మీకు నచ్చిన డిజైన్‌ను ప్రింట్‌ చేసిస్తారు!

‘ఈ డ్రెస్సు మీదున్న పూల ప్రింట్‌... సిల్క్‌ క్లాత్‌ మీద ఉంటే ఎంత బాగుండేది... ఆ హీరోయిన్‌ క్రాప్‌టాప్‌ డిజైన్‌ సూపర్‌గా ఉంది... అలాంటి క్లాత్‌ ఎక్కడ దొరుకుతుందో... చీర చాలా నచ్చేసింది కానీ బ్లౌజే అస్సలు బాలేదు... బయట అచ్చం అలాంటి ప్రింట్‌ ఉన్న క్లాత్‌ ఏమైనా ఉంటుందా...’

Updated : 16 Oct 2022 03:19 IST

మీకు నచ్చిన డిజైన్‌ను ప్రింట్‌ చేసిస్తారు!

‘ఈ డ్రెస్సు మీదున్న పూల ప్రింట్‌... సిల్క్‌ క్లాత్‌ మీద ఉంటే ఎంత బాగుండేది... ఆ హీరోయిన్‌ క్రాప్‌టాప్‌ డిజైన్‌ సూపర్‌గా ఉంది... అలాంటి క్లాత్‌ ఎక్కడ దొరుకుతుందో... చీర చాలా నచ్చేసింది కానీ బ్లౌజే అస్సలు బాలేదు... బయట అచ్చం అలాంటి ప్రింట్‌ ఉన్న క్లాత్‌ ఏమైనా ఉంటుందా...’ ఇలాంటి వాటెన్నింటికో సమాధానం చెబుతోంది ‘ఫ్యాబ్‌క్యురేట్‌’ అనే వెబ్‌సైట్‌. అది ఎలాగంటే...

అందాన్నీ అమ్మాయిల్నీ విడదీయలేనట్టే... అమ్మాయిల్నీ షాపింగ్‌నీ కూడా విడదీసి చూడలేం. చాలామంది ఆడవాళ్లు నగానట్రా కన్నా వేసుకునే దుస్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకే పండుగైనా, వేడుకైనా ముందు నుంచే వాటి మీద దృష్టి పెడతారు. అయితే కొన్నిసార్లు డిజైన్‌ నచ్చితే క్లాత్‌ నచ్చదు, బట్ట బాగుంటే ప్రింట్‌ బాగుండదు, ఆ రెండూ బాగున్నాయనిపిస్తే రంగు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు ఏదో ఒకదానికి రాజీపడి కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు అలా సర్దుకుపోవాల్సిన అవసరమే లేదు. ‘ఫ్యాబ్‌క్యురేట్‌’ (Fabcurate)తో నచ్చిన మోడల్‌ చూపించి, బంగారు నగలు చేయించుకున్నట్లే ఇష్టమైన క్లాత్‌ మీద నచ్చిన రంగుల్లో మెచ్చిన ప్రింట్‌ వేయించుకోవచ్చు.

ఏంటి దీని ప్రత్యేకత...

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ దుస్తుల సంస్థ ఏర్పాటు చేసిన ఈ వెబ్‌సైట్‌ కూడా మామూలు షాపింగ్‌ సైట్‌ లాంటిదే. దీంట్లో అమ్మాయిలకూ, అబ్బాయిలకూ, ఫర్నిషింగ్‌కూ కావాల్సిన వేలాది రకాల దుస్తులు ఉంటాయి. కాకపోతే, ఇందులో కనిపించే ఆ బట్టల్ని మాత్రమే కాదు... మనమే డిజైనర్లుగా మారి కొత్తవాటినీ సృష్టించుకోవచ్చు. అదెలా అంటారా... దీంట్లో ‘కస్టమర్‌ ఛాయిస్‌’ ఆప్షన్‌ ఉంటుంది. కాటన్, లిక్విడ్‌ ఆర్గాంజా, క్రేప్, రేయాన్, జార్జెట్, వెల్వెట్, షిఫాన్, శాటిన్, సిల్క్, చందేరీ, కలంకారీ, బనారస్‌ దగ్గర్నుంచి సీక్వెన్స్, మిర్రర్‌... ఇలా ఎన్నో ఎంబ్రాయిడరీల వరకూ చాలా రకాల క్లాతులుంటాయి. వాటిమీద డిజైన్ల కోసం బాందినీలాంటి సంప్రదాయ ప్రింట్లే కాకుండా అందమైన జంతువులూ, గీతలూ, చుక్కలూ, ఆకులూ, తీగలూ, పుప్వులూ లాంటి డిజైన్లూ ఉంటాయి. అంతేకాదు... వాలెంటైన్స్‌ డే, క్రిస్మస్, రాఖీ పౌర్ణమి, దసరా, సంక్రాంతి... ఇలా వేడుకలకు సంబంధించిన బొమ్మల ప్రింట్లతో రెడీ చేసిన వస్త్రాలూ ఉంటాయి. కావాలంటే వీటిల్లోంచి నచ్చిన వాటిని ఎంచుకోవచ్చు. లేదంటే మనకు ఇష్టమైన డిజైన్‌నూ, క్లాత్‌నూ ఫొటో తీసి పంపి సొంతంగా తయారుచేయించుకోవచ్చు. ‘ఇదంతా బాగుంది కానీ ఎక్కువ మొత్తంలో ఆర్డర్‌ ఇస్తేనే చేస్తారేమో’ అన్న అనుమానం వచ్చిందా... అదేం లేదండీ... మీటర్‌ క్లాత్‌ అయినా ఆర్డర్‌ ఇవ్వొచ్చట. బట్టా, డిజైన్‌నూ బట్టి మీటర్‌కి రూ.250 నుంచి 1700 రూపాయల వరకూ ఒక్కోటి ఒక్కో ధరలో ఉంటుంది. తీరా ఇంటికొచ్చాక మనం చెప్పిన ప్రింటూ, క్లాతూ లేకపోయినా రెండ్రోజుల గడువులో రిటర్న్‌ పెట్టేయొచ్చట.

మరి ఆలస్యం ఎందుకు... ఏదైనా ఫంక్షన్లోనో, ఫొటోల్లో సినిమా తారల మీదనో కనిపించిన డ్రెస్సును చూసి ‘అబ్బ ఎంత బాగుంది’ అనుకుని ఆ మాటను అక్కడికక్కడే వదిలేయకుండా ఒక్క క్లిక్‌ చేశారంటే... అచ్చంగా అలాంటి డ్రెస్సునే మీరూ సిద్ధం చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు