కడే ఉండి ల్యాబులో ప్రయోగాలు చేసేవాడిని. ఆ సమయంలో నాకు కొందరు వైద్యులూ సహకరించారు. చివరికి నికెల్- టైటానియంతో తయారుచేసిన జల్లెడలాంటి ఆ పరికరంపైన కణజాలం ఏర్పడటంతోపాటు- ఎలాంటి దుష్ప్రభావాలూ తలెత్తవని తెలిసింది. పైగా చైనాలో జంతువులకూ ఆ పరికరాన్ని అమర్చి కొన్నేళ్ల పాటు అక్కడి వైద్యులతో కలిసి పరిశోధనలు చేశా. చివరికి 2015లో పరికరాన్ని పూర్తిస్థాయిలో రూపొందించా. అది కేవలం గుండెలోని రంధ్రాలకే కాక మరికొన్ని సమస్యల్నీ పరిష్కరించేలా తయారుచేసి దానికి ‘కోనార్- మల్టీఫంక్షనల్ (ఎమ్‌ఎఫ్)’ అనే పేరు పెట్టా.
రిస్కు తీసుకున్నా
అప్పుడే నాలుగు నెలల పాప ప్రమాదకర పరిస్థితిలో మా దగ్గరకొచ్చింది. గుండెలో నాలుగు రంధ్రాలు ఉన్నాయి. మరోవైపు న్యుమోనియా ఎక్కువగా ఉండి శ్వాస కూడా తీసుకోలేకపోవడంతో వెంటిలేషన్ పెట్టాం. పాప బతకడం కష్టమే. ఓ డాక్టర్ వెంటిలేషన్ తీసి సారీ చెబుదామని నిర్ణయించుకున్నాడు. నాకు మాత్రం ఎలాగైనా పాపను బతికించాలనుంది. వేరే సర్జన్లు ఆపరేషన్‌కి ముందుకు రాలేదు. నేనే ఆ పాపకి శస్త్రచికిత్స చేశా. మూడంటే మూడు రోజుల్లో కోలుకుంది. అందుకు కారణం కోనార్-ఎమ్‌ఎఫ్ పరికరంతో తన గుండెలోని మూడు రంధ్రాలను మూసేయడమే. పాప కోలుకున్నాకే కోనార్ పరికరం వాడి ఆ పాపని ప్రమాదం నుంచి తప్పించానని అసలు విషయం అందరికీ చెప్పా.ఆ సంఘటన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే కోనార్-ఎమ్‌ఎఫ్‌కు అప్పటికి 6మిల్లీ మీటర్ల రంధ్రాన్ని మాత్రమే పూడ్చగల సామర్థ్యం ఉంది. కాలక్రమేణా అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుంటూ... దాన్ని అప్‌డేట్ చేస్తూ 2018 నాటికి ఐదు రకాల వెర్షన్లను తయారు చేశా. చివరగా 14మీ.మీ రంధ్రాన్ని పూడ్చగల డివైజ్‌ను రూపొందించా. అంతేకాదు, ఆ చిన్న పరికరం 4మి.మీ-14మి.మీ వరకూ ఏ పరిమాణంలో ఉన్న రంధ్రాన్ని అయినా మూసేస్తుంది. అందుకు తగ్గట్టు సాగడమే దాని ప్రత్యేకత. ప్రయోగపూర్వకంగా అది విజయం సాధించడంతో మనదేశంతోపాటు మరికొన్ని దేశాల్లోనూ పేటెంట్ కోసం దరఖాస్తు చేశా. పరికరం గురించి వ్యాసాలు రాసి వైద్య పత్రికలకు పంపేవాడిని. వాటిని చదివి కొందరు విదేశీ వైద్యులు ఆ పరికరంతో చేసే శస్త్రచికిత్సలు చూడ్డానికి వచ్చేవారు. కొన్ని దేశాల నుంచి సదస్సులకు ఆహ్వానించేవారు. పరికరాన్ని చూసి, నేను చేసిన కేసుల గురించి విన్నాక ఆ దేశాల్లో కూడా కోనార్ పరికరాన్ని వాడటం మొదలుపెట్టారు. గతంలో విఫలమైన పరికరాల వల్ల అమెరికా నుంచి మాత్రం చాలా సందేహాలు వచ్చాయి. వారి సందేహాలన్నీ తీర్చా. అంతేకాదు 2012లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ సదస్సులో పరిశోధన పత్రం సమర్పిస్తే ఉత్తమ ఆవిష్కరణ కింద ఎంపికైంది. అయితే నేను మొదట్లో విదేశాల్లో వారి యాక్సెంట్‌కి తగినట్టు మాట్లాడలేక, ప్రజెంటేషన్ ఇవ్వడానికి సంకోచించే వాడిని. క్రమంగా పరికరానికి ఆదరణ రావడం, ఎంతోమంది దాన్ని మెచ్చుకుని నా చుట్టూ చేరి ప్రశ్నలు అడుగుతుండటంతో ఇబ్బందులన్నీ అధిగమించగలిగా. అలానే కొందరు వైద్యులకు ఫోన్‌లో, వీడియో కాల్‌లో ఈ పరికరం గురించి చెబితే వారు ఆపరేషన్లు చేసిన సందర్భాలూ ఉన్నాయి.
