టీ తాగొచ్చు తినొచ్చు

పండ్లను ఎప్పుడూ ముక్కల రూపంలో కోసుకుని తింటే ఏం బాగుంటుందీ... కమ్మని వాసనతో నోరూరించే కాఫీ కాస్త కొత్త రుచిలో దొరికితే... డ్రైఫ్రూట్స్‌ను ఎప్పుడూ తినడమే ఎందుకు... అని ఆలోచించే ఆహారప్రియుల్ని మెప్పించేందుకు వచ్చినవే ఈ పదార్థాలు. వీటి ప్రత్యేకత ఏంటో చూసేద్దామా మరి..!

Updated : 04 Mar 2024 15:15 IST

పండ్లను ఎప్పుడూ ముక్కల రూపంలో కోసుకుని తింటే ఏం బాగుంటుందీ... కమ్మని వాసనతో నోరూరించే కాఫీ కాస్త కొత్త రుచిలో దొరికితే... డ్రైఫ్రూట్స్‌ను ఎప్పుడూ తినడమే ఎందుకు... అని ఆలోచించే ఆహారప్రియుల్ని మెప్పించేందుకు వచ్చినవే ఈ పదార్థాలు. వీటి ప్రత్యేకత ఏంటో చూసేద్దామా మరి..!

గ్రీన్‌ టీ మొదలు... పూలతో తయారైనవి, కూరగాయలతో చేసినవీ, పండ్ల పొడి వేసుకుని తాగేవి... ఇలా ఎన్నోరకాల టీలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ రుచి చూసేశాం.. ఇంకేదైనా కొత్త వెరైటీ వస్తే బాగుండని అనుకునేవారికోసం ఇప్పుడు ‘డ్రైడ్‌ ఫ్రూట్‌ టీ’ దొరుకుతోంది. అంటే... పండ్ల ముక్కలతో చేసుకునే టీ అన్నమాట. ఈ టీని తాగుతూనే అందులో వాడిన పండ్ల ముక్కల్ని కూడా తినడమే దీని ప్రత్యేకత. నిజానికి ఒకప్పుడు సీజన్లవారీగా వచ్చే పండ్లని ఆయా కాలాల్లో మాత్రమే తినాల్సి వచ్చేది. కానీ వాటిని కోరుకున్నప్పుడు తినేవిధంగా ఆ పండ్లను ముక్కల్లా కోసి ఎండబెట్టి మరీ అమ్మడం మొదలుపెట్టారు. అలా ఎండబెట్టిన పండ్ల ముక్కలతో చేసినదే ఈ ‘డ్రైడ్‌ఫ్రూట్‌ టీ’. రకరకాల పండ్లను ముక్కల్లా కోసి ఎండబెట్టి టీబ్యాగుల్లో వేసి ఇస్తారు. కొన్నింట్లో ఒకే తరహా పండ్ల ముక్కలు ఉంటే... మరికొన్నింట్లో రెండుమూడు కలిపి ఉంటాయి. టీ తాగాలనుకున్నప్పుడు కావాల్సినవాటిని వేడివేడి నీటిలో వేస్తే చాలు... ఆ పండ్ల ముక్కల్లోని సారం నీటిలోకి చేరి నోరూరించే టీ రెడీ అయిపోతుంది. దాన్ని తాగడంతోపాటూ ఆ ముక్కలూ మెత్తగా మారతాయి కాబట్టి వాటినీ తినేయొచ్చు. ఎలాంటి రసాయనాలూ, కెఫీన్‌ వంటివి కలపకుండా తయారుచేసే ఈ పండ్ల టీ వెరైటీల్లో ఆపిల్‌ నుంచి ఆరెంజ్‌, పైనాపిల్‌, డ్రాగన్‌ఫ్రూట్‌, బ్లూబెర్రీ వరకూ ఎన్నో రకాలు దొరుకుతున్నాయి.


కాఫీ మసాలా రుచిలో...

పొగలుగక్కుతూ చిక్కని నురగతో వచ్చే కాఫీ ఎంత బాగుంటుందో కదూ... మంచి వాసనతోపాటు రుచిలోనూ అదరగొట్టే కాఫీ... ఫిల్టర్‌, ఇన్‌స్టంట్‌ మాత్రమే కాకుండా లాటె, క్యాపుచినో, కోల్డ్‌కాఫీ... ఇలా కోరుకున్న రుచుల్లో ఎప్పటినుంచో దొరుకుతోంది. ఇప్పుడు వాటన్నింటికీ జతగా మరోరకం కాఫీ వెరైటీని తీసుకొచ్చారు. అదే ఈ ‘మసాలా కాఫీ’. కాఫీ గింజలతోపాటు శొంఠి, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు వంటివన్నీ మోతాదు ప్రకారం తీసుకుని కాఫీపొడిలా తయారుచేయడమే ఈ ‘మసాలా కాఫీ’ ప్రత్యేకత. అలా వస్తున్న పొడిని పాలతోనూ కలిపి తీసుకోవచ్చు లేదా బ్లాక్‌కాఫీ రూపంలోనూ తాగొచ్చు. మసాలా టీ మాదిరి ఈ కాఫీ కూడా  ఘాటుతో, అదే రుచితో వస్తుంది కాబట్టి జలుబు, దగ్గు లాంటివి ఉన్నప్పుడు... ఒక కప్పు తాగితే సరిపోతుంది. ఏమంటారూ!


ఇది డ్రైఫ్రూట్స్‌ సూప్‌...

బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్‌మిస్‌, వాల్‌నట్లు... ఇలా చెప్పుకుంటూ పోతే డ్రైఫ్రూట్స్‌ చాలా రకాలే ఉంటాయి. వాటన్నింటినీ నానబెట్టుకుని తినడం లేదా పొడిచేసుకుని పాలతో కలిపి తాగడం ఎప్పటినుంచో చేస్తున్నదే. కానీ డ్రైఫ్రూట్స్‌ను ఇంకాస్త వెరైటీగా తీసుకోవాలనుకునేవారికోసం ఇప్పుడు ‘లోటస్‌ రూట్‌ పౌడర్‌ డ్రైఫ్రూట్స్‌ సూప్‌ మిక్స్‌’ దొరుకుతోంది. చిక్కగా, డ్రైఫ్రూట్స్‌ పలుకులతో వచ్చే ఈ సూప్‌ తియ్యగా ఉండటంతోపాటు ఎన్నో పోషకాలనూ అందిస్తుంది. అదెలాగంటే... ఈ సూప్‌ మిక్స్‌ తయారీలో బరకగా చేసిన తామరతూడుల పొడి, జీడిపప్పు, బాదం, ఖర్జూరం, చియా సీడ్స్‌, గుమ్మడి గింజలు, గులాబీరేకులు, కిస్‌మిస్‌, వాల్‌నట్లు... ఇలా అన్నీ ఉంటాయి. ఒకటి రెండు చెంచాల పొడిని కప్పులో తీసుకుని వేడినీళ్లు పోస్తూ కలిపితే చాలు చిక్కని డ్రైఫ్రూట్స్‌ సూప్‌ రెడీ అయిపోతుంది. ఒక కప్పు నిండా తీసుకుంటే పొట్ట నిండినట్లుగా అనిపించే ఈ సూప్‌ను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తున్నారు పోషకాహార నిపుణులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..