హక్కులూ వచ్చాయి
దేశ విదేశాల్లో పేటెంట్ కోసం దరఖాస్తు చేసిన నాకు 2019లో యూరప్ సీఈ(పేటెంట్), తరవాత యూరో-ఆసియా పేటెంట్ వచ్చాయి. దాంతో ప్రపంచంలో జర్మనీ, రష్యా, జపాన్, కొరియా, అర్జెంటీనా... ఇలా దాదాపు 80 దేశాలు ఈ కోనార్-ఎమ్‌ఎఫ్ పరికరాన్ని వాడుతున్నాయి. ఈ మధ్యనే భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చింది. ఈ పరికరాన్ని ఏ హాస్పిటల్ తీసుకున్నా నాకు రాయితీ వస్తుంది. ఆ మొత్తాన్ని గుండె జబ్బులకు సంబంధించి పరిశోధనలు చేయడానికీ, ఔత్సాహికుల్ని ప్రోత్సహించడానికీ¨ వాడుతున్నా. అంతేకాదు, మన దేశంలో ఈ పరికరాన్ని తక్కువ ధరకే అందిస్తున్నా. చేతనైనంత మందికి సాయం చేయాలనుకుంటున్న నన్ను 2022లో ఇటలీలోని ఓ యూనివర్సిటీ ఆహ్వానించి- ఆవిష్కరణల గురించి కాకుండా ఓ చిన్న పల్లెటూరి నుంచి ఇక్కడ వరకూ ఎలా వచ్చానో చెప్పమంది. ఎద్దుల బండి నేపథ్యం నుంచి ఎయిర్ బస్ ఎక్కే వరకూ వచ్చిన నేను పుట్టి పెరిగింది నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేటలో. మాది మధ్యతరగతి రైతు కుటుంబం. నాన్నకి ఐదుగురం సంతానం. అందర్నీ బాగా చదివించాలని ఉన్న నాలుగు ఎకరాల పొలం అమ్మేశారు. ఆయన కష్టం చూశాక బాగా చదువుకుంటేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని అర్థం చేసుకున్నా. ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకూ క్లాస్‌లో ముందు ఉండేవాడిని. దాంతో పుస్తకాలకే పరిమితమై చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా పట్టించుకునేవాడిని కాదు. ఎంబీబీఎస్‌కి వచ్చాక అలా ఉండటం తప్పని తెలుసుకుని నలుగురితో కలవడం మొదలుపెట్టా. అలా ఎంబీబీఎస్ అయ్యాక నాన్న ప్రాక్టీస్ చేయమన్నారు. నాకేమో పీడియాట్రిక్స్ ఇష్టం. టీచర్లు మాత్రం కార్డియాలజీ కోర్సు బాగుంటుంది చదవమని సలహా ఇచ్చారు. దాంతో కర్నూలు మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్స్ కోర్సు చదివా. తరవాత ప్రవేశ పరీక్ష రాయడంతో కేరళలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్‌లో కార్డియాలజీ చదవడానికి ఫ్రీ సీటు వచ్చింది. అక్కడే ప్రయోగశాలలో రకరకాల ఆవిష్కరణలు చూసి నాకూ ఆసక్తి కలిగింది. ఏదైనా చేయాలనిపించింది. నా ప్రతిభ గుర్తించిన మా ప్రొఫెసర్ ఒకరు అక్కడ చదువయ్యాక ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ సిడ్నీలో పీడియాట్రిక్ కార్డియాలజీ చదవడానికి పంపారు. అక్కడ మెరిట్ ఆధారంగా న్యూజీలాండ్‌లోని ఓ ఆసుపత్రిలో పీడియాట్రిక్ కార్డియాలజీ నిపుణుడిగా పని చేయమని భారీ జీతంతో ఆహ్వానించారు. కానీ, అప్పటికి మనదేశంలో పీడియాట్రిక్ కార్డియాలజీ లేకపోవడంతో నా చదువు మనదేశానికి ఉపయోగపడాలని నిర్ణయించుకున్నా. అందుకే హైదరాబాద్‌లోగానీ చెన్నైలోగానీ ప్రాక్టీస్ చేద్దాం అనుకునే సమయంలో నా గురించి తెలిసి కేర్ నుంచి డాక్టర్ సోమరాజు పిలిచారు. అలా 2002లో హైదరాబాద్‌లో చిన్నారుల హృద్రోగ నిపుణుడిగా జీవితం మొదలుపెట్టా. నేను చూసిన పరిస్థితులు నన్ను కోనార్ పరికరం ఆవిష్కరించే వైపు అడుగులు వేయించాయి. ప్రస్తుతం రెయిన్‌బో హార్ట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా ఉన్నా. ఆసుపత్రికీ, అధ్యయనాలకీ ఎక్కువ సమయం కేటాయించే నాకు వైద్య రంగానికే చెందిన అమ్మాయి భాగస్వామిగా వస్తే ఇబ్బంది అవుతుందనుకుంది మా అక్క. బాగా చదువుకుని గృహిణిగా ఉండటానికి ఇష్టపడి నా జీవితంలోకి వచ్చిన నా భార్య ఇంటినీ, మా ఇద్దరు అబ్బాయిల్నీ కంటికి రెప్పలా చూసుకుంటుంది. తను నన్ను అర్థం చేసుకోగలిగింది కాబట్టే ఇంత సాధించగలిగా. ఇక నాకు ఒత్తిడిగా అనిపిస్తే కెమెరా చేత పట్టుకుని పక్షుల్ని ఫొటోలు తీయడానికి వెళుతుంటా.
గర్భంలోనేే చికిత్స
2014లో అనుకుంటా... 26 వారాల గర్భంతో ఉన్న ఓ తల్లి కడుపులోని బిడ్డ గుండెలో కవాటాలు మూసుకుపోయాయి. బేబీని ఉంచుకోవాలో, తీయించుకోవాలో అర్థం కాని పరిస్థితి. వారిని చూస్తే ఎంతో బాధేసింది. దాంతో ఆ తల్లిని పిలిచి కడుపులో బిడ్డకు ఆపరేషన్ చేస్తానని చెప్పా. ఆమె సైన్సు టీచర్... నేను చెప్పింది అర్థం చేసుకున్నా, వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి ఆమెకి చాలా సమయం పట్టింది. కానీ, చివరికి ఒప్పుకుంది. ఈ ప్రక్రియలో గర్భస్థ శిశువు కదలికల్ని గమనించి బిడ్డ వెల్లకిలా ఉన్నప్పుడు కడుపులోంచి బేబీ తొడకు మత్తు ఇంజక్షన్ చేస్తాం. తరవాత తల్లిని గమనించి ఆమెకీ మత్తు ఇచ్చి... ఆమె కడుపుపైన చిన్న రంధ్రం చేసి బేబీ గుండెలోకి సన్నని తీగను(బెలూన్‌లాంటి పరికరాన్ని అమర్చి) పంపి- మూసుకుపోయిన కవాటాన్ని తెరుస్తాం. మనదేశంలో ఆ తరహా శస్త్రచికిత్స చేయడం అదే ప్రథమం. అది విజయం సాధించడం... ఆ పాప పూర్తి ఆరోగ్యంతో పుట్టడం.. తరవాత ఎలాంటి సమస్యలు ఎదురుకాకపోవడంతో ఇరవైకి పైనే ఆ తరహా ఆపరేషన్లు చేశాం. దిల్లీ ఎయిమ్స్‌లో చేసిన శస్త్రచికిత్సా విధానం ఇదే. ఇప్పటి వరకూ ప్రయివేట్ ఆసుపత్రుల్లోనే చేశాం. ప్రభుత్వాసుపత్రి పరిధిలో చేయడం ఇదే తొలిసారి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
India News
Heavy Rains: ముంచెత్తిన అకాల వర్షం.. 13 మంది మృతి!
-
Crime News
Crime News: కార్ ట్రావెల్స్ పెట్టాలన్న కోరికే డ్రైవర్ కొంపముంచింది
-
Sports News
IPL Final- Dhoni: చెన్నై, గుజరాత్ మధ్య ఫైనల్.. ఐపీఎల్లో చరిత్ర సృష్టించనున్న ధోనీ
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
India News
PM Modi: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. ఆర్టీఐ కార్యకర్త అరెస్టు
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!